Suryaa.co.in

Andhra Pradesh

క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించండి

– రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి.సోమ‌ణ్ణ‌ను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్
– ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రం అందించిన మంత్రి టి.జి భ‌ర‌త్

ఢిల్లీ: కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి. సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిసి రైల్వే స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంద‌జేశారు.

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి రైల్ నెట్ వర్క్ సహా అన్ని మౌలిక సదుపాయాలు క‌ల్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తోంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కర్నూలు నుండి రాజ‌ధాని అమరావతికి ప్రత్యక్ష రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

వ్యాపార కార్యకలాపాలతో సహా అధికారిక పనులకు హాజరు కావడానికి అమరావతి చేరుకోవడానికి ఎంతో క‌ష్టంగా ఉంద‌న్నారు. ఉమ్మ‌డి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతోంద‌ని వివ‌రించారు. కర్నూలు జిల్లాలో అనేక వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి టి.జి భ‌ర‌త్ తీసుకెళ్లారు.

ఈ నేప‌థ్యంలో ముంబైతో కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్తల వ్యాపార కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కర్నూలు నుండి ముంబైకి వారంలో ఒక‌టి లేదా రెండుసార్లు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌న్నారు. కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రోజువారీ రైలు సర్వీసును క‌ల్పించాల‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు.

LEAVE A RESPONSE