– కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం
– రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి
– ఎంఎస్పీ రేటుకు అనుగుణంగా కొనుగోలు చేయాలి
– రైతులకు ఎంఎస్పీ రేటు, బోనస్, భరోసా ఇవ్వాలి
భారతీయ జనతా కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య
హైదరాబాద్: వానాకాలం సీజన్ ముగిసింది. రాష్ట్రంలో పుష్కలంగా వరిధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 48 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయినప్పటికీ, ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే అకాల వర్షాలతో అనేక ప్రాంతాల్లో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వరిధాన్యం తడిసి రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక ఆలస్యం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని, దానికి కావాల్సిన నిధులు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించినా, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో రైతులు మరింత కష్టాల్లో పడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ, వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని ఎంఎస్పీ రేటుకు అనుగుణంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
అలాగే రైస్ మిల్లర్లను కూడా రైతులను మోసం చేయకుండా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ రేటుకే కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ రేటుకు అనుగుణంగా కొనుగోలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన అవినీతి వ్యవస్థనే కొనసాగిస్తోంది. రైస్ మిల్లర్లు, కొంతమంది అధికారులతో కుమ్మక్కై రైతులకు నష్టం కలిగించే విధంగా కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. ఈ అవినీతి వ్యవస్థను రద్దు చేసి, పారదర్శక పద్ధతుల్లో పంట కొనుగోలు జరగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.
సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ చొప్పున ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు చెప్పినా ఇప్పటివరకు ఒక్క రూపాయిని కూడా ఇవ్వలేదు. “రైతు భరోసా” పేరుతో ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. వానకాలం పంటలో వేలాది మంది రైతులు ఆ సాయం లేక నష్టపోయారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అర్హులైన ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలి.
రైతు హక్కుల కోసం మాట్లాడిన బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికం. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను రాజకీయ పనిముట్లలాగా వాడుకుంటోంది. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇదే సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” రైతుల జీవితాల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురాబోతుంది.
నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్, జనగాం జిల్లాలు ఈ యోజనలో ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం. ఆరు సంవత్సరాలకు రూ.5760 కోట్లు ఈ జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక, మత్స్య, ఉద్యాన వనరుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇంకా యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంలో విషలం.., కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం, రైతుల పట్ల నిర్లిప్తత – ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే.
రైతులకు సరైన ఎంఎస్పీ రేటు, బోనస్, భరోసా ఇవ్వాలి, అవినీతి రహిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. దేశ అభివృద్ధి రైతు అభివృద్ధిలోనే ఉందన్న దృఢ నమ్మకంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణ రైతులు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొంది, ఆత్మనిర్భర దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.