రాష్ట్రపతి ఉత్తర్వుకు తూట్లు పొడుస్తున్నారు.. కాపాడండి

Spread the love

– టీచర్ల సమస్యల పరిష్కారం కోసం గవర్నర్‌ను కలిసిన బీజేపీ చీఫ్ బండి సంజయ్

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు సైతం తూట్లు పొడుస్తోందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన గవర్నర్ తమిళసైని కలిసి వినతిపత్రం సమర్పించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, రఘునందన్‌రావు, పార్టీ నేతలు స్వామిగౌడ్, విఠల్‌తో కలసి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్ ఏమన్నారంటే…

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ గారికి కలిశాం. అన్ని అంశాలు చర్చించాం. రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడిచేలా బదిలీలు చేస్తున్నరు. రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడుతున్నరు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలను తక్షణమే నిలిపివేయాలని కోరాం. ఉద్యోగుల స్థానికతకే ప్రమాదంగా మారిన 317 జీవో ఉత్తర్వులను సవరించాలని విజ్ఝప్తి చేశాం. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూనే లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను కాలరాస్తున్నరు. దుర్మార్గంగా, నిర్ధయగా చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తున్నరు. భార్యాభర్తలను, వారి పిల్లలను విడదీస్తున్నరు.

ఏ ఉద్యోగిని కదిలించినా కన్నీళ్లే. తల్లిదండ్రులను, భార్యాపిల్లలను వదిలి ఎటు పోవాల్సి వస్తుందోననే బాధ కన్పిస్తోంది. ఈ బాధ తట్టుకోలేక మహబూబాబాద్ జిల్లా చిన్న ముప్పారం గిరిజన ప్రధానోపాధ్యాయుడు జేత్ రాం గుండెపోటుతో చనిపోయిండు. జేత రాం మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన భార్య అంగన్ వాడీ టీచర్. స్పౌజ్ కేసు కింద పరిగణలోకి తీసుకోకుండా అడ్డగోలుగా ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నరు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జేత్ రాంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉసురు తగలుతుంది. చేసిన పాపాలకు తప్పకుండా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, కనీసం ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ఒకటే రోజు వ్యవధి ఇచ్చి ఆప్షన్ లు ఇవ్వమనడం, ఒకటే రోజు జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయమనడం, ఇచ్చిన అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం వారి ఆవేదనను వినకుండా దుర్మార్గంగా హడావుడిగా కౌన్సిలింగ్ చేపట్టడం దుర్మార్గం.

హడావుడిగా తయారుచేసిన సీనియారిటీ లిస్ట్ లు తప్పుల తడకగా ఉంది. ఎందరో ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నా ఈ మూర్ఖపు సీఎం కళ్ళకు కనిపించడం లేదు. అడ్డదిడ్డంగా జీవోలు వెలువరించి ఉద్యోగులందరికీ మానసిక ప్రశాంతత లేకుండా జేస్తుండు. ఆయన మాత్రం హాయిగా ఫాం హౌస్ లో నీరో చక్రవర్తి మాదిరిగా సోయి తప్పి నిద్రపోతుండు. ఇంకా ఈ తెలంగాణ ప్రజానీకం నిన్ను ఎందుకు భరించాలే? ఏ స్థానికత పేరుతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ స్తానికతకే ఎసరుపెట్టి సీనియర్, జూనియర్ల పేరుతో ఉద్యోగుల ఉసురుపోసకుంటున్న నీకు ఇంకా ఎంతమాత్రం ఈ రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు.

దీర్ఘకాలిక రోగాలతో బాధపడ్తున్న ఉపాధ్యాయులను కూడా నానా నిబంధనల పేరుతో దూరప్రాంతాలకు పంపడం చూస్తుంటే నువ్వెంత శాడిస్ట్ వో అర్థమవుతుంది. మొన్న కరీంనగర్ కు చెందిన ఒక అక్క బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ సర్జరీ చేసుకొని ప్రిఫరెన్షియల్ క్యాటగిరి లో అప్లై చేసుకుంటే అది న్యూరో సర్జరీ కాదని రిజెక్ట్ చేసి ఆమెను జగిత్యాల పంపడం నీ రాక్షసానందానికి నిదర్శనం. ఈరోజు నీ సైకో చేష్టలకు జేత్ రాం అనే హెడ్మాస్టర్ చనిపోయిండు. ఇంకెందరు చచ్చిపోతే నీ రాతి గుండె కరుగుతుంది?

SC,ST కోటా సక్రమంగా అమలు చేయకుండా దళిత బిడ్డలను తమ సొంత గ్రామాలకు, జిల్లాలకు దూరంగా పంపుతున్న దుర్మార్గ పాలన నీది. ఎస్పీ, ఎస్టీల మాదిరిగానే బీసీ ఉద్యోగులకు ‘ఆప్షన్ ఫార్మెట్’ ను వర్తింపజేయకపోవడం అన్యాయం. ప్రతి నిత్యం పత్రికల్లో జిల్లాల కేటాయింపు లో అవకతవకలంటూ వార్తలు వస్తుంటే కనీసం సమగ్రమైన విచారణ చేయకుండా నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను భయ భ్రాంతులకు గురిచేయడం నీ నయా నిజాం పాలనకు నిదర్శనం. లేని సమస్యలను సృష్టిస్తూ గందరగోళం సృష్టించడం నీకు అలవాటై పోయింది.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గవర్నర్ గారిని కలిసి తక్షణమే బదిలీల ప్రక్రియను నిలిపివేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరాం. ఇప్పటికైనా ఈ సీఎం నిజంగా మనిషిగా అనిపించుకోవాలంటే ఇలా ఆదరాబాదరాగా కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ముందుగా సావధానంగా వినాలె. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోద యోగ్యమైన మార్గాలను అన్వేషించాలి. ఆ తరువాతే బదిలీల ప్రక్రియను చేపట్టాలి.

లేనిపక్షంలో బీజేపీ పక్షాన ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధం. ఈ చెవిటి సర్కార్ కు ఉద్యోగుల తడాఖా ఏందో… బీజేపీ సత్తా ఏందో చూపిస్తం. ఉద్యోగులెవరూ బాధపడొద్దు. అఘాయిత్యాలకు పాల్పడవద్దు. మీవెంట మేమున్నాం. ఇప్పటికైనా బదిలీల ప్రక్రియను ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నం. త్వరలోనే కార్యాచరణను కూడా ప్రకటిస్తాం.

Leave a Reply