తెలంగాణ వచ్చాకే అన్ని మతాలకు ప్రాధాన్యం: ఉప సభాపతి పద్మారావు

మైనారిటీల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామని, ముస్లిం మైనారిటీ ల జీవన ప్రమాణాలను మెరుగు పరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో లాలాగూడ మసీదు, వారసిగూడ కౌసర్ మసీదు, శ్రీనివాస్ నగర్ మసీదుల్లో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం అవిర్భావించాకే అన్ని మతాల పండుగలకు సమాన ప్రాముఖ్యత లభిస్తోందని అన్నారు. రంజన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. సికింద్రాబాద్ పరిధిలో ముస్లిం మైనారిటీలకు ప్రయోజనం కలిగేలా వివిధ ఏర్పాట్లు జరిపామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. కార్పోరేటర్లు సామల హేమ, కంది శైలజ, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తదితరులతో పాటు వివిధ మజీదుల ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.