Suryaa.co.in

Telangana

మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా పోచంపల్లి చేనేతలు

– పోచంపల్లి లో తెలంగాణ ఐకానిక్ చేనేతలను ప్రదర్శించే సాంప్రదాయక గ్రాండ్ ఫ్యాషన్ షో
– చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం చేనేత & సాంస్కృతిక వైభవానికి ప్రతీక
– మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో తెలంగాణ చేనేత వారసత్వాన్ని, శతాబ్దాల నాటి వస్త్ర సంప్రదాయాలను హైలైట్ చేయడం లక్ష్యం

మే 15, 2025న జరగనున్న మిస్ వరల్డ్ ఫెస్టివల్‌కు సన్నాహాక కార్యక్రమాలను పర్యవేక్షించడానికి UNWTO గుర్తింపు పొందిన, తెలంగాణ చేనేత ఐకాన్ పోచంపల్లి గ్రామాన్ని రాష్ట్ర పర్యాటక కార్యదర్శి స్మితా సభర్వాల్ సందర్శించారు.

తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలను, చేనేత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించడానికి మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా Experiential Handlooms Tour at Pochampally Village కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చేనేత కళాత్మకతను పోచంపల్లిలో అనుభవపూర్వక తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ గొప్పగా నిర్వహిస్తుంది. ఐకానిక్ చేనేతలను ప్రదర్శించే గ్రాండ్ ఫ్యాషన్ షో లో తెలంగాణ శతాబ్దాల నాటి వస్త్ర సంప్రదాయాలను, చేనేత కళాత్మకతను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం లో ఆకర్షణీయమైన తెలంగాణ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి, వీటిలో డైనమిక్ “చిందు యక్షగానం” మనోహరమైన “మెటల్ కెన్నెరా”, లయబద్ధమైన “రింజా” సంగీత ప్రదర్శనలు ఉండేలా తెలంగాణ పర్యాటక శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది.

“మిస్ వరల్డ్ పోటీదారులకు ఆతిథ్యం ఇవ్వడం, తెలంగాణ యొక్క ప్రత్యేకమైన చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్. ఈ కార్యక్రమం ద్వారా మన చేతివృత్తులవారి నైపుణ్యం, తెలంగాణ గుర్తింపు, సంప్రదాయాల వేడుక ను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రపంచాన్ని పోచంపల్లికి స్వాగతించడానికి పర్యాటక ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళ, సంస్కృతి మరియు వారసత్వం కలిగి ఉన్న ఈ వేడుకలో పాల్గొనాలని మీడియా, టూరిజం స్టేక్ హోల్డర్లను కోరారు.

LEAVE A RESPONSE