భవిష్యత్ భారతానికి ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలి

• చదువుతోపాటు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నైతికత, దేశభక్తి ద్వారానే ఉన్నతస్థానాలకు చేరుకోగలమని సూచన
• నూతన జాతీయ విద్యావిధానం ఈ దిశగానే భవిష్యత్ భారతాన్ని ముందుకు తీసుకెళ్తుందన్న ఉపరాష్ట్రపతి
• ఇలాంటి విలువలెన్నో భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి, వాటిని విద్యార్థులకు అందిచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే
• గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
• శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచన

గుంటూరు: విద్యతోపాటు ఉన్నతవిలువలను ఒంటబట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. వీటితోపాటు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నైతికత, దేశభక్తి పెంపొందించుకోవడం ద్వారా ఉన్నతస్థానాలకు చేరుకోగలమని ఆయన అన్నారు.

మంగళవారం గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నతపాఠశాల వజ్రోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం, దేశ పురోగతికోసం విద్యార్థులకు సరైన విద్యనందించడం బలమైన పునాదులు వేస్తుందన్నారు. విద్య వ్యక్తిని విజ్ఞానవంతుడిగా చేయడంతోపాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా మలుస్తుందని పేర్కొన్నారు.

‘వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమైనద’న్న మహాత్మాగాంధీ మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ.. ఈ దిశగా ఉపాధ్యాయులు పోషించే పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. విద్యలోని పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం మార్కుల కోసం, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల, చదువు విలువ ఉండదని, దేశానికి నాయకత్వం వహించే సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యంగా, యువతకు జాతీయ భావాలు నూరిపోసి, నైపుణ్యం, లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్న దేశభక్తులుగా వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

స్వచ్ఛభారత్, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ లాంటి వాటి పట్ల జాగృతం చేయాలన్నారు. దీంతోపాటుగా సమాజంలో పేరుకుపోయిన వివిధ రుగ్మతలకు వ్యతిరేకంగా పిల్లల్ని చైతన్యవంతుల్ని చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ ధోరణిని పెంపొందించేందుకు పాఠశాలలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉపరాష్ట్రపతి, భవిష్యత్ భారతం మరింత సమర్థవంతంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) – 2020 ను రూపొందించిందని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో చదువుతోపాటు నైతిక విలువలు, ప్రకృతి, దేశం, సమాజం పట్ల తమ బాధ్యతను తెలియజేయడంతోపాటు క్రీడలు, మన కళలు, సంస్కృతి-సంప్రదాయాలపట్ల అవగాహన పెంపొందించే విధంగా సమగ్రమైన విద్యావ్యవస్థను రూపొందించిందన్నారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసే విషయంలో ఉపాధ్యాయులు పోషించే పాత్రను మరొక్కసారి ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.

ఒకప్పుడు విశ్వగురువుగా గౌరవాన్ని అందుకున్న భారతదేశాన్ని తిరిగి ఆ ఉన్నతస్థానానికి చేర్చేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రధానంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా ఉపరాష్ట్రపతి పలు సూచనలు చేశారు. ‘ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకోండి. మీకు ఆకాశమే హద్దు. కానీ మాతృభాషను మాత్రం మర్చిపోకండి. రేపటి ప్రపంచం మీరు ఎవరని ప్రశ్నిస్తే, మీ మాతృభాషే మీకు సమాధానాన్ని చూపుతుంది’ అని అన్నారు. అందుకే ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జాతీయ నూతన విద్యావిధానం దీనికి పెద్ద పీట వేయడం ఆనందదాయకమన్నారు.

శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, ‘మానవ సేవే మాధవ సేవ’ అని త్రికరణ శుద్ధిగా నమ్మి, జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడిగా శ్రీ పాటిబండ్ల వారి జీవితం గురించి విద్యార్థులకు తెలియజేశారు. భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, రహదారులు, సాగునీటిటి కాల్వల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారన్నారు. వారి జీవితాన్ని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

కార్యక్రమానికి ముందు పాఠశాల ఆవరణలో స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, మొక్కను నాటారు.పూర్వ పార్లమెంట్ సభ్యులు యలమంచిలి శివాజీ, నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు, పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల అధ్యక్షులు గంటా సుబ్బారావు, కార్యదర్శి పాటిబండ్ల విష్ణు వర్థన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply