Advertisements

రమామణి మృతిపై పెరుగుతున్న ఆరోపణలు
విచారించాలని డిఓపీటీకి బీజేపీ నేత రఘురాం ఫిర్యాదు
డీఓపీటీ వరకూ వెళ్లిన ప్రవీణ్ వ్యవహారశైలి
ప్రవీణ్ వేధింపులే కారణమంటున్న కుటుంబసభ్యులు
మరో ఐఏఎస్ అధికారిపైనా ఒత్తిళ్ల ఆరోపణలు
పోస్టింగు ఇవ్వని మానసిక వేదనతోనే మృతి చెందారంటున్న కుటుంబసభ్యులు
ప్రవీణ్‌పై చర్య తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ నేత శ్రీధర్ డిమాండ్
‘సూర్య’కు ప్రత్యేకం
(మార్తి సుబ్రహ్మణ్యం)

మహిళా ఐఏఎస్ అధికారిణి రమామణి ఆకస్మిక మృతి వ్యవహారం అటు ఇటు తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ప్రకాష్, వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్న మరో కీలక అధికారికి చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. రెండునెలల పాటు ఎలాంటి పోస్టింగు లేకుండా, తనను వెయిటింగ్‌లో ఉంచడంతో మానసికక్షోభకు గురయిన రమామణి, అర్ధంతరంగా తనువు చాలించారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు, ఈ వ్యవహారంలో ప్రవీణ్‌ప్రకాష్ పాత్రపై విచారించి చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఏపీ-తెలంగాణ సమన్వయకర్త, ఆ పార్టీ అధికారప్రతినిధి పురిఘళ్ల రఘురాం డిఓపీటీకి లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. దీనితో ప్రవీణ్ ప్రకాష్ చిక్కుల్లోపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అటు బ్రాహ్మణ సంఘాలు కూడా రమామణి మృతికి.. పోస్టింగు ఇవ్వకుండా వేధించిన ప్రవీణ్‌ప్రకాష్ వ్యవహారశైలినే కారణమంటూ రోడ్డెక్కాయి. ఆ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్, శిరిపురపు శ్రీధర్‌శర్మ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.

విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తారన్న పేరున్న ఐఏఎస్ అధికారిణి రమామణి ఆకస్మిక మృతికి.. ఉన్నతాధికారుల మానసిక వేధింపులే కారణమన్న ఆరోపణలు, స్వయంగా ఆమె కుటుంబసభ్యుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. రెండునెలల పాటు పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచినందుకే, ఆమె మానసిక క్షోభకు గురయి మృతి చెందారని ఆమె సోదరుడు కృష్ణమూర్తి ‘సూర్య’ వద్ద వాపోయారు.

ఫేస్‌బుక్,ట్విట్టర్ అకౌంట్ ఉందా అని ఆరా తీశారు..

