Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు ప్రజల ఆస్తి రామోజీరావు

-సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడిలా ఫిలిం సిటీ నిర్మాణం
-తాను సంపాదించిన ప్రతి రూపాయి ఆంధ్ర, తెలంగాణలోనే ఖర్చు
-రామోజీ ఫౌండేషన్ ద్వారా ప్రచారాన్ని ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు
-మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టవద్దు… నువ్వు ఈశ్వరుడిని తిట్టవచ్చా?
-వైయస్ వివేక హత్య కేసులో రానున్న 72 గంటల వ్యవధిలో కీలక అరెస్టులు ఉండవచ్చు
-జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే… సాక్షి అడ్వర్ టైజ్మెంట్ క్యాలెండర్ ఇస్తారా?
-ఎన్ఐఏ కోర్టుకు కూడా హాజరుకానన్న జగన్మోహన్ రెడ్డి… ఇది సరి కాదు
-కళ్యాణి ని అరెస్టు చేసిన తీరు అత్యంత దారుణం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు, ఫిలిం సిటీ సృష్టికర్త రామోజీరావు అనే వ్యక్తి కేవలం తన కుటుంబ సభ్యుల ఆస్తి మాత్రమే కాదు…ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు మాదిరిగా ఫిలిం సిటీ నిర్మాణాన్ని రామోజీరావు చేశారని కొనియాడారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చెప్పినట్లుగా బ్రతికితే ఒక్క రోజైనా రామోజీరావులా బతకాలి అన్నట్లుగా గొప్పగా, నలుగురికి నిజమైన మార్గదర్శిలా జీవించాలని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్గదర్శిపై రాష్ట్ర సిఐడి పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసులలో న్యాయం రామోజీరావు వైపే ఉన్నదని చెప్పారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, ఈ విషయం తేలిపోతుంది. ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో జరిగే విచారణకు హాజరుకావాలని సిఐడి పోలీసులు జారీ చేసిన నోటీసులు నేపథ్యంలో… రాష్ట్రంలో జరిగే విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావద్దని రామోజీరావుకు సూచించారు. సిఐడి పోలీసులు జారీ చేసిన నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. రాక్షసులతో డీల్ చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. మారీచుని మించిన వాళ్ళు అవతలి వ్యక్తులని గ్రహించాలని సూచించిన రఘురామకృష్ణం రాజు, వయసు మళ్ళీన వాళ్లను, స్త్రీలను విచారణకు పిలవద్దని చట్టంలోనే చెబుతున్నప్పటికీ, చట్ట వ్యతిరేకంగా పిలిచినప్పటికీ… తాను ఎటువంటి పొరపాటు చేయలేదని మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి విచారణకు హాజరవుతారెమో… హాజరు కావద్దన్నారు. గతంలో తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అకారణంగా అరెస్ట్ చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు మీకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేస్తామంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించరు. అందుకే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కు విచారణ నిమిత్తము పిలుస్తున్నారని అన్నారు.

