భారత రాజకీయాలలో ‘వ్యక్తి పూజ’ పెరిగిపోయింది.దీన్ని ‘వ్యక్తి ఆరాధన’గా కూడా చెబుతుంటాం.ప్రాంతీయ పార్టీలంటే సహజంగానే ఆయా పార్టీలను స్థాపించి దానికొక దశ,దిశను ఇచ్చి తమ ఆలోచనలు, సృజనాత్మక చర్యలతో ప్రజల్ని ప్రభావితం చేసి, పార్టీ మనుగడకు కారణమైనందున అలాంటి నాయకుడ్ని ఆరాధించడం తప్పు కాదు.పైగా ఆయా ప్రాంతీయపార్టీలన్నీ వ్యక్తి ‘కేంద్రం’గానే సాగుతాయి.సదరు నాయకుని చుట్టే పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్రీకృతమై ఉంటాయి.కేసీఆర్,చంద్రబాబు నాయుడు, జగన్, నితీష్ కుమార్,జేడీఎస్ కుమారస్వామి,స్టాలిన్,మమతాబెనర్జీ,అఖిలేశ్ యాదవ్,ఉద్ధవ్ థాక్రే,కేజ్రీవాల్ తదితరుల ప్రాంతీయ పార్టీలలో ఆయా నాయకులే కేంద్రబిందువు.వారే సర్వస్వం.’నియంత పోకడ’లు అనుకున్నా,మరో రకమైన నిందలు వేసినా ఆయా పార్టీల అధినేతల ఆలోచనలే ఆ పార్టీల విధానాలు.శాసనాలు.
కానీ జాతీయ పార్టీలలోనూ ఈ సంస్కృతి పునాదులు ఏర్పరచుకోవడం,అపరిమితంగా విస్తరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతమాత్రం మంచిది కాదు.అది ప్రమాదం కూడా.పైగా ప్రాంతీయ పార్టీలను ‘అంతం’ చేయాలని మోడీ ప్రణాళికలను రచిస్తున్నారు.ఇది కాంగ్రెస్ నమూనా ఎత్తుగడ.కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేసి భగ్నమైంది. మోడీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు.పలు రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నవి.తమ ఆశలు,ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి సామర్ధ్యాలు ప్రాంతీయ పార్టీలకే ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారు.ఉదాహరణకు తెలంగాణాలో బీజేపీ నాయకులు ఎన్ని ‘కుప్పిగంతులు’ వేస్తున్నా,రెచ్చగొడుతున్నా,ఉద్రిక్తతల కోసం ప్రయత్నిస్తున్నా టిఆర్ఎస్ ను, ఆ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొనలేకపోతున్నారు.
కాగా సిద్ధాంతపరమైన రాజకీయాల నుంచి వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు నడవడం అడుగడుగునా చూస్తున్నాం. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ లాంటి వారి వ్యక్తిగత ఆకర్షణ వల్ల,వారే వారసత్వంగా పరిపాలించినందున కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా నిందలు భరిస్తున్నది. కానీ గొప్ప సైద్ధాంతిక పునాదులతో ఏర్పడిన పార్టీగా చెప్పుకునే బీజేపీ ‘వ్యక్తి కేంద్రం’గా మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ‘మైనస్ మోడీ’ బీజేపీ శూన్యం అనే ఒక వాతావరణాన్ని సృష్టించారు.ఆయన ఆకర్షణ, హావభావాలు, రాజకీయ విన్యాసాలు,రకరకాల పన్నాగాలు, ప్రత్యర్థుల మెడలు వంచే కుటిల ప్రయత్నాలు, వారిని లొంగదీసుకునేందుకు నిరంతరం జరిపే కసరత్తు, ఆకర్షణీయ వస్త్రధారణ,జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాల కారణంగానే బీజేపీ బలపడిందని ఆ పార్టీ శ్రేణులు నమ్మే పరిస్థితులు నెలకొన్నవి. కాంగ్రెస్ పార్టీలో ‘వ్యక్తి పూజ’ కారణంగా అది భజనపరుల పార్టీగా మారింది. ముఠాలు, వర్గాలుగా చీలిపోయింది.సింధియా వంటి రాహుల్ గాంధీ సన్నిహితులు కూడా పార్టీని విడిచి వెళ్లారు.యువతరానికి తగిన ప్రాతినిధ్యం,ప్రాధాన్యం,గుర్తింపు ఇవ్వడంలో ‘ముసలి పార్టీ’ విఫలమైంది. గుజరాత్ లో అయినా మరో రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం ఏర్పడడం వల్లనే ఇతర పార్టీలు పుంజుకున్న చరిత్ర మనకు తెలుసు.
అంతే కాకుండా మమతా బెనర్జీ,శరద్ పవార్ తదితరులందరూ కాంగ్రెస్ నుంచి వేరుపడి ‘సొంత కుంపటి’ పెట్టుకున్నవారే.టిఆర్ఎస్, డీఎంకే,అన్నాడీఎంకే,వైసీపీ,ఆప్ వంటి పార్టీలు కాంగ్రెస్ వైఫల్యాలతో తమ రాష్ట్రాలలో తిరుగులేని పార్టీలుగా మారిపోయినవి.యుపిఏ 2004 – 2014 లో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నందున బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు.ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.గడచిన ఎనిమిదేండ్లలో మోడీ తన ‘సంఘ్’,రాజకీయ పార్టీ బీజేపీల కన్నా ‘మించిపోవడాన్ని’ చూస్తున్నాం. తన మాయాజాలం,అమిత్ షా ‘రణతంత్రపు టెత్తులు’ ఇందుకు పనికొచ్చాయి.
సంస్థ కన్నా వ్యక్తి ప్రాధాన్యత పెరిగిపోవడం బీజేపీని కలవరపరుస్తోంది. హిందుత్వ భావజాలం కన్నా,పార్టీ సిద్ధాంతాల కన్నా మోదీ వ్యక్తిత్వమే పార్టీ నిర్ణయాల్లో కీలకంగా మారినవి. ‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర’ అని చరిత్రలో కొందరు నెహ్రు కుటుంబ భజనపరులు ప్రచారం చేశారు.ఆ ప్రచారం తీవ్ర విమర్శలకు గురైంది.ప్రస్తుతం మోదీయే ఇండియా, ఇండియాయే మోదీ అని ‘మోడీ భక్తులు’ అంటున్నారు.ఇది ఇంకా ఎంత దూరం వెడుతుందో తెలియదు. ప్రధానమంత్రి మోదీ అవలంబిస్తున్న విధానాలు,ప్రజల తీర్పును ‘తారుమారు’ చేసి కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని బిజెపి కబళించిన వైనం ఆ పార్టీ సిద్ధాంత కర్తలకు,నాగపూర్ శిబిరానికి నచ్చడం లేదు. ప్రత్యర్థులను అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నట్టు ఆరోపణలను మోడీ,అమిత్ షా ఎదుర్కుంటున్నారు. బీజేపీలోని హేమాహేమీలంతా మోదీకి భజన చేయవలసిందే.లేదంటే అద్వానీకి జరుగుతున్న ‘అవమానాలే’ మిగతావాండ్లు కూడా చవిచూడాలి.
ప్రాంతీయపార్టీల అధినేతలు తమ పార్టీలను సొంత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చుకుంటున్నట్టుగా బీజేపీని సైతం ‘వ్యక్తి ఆధారిత పార్టీ’గా మోడీ మార్చేశారు.ఆయన కార్పొరేట్ల,బహుళజాతి సంస్థల ప్రయోజనాలకే అధికప్రయోజనం కలిగించే చర్యలు చేపడుతున్నట్టు ఆర్ఎస్ఎస్ నాయకుల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బిజెపి ఒక జాతీయ శక్తిగా ఆవిర్భవించడం వెనుక, రెండు లోక్ సభ సీట్ల నుంచి 303 సీట్ల వరకు ఎదిగిన తీరు వెనుక అద్వానీ ‘కాంట్రిబ్యూషన్’ ఉన్నది. ఒక సైద్ధాంతిక భావజాలం గల పార్టీగా బిజెపిని ప్రజలముందుకు తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అమోఘం.అద్వానీని పకడ్బందీగా మోడీ,అమిత్ షా పక్కకు నెట్టివేశారు.అద్వానీ సేవలనూ పూర్వపక్షం చేశారు.అద్వానీ రథయాత్ర, రామజన్మభూమి ఉద్యమం, 1992లో బాబ్రీమసీదు కట్టడం కూల్చివేత తర్వాత నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీల రద్దు కాగా మూడు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. అయినా బిజెపిని సిద్ధాంత ఆధారిత పార్టీగా మార్చేందుకు అద్వానీ ప్రయత్నించారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సారథ్యంలో ఒక సైద్ధాంతిక పునాది వల్లనే బిజెపి వివిధ రాష్ట్రాల్లో బలోపేతం అయిందని చెప్పడానికి మోడీ సిద్ధంగా లేరు.ఒక్క మాటలో చెప్పాలంటే తన ఛరిష్మ, గుజరాత్ లో అమలు చేసిన అభివృద్ధి కార్యకలాపాలు,తన వాక్చాతుర్యం కారణంగానే ఢిల్లీని కైవసం చేసుకున్నట్టు ప్రధాని భావిస్తున్నారు.
పార్టీలో,పరిపాలనలో అడుగడుగునా ‘తన ముద్ర’ ను ప్రదర్శిస్తున్నారు.తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నప్పటికీ రైతులకు సంబంధించిన ‘నల్ల చట్టాలను’ ఉపసంహరించుకోక తప్పలేదు.బీజేపీని సంప్రదాయ,సిద్ధాంత భావజాలం నుంచి కార్పొరేట్ పార్టీగా మార్చిన మోడీకి 2024 ఎన్నికలు నల్లేరు మీద నడక కాదు.
-ఎస్.కె జకీర్