సికింద్రాబాద్ లోని రైల్వే మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశం
సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ రైల్వే ప్రధాన కార్మిక సంఘాల్లో ఒకటైన సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యునియన్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. యునియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, జాతీయ రైల్వే కార్మికుల ఫెడరేషన్ నేత సీ. హెచ్. శంకర్ రావు తో సమావేశమయ్యారు.
శంకర్ రావుతో పాటు యునియన్ కేంద్ర కమిటీ నేతలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రైల్వే కార్మికులకు అనుకూలంగా తమ విధానాలు ఉన్నందున ఎన్నికల్లో తమకే మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే కార్మికులు, ఉద్యోగులు అధికంగా నివసించే సికింద్రాబాద్ లోని వివిధ రైల్వే కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని గతంలో వివిధ సందర్భాల్లో రైల్వే జీ ఎం లు, కేంద్ర రైల్వే మంత్రుల పై వత్తిడి తెచ్చామని, అదే విధంగా రైల్వే ఆసుపత్రిలో కోవిడ్ వైద్య సేవలను అందించేందుకు, వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు తామే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రైల్వే సిబ్బంది సమస్యల పట్ల తమకు సంపూర్ణ అవగాహనా ఉందని, సికింద్రాబాద్ లో రైల్వే సిబ్బందికి తామే అండగా నిలుస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా రైల్వే కార్మికుల సమస్యల పట్ల సానుకూలత ఉందని తెలిపారు. ఎన్నికల్లో తమకే మద్దతు తెలపాలన్న పద్మారావు గౌడ్ అభ్యర్ధనకు కార్మిక సంఘం నేత శంకర్ రావు తో పాటు నేతలు సానుకూలంగా స్పందించారు.