‘‘ఇంట్లో ఖాళీగా ఉండి జీతం తీసుకోవడాన్ని ఆమె అవమానంగా భావించారు. ప్రవీణ్‌ప్రకాష్ వద్దకు వెళ్లి పోస్టింగు గురించి అడిగితే.. ఆయన మీరు ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారన్న ఫిర్యాదులున్నాయని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారట. అయితే నాకు వాట్సాప్ తప్ప ఎలాంటి అకౌంట్లు లేవని రమామణి చెప్పారు. అయితే వాట్సాప్‌లోనే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట అని మళ్లీ ప్రవీణ్‌గారు అన్నారట. దానితో ఆమె మరింత కుంగిపోయింది. తనకు పోస్టింగు ఇవ్వకుండా కావాలనే ఇవన్నీ చేస్తున్నారని ఆమెకు అర్ధమయింది. రమామణి చాలా ధైర్యస్తురాలు. విధినిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గదు. పై అధికారులు లిఖితపూర్వక ఆదేశాలిస్తే తప్ప, నోటిమాటగా చెప్పే ఎలాంటి ఆదేశాలను పాటించదు. అలాంటి ఆమె, పోస్టింగు ఇవ్వనందుకు మాసికవేదనతో కృంగిపోయి మరణించడం కలచివేస్తుంది. ప్రభుత్వాలు వస్తాయి. పోతాయి. కానీ అధికారులు ఎక్కడున్నా పనిచేయాల్సిందే కదా? ఆ మాత్రం జ్ఞానం లేని వాళ్లు సీఎంల చుట్టూ చేరి, అధికారులకు పోస్టింగులివ్వకపోవడం దారుణం. ఏపీలో ఇలాంటి అరాచకపరిస్థితి వస్తుందని రమామణి ఎప్పుడూ ఊహించలేదు. ఆమెకు పోస్టింగు ఇవ్వకుండా వేధించిన ప్రవీణ్‌ప్రకాష్, చనిపోయినప్పుడు ఆసుపత్రికి మాత్రం రావడం మాకు ఆశ్చర్యం, అనుమానం కలుగుతోంది. ఏదేమైనా రమామణి వంటి ఒక ఐఏఎస్ అధికారికే ఇన్ని వేధింపులు ఎదురవుతుంటే, ఇక కిందిస్థాయి అధికారుల పరిస్థితి ఏమిటో తలచుకుంటేనే భయమేస్తోందని’ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ ఐఏఎస్ అధికారి కూడా ఆమెను వేధించారు..

అయితే, రమామణికి టీటీడీ జేఈఓగా వచ్చిన పోస్టింగుకు కూడా అడ్డుపడి, మరో మహిళను ఆ పోస్టులో నియమించారని కృష్ణమూర్తి మరో కొత్త విషయం వెల్లడించారు.‘రమామణి పనిచేస్తున్న వాణిజ్య శాఖ ఉన్నతాధికారి భార్య ఢిల్లీలో ఉంటారు. ఆమె కారు బిల్లులు కూడా రమామణిని చెల్లించాలని రమామణిపై ఆ ఐఏఎస్ ఒత్తిడి చేశారు. పేషీ ఖర్చులు కూడా అడిగారు. అందుకూ రమామణి ఒప్పుకోలేదు. ఏదైనా ఉంటే కాగితంపై ఇవ్వాలనేది. ఢిల్లీలోనే ఉంటున్న ఇద్దరు ఐఏఎస్‌ల భార్యల ఖర్చులకు డబ్బులు రమామణి ఎందుకు ఇవ్వాలి?  మధ్యలో ఆమె ట్రైనింగ్ కోసం ముస్సోరీ వెళ్లారు. అప్పుడు తన స్థానంలో ఒక తహశీల్దారు క్యాడర్ వ్యక్తిని ఆయన పేషీలో పెట్టుకున్నారు. ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చిన రమామణికి మాత్రం పోస్టింగు ఇవ్వలేదు. సీఎంఓలో ఉన్న ప్రవీణ్‌ప్రకాష్, ఆయన ఇద్దరూ గురుశిష్యులు. విశాఖలో ఉన్నప్పుడు కలిసే పనిచేశారు. అందుకే రమామణికి పోస్టింగు ఇవ్వకుండా అడ్డుపడ్డారు’ అని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: పోస్టింగులు.. ఊస్టింగులతో.. చావే గతి!

కరోనా చావులో కలిపేసేవారేమో?

