Suryaa.co.in

Features

దేవుడున్నాడా.. ఇది ప్రశ్నయితే పరమహంసే సమాధానం!

కలియుగంలో
జన్మించిన రుషి..
దేవుని కనుగొన్న అన్వేషి..
ఇల్లాలిలోనే జగన్మాతను
దర్శించిన మనీషి..
ఎక్కడ తిరిగాడో..
గదాధరుడు ఎప్పుడు
రామకృష్ణుడయ్యాడో?
జగతి మన్నించిన భగవానుడు..
రూపంలో కలహంస
మన రామకృష్ణ పరమహంస!

అన్ని మతాలు సమానమేనని..
భిన్న మతాల సారాంశం ఒక్కటేనని..
మతమేదైనా దాని లక్ష్యం
భగవంతుని చేరడమేనని
నమ్మిన తత్వవేత్త..
సృష్టిలో ఏకత్వాన్ని
అన్ని జీవుల్లో దైవత్వాన్ని
గాంచిన మానవతావేత్త..!

గురువు జీవితకాల సాధనతో
సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని
మూడు రోజుల్లోనే
సాధించిన మహాయతి..
హిందూమార్గంలో
దైవదర్శనం పొంది ఆగాడా..
క్రైస్తవ..ఇస్లాం మతాలను
సైతం అనుసరించి
సాక్షాత్కారం పొందిన జ్ఞాని
అలా అన్ని మతాల వారిని ఆకట్టుకున్న విజ్ఞాని..
తానుగా బ్రహ్మజ్ఞాని..!

ఎన్ని రూపాలలో
దేవుని దర్శించినా
పరమాత్మ ఒక్కడేనని
మానవునిలో సైతం దేవుని చూడాలని ఉద్భోదించిన
సమతామూర్తి..
అఖండకీర్తి..
వివేకానందుని స్ఫూర్తి..!

భగవంతుని ఉనికి
గ్రహించడమే
అలా పుణ్యాన్ని సంగ్రహించడమే
మానవ ధర్మమని..
అదే ఈ సృష్టి మర్మమని..
ఆ ధర్మ నిర్వహణ సాధనమే
మతమని…
ఆ సాధనలో మతం ఏదైనా
అది సమ్మతమేనని..
తాను నమ్మి..
ఆ నమ్మినదానిని ఆచరించి..
ఆ మార్గంలోనే సంచరించి..
తరించిన మహనీయుడు..
రామకృష్ణ పరమహంస..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

 

LEAVE A RESPONSE