తనకొచ్చిన లాభాలను ఇతర కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన మార్గదర్శి
మార్గదర్శి సంస్థను 1962లో రామోజీరావు స్థాపించారు. దినదినాభివృద్ధి చెందుతూ,గత 60 ఏళ్ల లో 108 శాఖలకు విస్తరించి మూడు వేల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది ఖాతాదారులతో, ఏడు వేల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగి సజావుగా సాగుతున్న సంస్థ మార్గదర్శి అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ మనస్తత్వంతో, కక్ష సాధింపు ధోరణిలో భాగంగా, ఒక్క రోజైనా రామోజీరావును, మార్గదర్శి సంస్థ ఎండి శైలజను జైలులో పెట్టాలని దురుద్దేశంతో మార్గదర్శి పై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర సిఐడి పోలీసులను ఆదేశించారు. మార్గదర్శి సంస్థ నిర్వాహకులకు ఒక చిట్టి నిర్వహిస్తే కేవలం ఐదు శాతం మాత్రమే ఆదాయం లభిస్తుంది. ఆ ఆదాయం ద్వారానే , ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు, ఆఫీసు నిర్వహణ ఖర్చును భరించాల్సి ఉంటుంది. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్టి నిర్వాహకులు కూడా, ఆ చిట్టిలో సభ్యుడై ఉండాలి. రెండవ నెలలోనే చిట్టి నిర్వహకుడైన సభ్యుడు చిట్టిని పాడుకునే వెసులుబాటు చట్టం కల్పించింది. తాను తీసుకున్న చిట్టి మొత్తాన్ని మిగతా సభ్యుల మాదిరిగానే వాయిదాలలో నిర్వాహకుడు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో అంతా సజావుగానే సాగుతున్న సమయంలో, అన్యాయంగా డిపాజిట్లను సేకరించారని రాజకీయ దురుద్దేశంతో కొంతమంది ఆరోపణలు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఖాతాదారుల సొమ్ము, ఇతర కంపెనీలలో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను పెడుతూ ఉందని తప్పుడు ప్రచారానికి తెర లేపారు.ఇదంతా శుద్ధ అబద్ధమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. చట్ట ప్రకారం వ్యాపార, లావాదేవీలను నిర్వహిస్తున్న మార్గదర్శి సంస్థ గత 60 ఏళ్లలో 1400 కోట్ల రూపాయల ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తూ, మరో నాలుగు నుంచి 500 కోట్ల రూపాయల సర్వీస్ టాక్స్ ఇతర టాక్స్ లను సక్రమంగా చెల్లించింది. వ్యాపారంలో లభించిన 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని మార్గదర్శి తమిళనాడు, కర్ణాటక కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టింది. అలాగే లాభాలు వస్తాయన్న నమ్మకం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లోను ఇన్వెస్ట్ చేసింది. ఈ రకంగా తన మూలధనాన్ని మార్గదర్శి పెంచుకునే ప్రయత్నం చేసింది. అదేమీ చట్ట ఉల్లంఘన కాకపోయినప్పటికీ, నేరం, ఘోరం జరిగిపోయినట్లుగా ఆ సంస్థ పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థం కావడం లేదు. మూడు లక్షల మంది చందాదారులను ఏ ఒక్కరూ కూడా, మార్గదర్శి సంస్థలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. మహా, మహావులను తమ టక్కు, ఠమార విద్యల ద్వారా లోబరుచుకునే తమ పార్టీ నాయకులు, ఏ ఒక్క ఖాతాదారున్ని కూడా తమ వైపు తిప్పుకోలేకపోయారు. మార్గదర్శి డిపాజిట్లను సేకరించిందన్న అభియోగాన్ని మోపారు. మార్గదర్శి ఫైనాన్షియల్ పేరిట గతంలో డిపాజిట్లను సేకరించిన మాట నిజమే. అయితే, అప్పట్లో డిపాజిట్లను సేకరించడానికి చట్ట ప్రకారం వెసులుబాటు ఉండేది. డిపాజిట్ల సేకరణ కోసం మార్గదర్శి సంస్థ ప్రచారము చేసుకోలేదు. పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా ఆ సంస్థపై నమ్మకం ఉన్నవారు, తమ సొమ్మును డిపాజిట్ చేశారు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాత్రమే డిపాజిట్లను సేకరించాలని గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం హయాంలో చట్ట సవరణ చేసిన తర్వాత, మార్గదర్శి సంస్థ తాను సేకరించిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చింది. డిపాజిట్లను వెనక్కి చెల్లింపులో మార్గదర్శి సంస్థ ఎక్కడ కూడా డిఫాల్టర్ కాలేదు. ఎన్నో బ్యాంకులు ఖాతాదారుల నెత్తిన టోపిని పెట్టి మూసి వేశాయి. మరిఈ ప్రభుత్వం, అటువంటి బ్యాంకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చట్టాలలో మార్పులకు అనుగుణంగా, డిపాజిట్లను వెనక్కి ఇచ్చివేస్తే ఏదో జరగకపోతే, డిపాజిట్లను ఎందుకు వెనక్కి ఇస్తారన్న భ్రమలో కొంతమంది ఉంటే ఉండవచ్చు. అప్పటివరకు తనకున్న మార్కెట్ షేర్ లో కొంత భాగం అమ్మితే, పెద్ద మార్కెట్ క్యాప్ లభించింది. దీనితో, మార్గదర్శి డిపాజిటర్లకు అణ పైసా తో సహా సొమ్మును చెల్లించడం వల్ల, మార్గదర్శి వల్ల మోసపోయామని ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.

వరదబోతు అధికారి వల్లే ఈ ఇబ్బందులు
ఎంతోమంది సంక్షేమంతో కూడిన మార్గదర్శి సంస్థను మూసివేస్తానని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజిగా వ్యవహరిస్తున్న వరదబోతు అధికారి పేర్కొనడం విడ్డూరంగా ఉంది.. దమ్ముంటే మార్గదర్శి సంస్థను మూసివేయాలని సదరు అధికారికికి రఘు రామకృష్ణంరాజు సవాల్ చేశారు. 2009 బ్యాచ్ కు చెందిన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి వి. రామకృష్ణను 2019లో డిప్యూటేషన్ పై రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారిగా నియమించారు. ఒంగోలుకు చెందిన ఈ అధికారి, ఎంపీ ఆదిమూలపు సురేష్ కు ఫ్యామిలీ ఫ్రెండ్. తన కక్ష సాధింపులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఐదు నెలలకు క్రితం రామకృష్ణను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా కీలక ప్రాధాన్యత కలిగిన పోస్టులో నియమించారు. సెక్రటరీ స్థాయి కలిగిన అధికారిని మాత్రమే ఈ పోస్టులో నియమించాల్సి ఉంది. కానీ రామకృష్ణ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి. గతంలో ఐజిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి కక్ష సాధింపు పనులను చేయడానికి తిరస్కరించి ఉంటారు. అందుకే, రామకృష్ణను తీసుకువచ్చి ఆ పదవిలో నియమించి ఉంటారు. ఇతర రాష్ట్రాలలో అప్రాధాన్యత పోస్టులలో ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన వారిని, లేదంటే తనకు అనుకూలంగా ఉన్న వారిని రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రాధాన్యత పదవుల్లో నియమించడం పరిపాటిగా మారింది. ఇక, వాలంటీర్లు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటే తప్పేమిటి అని సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ వాఖ్యానించినట్లు సాక్షి దినపత్రికలో వార్త కథనాన్ని ప్రచురించారు. ఆయన ఆ మాటలు అని ఉండకపోతే తక్షణమే ఖండించాలని ఆయన సూచించారు.