రమామణి  బతికి ఉన్నప్పుడు పోస్టింగు ఇవ్వకుండా వేధించిన ప్రవీణ్ ప్రకాష్, ఆమె చనిపోయినప్పుడు మాత్రం ఆసుపత్రికి వెళ్లడం తమకు ఆశ్చర్యం అనిపించిందని కృష్ణమూర్తి చెప్పారు.  ఒకదశలో ఆసుపత్రి వర్గాలపై రమామణి మృతిని కరోనా  ఖాతాలో వేయాలన్న ప్రయత్నం పైస్ధాయిలో  జరిగిందన్న ప్రచారం తమ వరకూ వచ్చింద న్నారు. ‘బహుశా మానసిక వేదికతో మరణించిందంటే అది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందేమోనని భయపడి, కరోనా ఖాతాలో కలిపితే ఎలాంటి వివాదం ఉండదన్న ముందుచూపుతో, కొందరు అధికారులు అలా ఒత్తిళ్లు చేసి ఉండవచ్చేమోనని అనుకున్నాం’ అన్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ప్రభుత్వ వైద్యులు చాలా సహాయం చేశారన్నారు. నిజంగా వాళ్లు రాకపోతే, రమామణి మృతిని కరోనా ఖాతాలో కలిపినా అడిగే వారు లేరన్నారు.

ఎంతవరకయినా పోరాడతా..

‘‘నా సోదరికి జరిగిన అన్యాయంపై చాలామంది స్పందిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ నాయకుడు రఘురాం గారు, గుంటూరు బ్రాహ్మణ సంఘం నేత శ్రీధర్‌గారు ఇంకా చాలామంది  ఆమెకు జరిగిన అన్యాయంపై మాట్లాడారు.  మీకు నిజాలు చెప్పారు. వాళ్లకు మా కృతజ్ఞతలు. మా సోదరికి పోస్టింగు ఇవ్వకుండా మానసికంగా వేధించిన ప్రవీణ్‌ప్రకాష్, పియూష్‌కుమార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికోసం ఎక్కడివరకయినా వెళతాన’ని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఇలాంటి అన్యాయం మరొక అధికారికి జరగకూడదని, సాటి అధికారులే సహచర అధికారులను పోస్టింగులు ఇవ్వకుండా వేధించడం దారుణమన్నారు. కాకులు కూడా ఒక కాకి చస్తే పదికాకులు వస్తాయని, కానీ రమామణి విషయంలో ఐఏఎస్ అధికారుల మౌనం చూస్తే, కాకులకున్న ఐకమత్యం కూడా వాళ్లలో లేదనిపిస్తోంద’ని వ్యాఖ్యానించారు.

ఆమె జీతంపైనే కుటుంబం ఆధారం..

కాగా ఇద్దరు కుమారులున్న రమామణి జీతం మీదనే ఆమె కుటుంబం ఆధారపడుతోంది. భర్త మురళీమోహన్ గతంలో ‘స్టెప్’ సొసైటీలో ఉద్యోగిగా పనిచేసినప్పటికీ, పెన్షన్ రాదు. పెద్ద కుమారుడు ఎమ్మెస్సీ పూర్తి చేయగా, రెండవ కుమారుడు బెంగళూరులో చదువుకుంటున్నారు. ‘మా కుటుంబం మొత్తం రమామణి జీతంపైనే ఆధారపడి ఉంది. నేను 85 ఏళ్ల వృద్ధురాలైన నా తల్లికి సేవచేస్తున్నా. మధ్యలో ఈ దుర్వార్త మా కుటుంబాన్ని అనాధను చేసింది. ఇప్పుడు మేం ఇంకా శ్మశానంలోనే ఉన్నాం. కర్మకాండలు జరుగుతున్నాయి. తనకు పోస్టింగు రాలేదని రమామణి కలతచెందేది. మానసిక వేదన చెందేది. తర్వాత ఇస్తారేమో చూద్దామని నేను నచ్చచెప్పేవాడిని. ఆ బాధ తనలో ఎక్కువగా ఉండేది. నాకంటే తన సోదరుడికే ఆమె అన్ని విషయాలూ చెప్పేది.  ఏదేమైనా మా కుటుంబానికి అన్యాయం జరిగింది. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతా’నని రమామణి భర్త మురళీమోహన్ ఆవేదనతో చెప్పారు.

