– 100 రోజుల్లో డిప్యూటీ సీఎం నిర్ణయాల పెను సంచలనం
అమరావతి: ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో అప్పుడు.. ఇప్పుడు, ఎప్పుడూ తాను కీలకమని చాటుకోవడంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో ఆయన సంచలనాలకు వేదికగా మారారు. గడిచిన వంద రోజుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు రాజకీయాల్లో తలపండిన నేతలకు సైతం సాధ్యం కాని రీతిలో ఆయన ఇటు ప్రభుత్వంలోనూ.. అటు పార్టీలోనూ పెను సంచలనంగా మారారు. ఓవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు మరింత ప్రాధాన్యత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో డిప్యూటీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సర్పంచ్లకు తిరిగి సర్వాధికారాలు దక్కేలా చేశారు. గతంలో కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దీన స్థితిలో ఉన్న పంచాయతీల పాలనను ఆయన కేవలం 100 రోజుల వ్యవధిలోనే గాడిలో పెట్టి తానంటే ఏమిటో చాటుకున్నారు. పంచాయతీల్లో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులను కూడా మంజూరు చేయించారు.
ప్రస్తుతం పల్లెలు అభివృద్ధి బాట వైపు పయణిస్తున్నాయి. కేవలం వంద రోజుల వ్యవధిలోనే పల్లె మార్పుకు పవన్ శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పల్లెలు వేదికగా చేసుకునే చేపట్టాలని ఆయన ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. పాలనాపరమైన నిర్ణయాల్లో భేష్ అనిపిస్తున్న పవన్ ఎన్నికలకు ముందు ఉన్న దూకుడుకు భిన్నంగా ఆయన స్టైల్ను మార్చేసుకున్నారు.
స్వభావానికి ఎన్నికలకు ముందు ఆయా సభలు, సమావేశాల్లో ఆవేశ భరితమైన ప్రసంగాలు, దూకుడుగా వాడి వేడి తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన పవన్… డిప్యూటీగా బాధ్యతలు చేపట్టాక అందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు అవుతూ ఆయా శాఖల పరిధిలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి తనకు తెలియకపోతే ఆ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో స్వయంగా వెళ్ళి పరిశీలించి అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఆటవీ శాఖలో కూడా పెను మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎర్రచందనం చెట్లు నరికివేత, అక్రమ రవాణా, అటవీ సంపద కొల్లగొట్టడం వంటి అక్రమాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో అతి తక్కువ సమయంలోనే పవన్ కల్యాణ్ తన మార్క్ చాటుకున్నారు.