– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. డా.బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని బాబూజీ సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
పేదరికంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న బాబూజీ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా సేవలు అందించారని.. కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.
అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. బాబూజీ స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణను అమలు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.