– పెద్దిరెడ్డి లెక్కలు అన్నీ ఇక తేల్చుదాం…తిన్నది అంతా కక్కింద్దాం: చంద్రబాబు
– చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన పుంగనూరు ముస్లిం నేతలు, కార్యకర్తలు
అమరావతి: అక్రమ సంపాదన, దౌర్జన్యాలతో చెలరేగుతున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి లెక్కలు అన్నీ తేల్చుతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. పుంగనూరులో ఇప్పటికే పుంజును వదిలామని టిడిపి ఇంచార్జ్ చల్లా బాబును ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పుంగనూరు కు చెందిన సయ్యద్ సుహేల్ బాషా తన 150 మంది అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
పుంగనూరు బైపాస్ ఎవరి కోసం వేశారో ప్రజలకు తెలీదా అని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు, సహచరుల ఆగడాలు అన్నీ లెక్కపెడుతున్నామన్న చంద్రబాబు…అధికారంలో వచ్చిన తరువాత అన్నింటికీ బదులు ఇస్తామన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి డైరీ లీటరు పాలకు 15 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని….టిడిపి ప్రశ్నిస్తే ఇప్పుడు 32 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. పుంగనూరులో మీరు తొడ కొట్టండి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డిప్పగారి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.