ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి

Spread the love

వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు.

సీఎస్‌ సమీర్‌ శర్మ దిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి నోటీసు అందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో
notice-prc పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని నోటీసులో పేర్కొన్నారు.

ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని, నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. సీఎస్‌ను ఉద్దేశిస్తూ సమ్మె నోటీసును ఉద్యోగ సంఘాల నేతలు జీఏడీ ముఖ్యకార్యదర్శికి అందజేశారు.

సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్న ఆయన, ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఉద్యోగులు సమ్మె నోటీసు ఇవ్వకముందు మీడియాతో మాట్లాడిన సజ్జల ఉద్యోగుల బుజ్జగింపు, చిన్న అంశాల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. చర్చలకు వస్తారని రేపు కూడా ఎదురుచూస్తామన్న సజ్జల ఈమేరకు మరోసారి సమాచారం పంపుతామని వెల్లడించారు.

“ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీసు పీరియడ్‌కు అర్థం ఉండదు. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల ప్రతినిధులకు చెప్పేందుకే కమిటీ. అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరాం. పీఆర్సీ జీవోల అమలు నిలపాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలం. జీఏడీ కార్యదర్శి చెప్పాక కూడా అధికారిక కమిటీ కాదంటారా? ఉద్యోగులు కూడా మా ప్రభుత్వంలో భాగమే. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం” – సజ్జల రామకృష్ణారెడ్డి

మంత్రుల ఎదురుచూపులు..పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూశారు. సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి నిరీక్షించారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సహా వివిధ అంశాలపై ప్రభుత్వంతో సోమవారం సంప్రదింపులకు రావాలని మంత్రులు పిలుపునివ్వగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. చర్చలకు రాబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పినా మంత్రులు నిరీక్షించడం గమనార్హం.

Leave a Reply