A1, A2 అని రాసినందుకు, రామోజీరావు ను అరెస్టు చేసి A1 చేయాలన్నదే జగన్ లక్ష్యం
ఆర్థిక నేరాల కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గురించి A1, విజయసాయి రెడ్డి గురించి A2 అని ఈనాడు దినపత్రికలో రాయడం వల్లే, కక్షగట్టిన ముఖ్యమంత్రి ఎలాగైనా రామోజీరావును అరెస్ట్ చేసి ఆ కేసులో A1 గా చూపించాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం . ఇక ఆ కేసులో రామోజీరావును, శైలజను అరెస్ట్ చేసి ఒక్క రోజైనా జైలులో నిర్బంధించాలని ఆయన భావిస్తున్నారు. రామోజీరావు విలువలకు కట్టుబడిన వ్యక్తి. ఆయన తనను సిఐడి పోలీసులు విచారించిన విషయాన్ని కూడా ఈనాడు దినపత్రికలో వార్తగా ప్రచురింపజేశారు. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి తన కేసుల గురించి సాక్షి దినపత్రికలో రాయించారా?. రామోజీరావును సిఐడి పోలీసులు విచారిస్తున్నప్పుడు, ఆయన బెడ్ పై పడుకొని ఉన్న ఫోటో ఎలా బయటికి వచ్చిందన్న దానికి ఇప్పటివరకు సమాధానం లేదు.

అదే కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ గురించి బయటకు వస్తే, ఎలా వచ్చిందని మాత్రం ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకువచ్చిన వ్యక్తిని ఇంతలా అవమానించడం దారుణం. సాక్షి దినపత్రికను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉషోదయ పబ్లికేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కుట్ర చేసి, రామోజీరావును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి హిందువా?
జగన్మోహన్ రెడ్డి ని మహావిష్ణువుతో పోలుస్తూ, ఆయన్ని విమర్శించడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడ మేనని రాజమండ్రి ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, జగన్మోహన్ రెడ్డి ఏమైనా హిందువా?, అని ప్రశ్నించారు. శ్రీ మహావిష్ణువు ఎక్కడైనా ఈస్టర్ పండుగలో పాల్గొంటారా? తన పేరు రఘురామకృష్ణం రాజు అని మరి తన గురించి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే హిందువులను అవమానించినట్లు కాదా?, తన పేరులోనూ రాముడు, కృష్ణుడు ఉన్నారని గుర్తు చేశారు.

ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పప్పు అని విమర్శిస్తున్న వారు, ఈశ్వరుడిని నిందించినట్లు కాదా? అని నిలదీశారు. మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. తనలాంటివారు ఇలా మాట్లాడి ఉంటే, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నానని సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఉండేవారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి విచారణకు ఎన్ఐఏ కోర్టుకు కూడా హాజరుకానని పేర్కొనడం సరికాదు. తనపై కోడి కత్తి దాడి ఎలా జరిగిందో చెబితే బాగుండేది, కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇకనైనా విడుదల చేయాలి.

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో రానున్న 72 గంటల వ్యవధిలో అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదు. ఏప్రిల్ నెల అఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టుకు సిబిఐ విన్నవించింది. ఈ హత్య సూత్రధారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని హైకోర్టుకు సీబీఐ ఇప్పటికే స్పష్టంగా చెప్పడమే కాకుండా వారిని అరెస్టు చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఈ కేసు విచారణ ఒక స్థాయి వరకు కచ్చితంగా జరగవచ్చు.

ఆ పై స్థాయి వ్యక్తుల ప్రమేయం గురించి విచారణ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు . గన్నవరంలో కళ్యాణి ఆడ పోలీసుల సహకారంతో మగ పోలీసులు అరెస్టు చేసిన తీరు దారుణం. అర్ధరాత్రి పూట నిద్రిస్తున్న కళ్యాణి ని నైట్ డ్రెస్ లో ఉన్నాను, డ్రెస్ మార్చుకుని చీర కట్టుకుని వస్తానని చెప్పినప్పటికీ, సమయం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం అత్యంత హేయం.

ఈ సంఘటనను తమ పార్టీలోని మహిళలు కూడా ఛీ…కొడుతున్నారు. ఈ సంఘటనతో మహిళా ఓట్లన్నీ మా పార్టీకి దూరమైనట్లే. ప్రతి ఏటా జాబు క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు సాక్షి దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ క్యాలెండర్ ను విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE