– ఆయా కేంద్రాలను సందర్శించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు
కాకినాడ: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు… కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి సందర్శించారు. ముందుగా వారు కాకినాడ రూరల్, కరప మండలం పగడాలపేట ఉప్పలంక ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
తదనంతరం పగడాలపేటలో పర్యటించి, పాకల్లో నివసిస్తున్న ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంతవరకు కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాన్ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సీనియర్ నాయకులు తోట నవీన్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.