– రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి
– దొంగలెక్కలు మాని నిజాలను ప్రజలముందు ఉంచండి
– ఎఫ్ఆర్ బిఎం కు రెండురెట్లు మించి రాష్ట్ర అప్పులు
– పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్
అమరావతి: రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన నిన్న ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ మా పని తీరు అద్బుతంగా ఉందని తమకు తాము ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు, ఆయన వ్యవహారం చూస్తే తమ కాళ్ళకు తాము నమస్కారం చేసుకొని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్లుగా ఉందని పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గన చెప్పే లెక్కలు చూస్తే మెదటసారి ఆర్దిక శాస్త్రం రాసిన చాణ్యుకుడు కూడ నివ్వెరపోతాడని అన్నారు. పయ్యావుల కేశవ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
దేశంలో ఆర్దిక శాస్త్రవేతలు నివ్వెరపోయేలా ఒక ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇంతలా పతనం చేయవచ్చా అన్నట్టు నడుపుతున్న మీరు గొప్పగా చేశామని చెప్పుకొవడం మీకే చెల్లింది. రోజుకో ప్రకటన వస్తుంది. ఒకసారి కరోనా ఉన్నా అద్బుతంగా చేశామని చెబుతారు, మరోకసారి కరోనా వల్ల ఆదాయం తగ్గింది అంటారు, ఏది నిజం? మీరు ఎక్కడ నిజాలు చెప్పడం లేదు. మీకు ఒక శాపం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజాలు చెబితే మీ తల వేయి ముక్కల అవుతుంది. చివరికి శాసన సభలో కూడ అబద్దాలు చెబుతున్నారు.
నేను నేరుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా? దమ్ముంటే సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత? చేస్తున్న మూల ధన వ్యయం ఎంత? సంక్షేమానికి ఖర్చు చేస్తున్నదెంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? మీ దుబారాకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రకటనలకు ఖర్చు చేస్తున్నారు? రెవిన్యూ వ్యయం ఎంతో లెక్క చెప్పండి. కొన్ని పధకాలకు మీరు చేస్తున్న ఖర్చుకంటే ప్రకటనల ఖర్చు ఎక్కువగా ఉంటోంది. నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా? మరో నెలరోజుల్లో జరిగే బడ్జెట్ సమావేశాలలో మళ్ళీ మాయ లెక్కలు చెప్పడానికి సిద్దమవుతున్నారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై శ్వేత్వ పత్రం విడుదల చేయండి.
కార్పోరేషన్ల ద్వారా చేసిన రుణాలు ఎంత? మీరు ఎంత అప్పులు చేశారు? రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పండి. బ్యాంకులకు వెళ్ళి ఒక నోట్ ఇస్తారు… ఆర్.బి.ఐ కి ఒక నోట్ ఇస్తారు? కేంద్రానికి ఒక నోట్ ఇస్తారు? ఓపెన్ మార్కెట్లో లోన్లు కావాల్సి వచ్చినప్పుడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకొంటారు? ఈవిధంగా అడ్డమైన దార్లు తొక్కుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. మాకు దమ్ము, నిజాయితీ ఉంది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చు చేసిందనే విషయాలను వివరంగా సిఎం డ్యాష్ బోర్డులో ఉంచాం.
నేడు ఒక ఎక్సైజ్ ఆదాయం తప్ప ఏదీ సిఎం డ్యాష్ బోర్డులో ఉంచడం లేదు. అది కూడ మీ కమీషన్ లెక్కల కోసం పెడుతున్నట్లు ఉంది. మూలధన వ్యయం బాగా చేశామని చెబుతున్నారు. ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారో ఒక శాఖను చెప్పమనండి. శాఖలా వారిగా వివరాలు ఇవ్వండి. గత మూడేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పండి, ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు చెప్పగలరా? ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? పోలవరం ఎంత ఖర్చు చేశారు చెప్పండి.
ఎఫ్.ఆర్.బి.ఎం ప్రకారం చేస్తున్నామని నిన్న పత్రికాప్రకటనలో బుగ్గన చెప్పారు. ఎప్.ఆర్.బి.ఎం ప్రకారం చేస్తే కేంద్రప్రభుత్వం రూ. 17 వేల కోట్లు ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పండి. పరిమితికి మించి అప్పులు చేసినందుకు కాదా? మీరు వెళ్లి బ్రతిమాలితే కేంద్రం ఏడాదికి రూ. 5 వేల కోట్లు రికవరీ చేస్తామని వెసలుబాటు ఇచ్చింది. అసలు లెక్కలు తీస్తే ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితికి మించి రెండు రెట్లు అదనంగా అప్పులు చేశారు. ఎఫ్ఆర్ బిఎం గ్యారంటీలను ఏ రాష్ట్రం పెంచనంతగా పెంచారు, నేను నిరూపిస్తా.
గతంలో పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాల నుండి పారిశ్రామికవేత్తలు వస్తే ఇప్పుడు అప్పులు వాళ్ళు రాష్ట్రానికి వస్తున్న దుస్థితి నెలకొంది. విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశారు. మీరు అద్బుతంగా పనిచేస్తే ఎందుకు మీకు లోన్ ఇచ్చే దానికి ఏ బ్యాంక్ ముందుకు రావడం లేదు? ఎందుకంటే మీ బండారం అంతా తెలిసిపోయింది, మీరు ఈఎంఐ లు కూడా కట్టే పరిస్థితి లేదు కాబట్టి. ఏ రకంగా రాష్ట్ర ఆర్దిక పరిస్దితి మెరుగుపడిందో చెప్పండి? పెట్టుబడులు వచ్చాయా? కంపెనీలు వచ్చాయా చెప్పండి? ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి. రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని కోలుకోలేని విధంగా దెబ్బ తీసి మళ్ళీ మేము అద్బుతంగా చేస్తున్నామని రాష్ట్రప్రజలను వంచిస్తున్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్థ విధానాలతో 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళారు. దీని వల్ల భవిష్యత్ తరాలు నష్ట పోయే పరిస్దితి నెలకొంది.
మీ పనితీరు అద్బుతంగా ఉంటే తెలంగాణతో సమానంగా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేక పోతున్నారు? ఉద్యోగులు అడిగితే కరోనా అంటున్నారు, కరోనా ఒక్క ఎపిలోనే కాదు… దేశం మొత్తం ఉంది. పక్క రాష్ట్రాలకు లేని ఇబ్బంది మీకే ఎందుకు వచ్చింది? ఇప్పటికైనా దొంగలెక్కలు మాని రాష్ట్రప్రజల ముందు నిజాలు ఉంచాల్సిందిగా పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.