ప్రవీణ్‌పై చర్య తీసుకోండి: బీజేపీ నేత రఘురాం ఫిర్యాదు

రమామణికి పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధించడమే ఆమె మృతికి కారణమన్న ఆరోపణల నేపథ్యంలో.. ఢిల్లీలో ఏపీ-తెలంగాణ బీజే పీ సమన్వయకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురాం డిఓపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శికి రాసిన లేఖ.. ఏపీలో పోస్టింగులు లేక, మానసిక వేదన చెందుతున్న అధికారుల దుస్థితిని బహిర్గతం చేసింది. ఐఏఎస్ రమామణి మృతిపై రఘురాం రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది.

రఘురాం తన లేఖలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ-జీఏడీ సెక్రటరీ అదనపు హోదాలో జమిలి పాత్ర పోషిస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొందన్నారు. సీఎంఓలో సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆదేశాలిచ్చి, ప్రభుత్వపరంగా జీఏడీ అధికారి హోదాలో  అమలుచేస్తున్న  తీరు బిజినెస్ రూల్సుకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఆయన అహంకారపూరిత స్వభావం వల్లనే, ఐఏఎస్ అధికారిణి రమామణి మృతి చెందాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

The Secretary,
DOPT, GoI,
New Delhi
Sub: complaint against Shri Praveen Prakash, IAS, AP Cadre – Reg
Dear Sir,
I am herewith submitting a few lines for your consideration and seek suitable action against the individual.
I am the spokesperson for BJP and  am coordinator at Delhi for Andhra Pradesh and Telangana within BJP.
Mr Praveen Prakash is presently working as Principal Secretary to Chief Minister and on Full Additional Charge as Principal Secretary GAD (Political). This arrangement is very peculiar and is causing a conflict of interest. I explain this as following.
On one hand, as Principal Secretary to CM, he is issuing instructions to himself as Principal Secretary GAD. On the other hand, he is implementing the same instructions issued to himself which will adversely affect the administration. He is issuing some orders at his own discretion violating business rules.
I am bringing to your knowledge about a serious incident that happened due to the arrogant behavior of above individual officer that has led to the demise of senior IAS officer Smt. Ramamani (2010 batch) recently.
According to reports, Mr Praveen Prakash reportedly asked Mrs Ramamani to arrange one AC car for his use in CMO. Further, Sri Praveen Prakash sought from Smt Ramamani a financial underwriting of one lakh rupees a month to meet his office expenses. The deceased officer could not extend the facility sought and politely rejected the financial commitment of Rs one lakh for CMO maintenance as sought by Mr Praveen Prakash. It seems this refusal led to her transfer from that office. Smt Ramamani performed exceedingly well wherever she was posted with absolute honesty and integrity. Her reputation of being a stickler for rules is to be noted here. She comes from a freedom-fighter’s family. She recovered hundreds of acres of government land from illegal occupation in present Telangana state in her earlier stint. As Joint Collector and Additional District Magistrate in Anantapur district she helped the state with brisk land acquisition that helped Union government under Sri Narender Modi ji to locate KIA car factory.
The arrogant behavior of Mr Praveen Prakash had hurt many other Andhra officers.
With his whims and fancies, he is not giving postings for several months to many officers which is denying officers without receiving monthly salaries of those officers.
No opportunity is being given by CMO to these officers to represent their grievances. Please enquire how many officers were kept without postings by present government in this state.
Mr Praveen Prakash is not following business rules in vogue of the state. Earlier, the then chief secretary Shri LV Subrahmanyam had issued a showcase notice for his misconduct and for his role in violation of business rules of AP secretariat in preparation of items to Council of Ministers. As you know, this is a serious charge.
Instead of giving reply to that showcase notice, in turn, the officer has used his influence at CMO and got Sri Subrahmanyam transferred. At the instance of this junior IAS officer, the government had punished senior most bureaucrat of the highest cadre (that is chief secretary). It seems due to such erratic behavior of this officer the ECI had barred him twice (as district collector/magistrate of Visakhapatnam and East Godavari) from participating in election process.
Hence, I request you to constitute a high level of enquiry on the behavior of Mr Praveen Prakash and enquire into his misdeeds to punish him appropriately. If such arrogant and illegal behaviour is allowed to go unpunished then the dream of our government to have good governance is defeated.
Yours faithfully
Raghuram purighalla MBA
Spokesperson BJP AP & Coordinator BJP  AP in Delhi 9810083582

ప్రవీణ్‌పై విచారణ  చేయండి..

‘‘కొద్దికాలంక్రితం ఆయన రమామణిని సీఎంఓ అవసరాల కోసం ఒక ఏసీ కారు అడిగారు. దానితోపాటు ఆఫీసు ఖర్చుల కోసం లక్ష రూపాయలు అడిగారు. అందుకు ఆమె అంగీకరించకుండా సున్నితంగా తిరస్కరించారు. దానితో ఆమెను బదిలీ చేశారు.  నీతిజాయితీ,  స్వాతంత్య్రసమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన రమామణి.. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉండగా, తెలంగాణలో పనిచేసినప్పుడు కబ్జా అయిన వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కాపాడారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రోత్సాహంతో అనంతపురంలో వచ్చిన కియా కార్ల కంపెనీ కోసం భూసేకరణలో కీలకపాత్ర పోషించారు. ప్రవీణ్‌ప్రకాష్ అహంకారపూరిత  వైఖరి వల్ల ఏపీలో చాలామంది అధికారులు, నెలల తరబడి పోస్టింగులు-జీతాలు లేకుండా ఉన్నారు. ఈ అంశంలో సీఎంకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. సీఎంఓకు స్వయంగా  లేఖ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయంలో మీరు విచారణ జరిపితే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ప్రవీణ్‌ప్రకాష్ ఈ విషయంలో బిజినెస్‌రూల్సును ధిక్కరిస్తున్నారు. తనపై స్థాయి అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అయిన ఎల్వీ సుబ్రమణ్యంను.. తన హోదా, సీఎంఓలో ఉన్న పలుకుబడిని అడ్డుపెట్టుకుని, జూనియర్ అధికారి అయిన ప్రవీణ్‌ప్రకాష్ బదిలీ చేసిన విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నా. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో, ఆయన వ్యవహరించిన తీరును భారత ఎన్నికల సంఘం కూడా ఆక్షేపించింది. కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ దుందుడుకు, అహంకారపూరిత వ్యవహారశైలిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి తగిన శిక్ష విధించాలని కోరుతున్నా’నని పురిఘళ్ల తన ఫిర్యాదులో అభ్యర్ధించారు. కాగా, ఇప్పటికే ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారశైలికి సంబంధించిన అంశాలు డీఓపీటీ దృష్టికి వెళ్లాయని, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న  బీజేపీ నాయకుడే, స్వయంగా ఆయనపై చేసిన ఫిర్యాదుపై కదలిక రావడం ఖాయమంటున్నారు.

ప్రవీణ్ ఒత్తిళ్లతో రమామణి మృతి: శ్రీధర్‌శర్మ

పోస్టింగు ఇవ్వకుండా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ చేసిన ఒత్తిళ్లతోనే, ఐఏఎస్ అధికారి రమామణి మృతి చెందారని బ్రాహ్మణ చైతన్యవేదిక కన్వీనర్ శిరిపురపు శ్రీధర్‌శర్మ ఆరోపించారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన అధికారులకు, పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు. ఆయన ఒత్తిళ్లతోనే ఆమె మృతి చెందారన్న విషయం, ఆమె కుటుంబసభ్యుల ద్వారా తమ సంఘం దృష్టికి వచ్చిందన్నారు.

జూనియర్ అధికారి సీనియర్ అధికారికి ఆదేశాలిస్తారా?

‘‘టీటీడీ పోస్టింగ్ వచ్చినా అందులో ఆమె జాయిన్ కాకుండా ప్రవీణ్‌ప్రకాష్ అడ్డుపడ్డారు. ఆ మానసిక క్షోభతోనే ఆమె మరణించారు. ఇలాంటి అధికారిని  సీఎం గారు సీఎంఓలో పెట్టుకుని అభాసుపాలవుతున్నారు. ఇప్పటికైనా సీఎం కళ్లు తెరచి, బ్రాహ్మణ అధికారులను వేధిస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌ను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే బ్రాహ్మణచైతన్య వేదిక రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతుంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంపైనా ఆయన వేధింపులకు పాల్పడ్డారు. ఇంకో సీనియర్ ఐఏఎస్ జేఎస్వీ ప్రసాద్‌కు పోస్టింగు లేకుండా ఇబ్బందిపెట్టారు.  అంటే ఒక చిన్న స్థాయి అధికారి, పెద్ద స్థాయి అధికారులను ఇబ్బందులు పెట్టే యంత్రాంగం సీఎంఓలో ఉండటం దారుణం. రమామణి మృతిని కరోనా చావుగా ప్రకటించాలని గుంటూరు ఆసుపత్రి సూపరెంటెండెంట్‌పై ఒత్తిడి చేసినట్లు, మా బ్రాహ్మణ సంఘం దృష్టికి వచ్చింది. ఇప్పటికైనా ప్రవీణ్‌ప్రకాష్‌పై చర్య తీసుకోకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంద’’ని శ్రీధర్‌శర్మ హెచ్చరించారు.

ఆ వర్గ మీడియాకు ఇది వార్త కాదా..?

కాగా పోస్టింగు ఇవ్వని మానసిక వేదనతో మృతి చెందిన రమామణి వ్యవహారంపై, రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. తమ వర్గానికి చెందిన అధికారులు, నాయకులకు అన్యాయం జరిగితేనే ఈ వర్గ మీడియా స్పందించి డిబేట్లు జరిపి, హడావిడి చేస్తోందంటున్నారు.  బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ మహిళా అధికారి మానసిక వేధింపులతో మృతి చెందితే, దానికి ఆ వర్గం మీడియా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం దారుణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌ను తొలగిస్తే దానిని నానా యాగీ చేసిన మీడియా, రమామణి మృతి వెనుక కోణంపై ఎందుకు డిబేట్లు నిర్వహించలేదని ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆమె వర్గానికి చె ందిన ప్రస్తుత అధికారులు, రిటైర్డ్ అధికారులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటంపై బ్రాహ్మణ కుల సంఘ నేతలు ఆక్షేపిస్తున్నారు.‘ రమామణి ఏ కమ్మ లేదా ఎస్సీ మహిళ అయి ఉంటే ఈ మీడియా మౌనంగా ఉండేదా? ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉండేవా? నిమ్మగడ్డ రమేష్ కోసం పోరాడుతున్న టీడీపీ రమామణి మృతి విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? ఒక ప్రకటన ఇస్తే సరిపోతుందా? మరి నిమ్మగడ్డ అంశంలోనూ అలాగే ప్రకటన ఇచ్చి మౌనంగా ఉండవచ్చు కదా. అంటే వాళ్ల కులంవాళ్లకు అన్యాయం జరిగితేనే స్పందిస్తారా? ఆ కులానికి చెందిన మీడియా కూడా అలాగే వ్యవహరిస్తోంది. వాళ్లే కాదు. బ్రాహ్మణ కులానికి చెందిన అధికారులు, రిటైర్డ్ అధికారులు ఎందుకు నోరు విప్పడం లేదో అర్ధం కావడంలేదు. పోస్టింగులు రావని, పెన్షన్లు ఆపేస్తారని భయపడుతున్నారేమో’ అని బీజేపీకి చెందిన ఓ నేత దుయ్యబట్టారు.

Leave a Reply