రిజ్వాన్.. నిజమే..ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

రిజ్వాన్.. నిజమే..ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

( మార్తి సుబ్రహ్మణ్యం)
పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. ఓటర్లలో రిజ్వాన్ లాంటి పుణ్యపురుషుల ఓటరు వేరయా! అవును. నిజం. చేసుకున్న పాపం చెప్పుకుంటే పోతుందన్నట్లు, చేసిన పాపం చెప్పులదండతో పోతుందనుకున్నాడు పిచ్చి రిజ్వాన్. అందుకే.. ఓటరుగా పార్టీల దగ్గర మందు, విందు, చిందులేసినందుకు ఇప్పుడు సిగ్గుతో చితికిపోతున్నానంటూ.. తాండూరు మండలం అంతారానికి చెందిన రిజ్వాన్ చేసుకున్న ప్రాయశ్చిత్తం.. సగటు ఓటరుకు నిస్సందేహంగా, నిర్మొహమాటంగా చెప్పుదెబ్బ. ఎన్నికల్లో పార్టీల నుంచి బీరు-బిర్యానీ, డబ్బులు తీసుకుని ఓటేసిన చెత్త ఓటరునంటూ చెంపలేసుకుని, రిజ్వాన్ చేసిన ప్రాయశ్చిత్త ప్రదర్శన సగటు ఓటరుకు కనువిప్పు కావల్సిందే.
తాండూరులో దుమ్ము-ధూళితోపాటు, రోడ్ల సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోని నిర్లక్ష్యానికి నిరసనగా.. రిజ్వాన్ మెడలో చెప్పులేసుకుని ఇటీవల చేసిన వినూత్న ప్రదర్శన గురించి ముచ్చటించుకోవలసిందే. ‘‘నన్ను క్షమించండి. నేను చెత్త ఓటరును. డబ్బు తీసుకుని, బీరు తాగి బిర్యానీ తిని, టిఫిన్లు చేసి ఓటేశా. తాండూరు ప్రజల ఇబ్బందులకు కారణమైన ఓటరును నేను. ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయను. నా తప్పు తెలిసొచ్చేలా నన్ను కొట్టండి’’ అంటూ మెడలో చెప్పులదండ లేసుకుని మరీ, అందరితో కొట్టించుకున్న రిజ్వాన్ ప్రాయశ్చిత్త ప్రదర్శన.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనువిప్పయితే మంచిదే. అబ్బే.. కాదు… మాది తోలుమందమనుకుంటే అదీ మంచిదే!
యస్. రిజ్వానే రైటు. ఒక ఓటుకు 6 నుంచి 15 వేలు ఇచ్చి, ఓట్లు వేయించుకుంటున్న పార్టీలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందా? నయాపైసా తీసుకోని వారికే, గద్దెనెక్కిన వారి గల్లా పట్టుకునే హక్కుంది. హుజూరాబాద్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసింది అదే కదా? ఆంధ్రాలో ఓటుకు రెండువేలు తీసుకుని ఎగబడి ఓటేసిన పుణ్యపురుషులు, ఇప్పుడు పీకల్లోతు పితలాటకంలో పడ్డారు. అన్నీ పెంచేశారంటూ జగనన్నపై రుసురుసలాడుతున్న ఆంధ్రా పుణ్యపురుషులు… మరి స్కీముల పేరుతో అన్నీ పుక్కేనికి ఇచ్చేస్తే, ఖజానా ఎట్లా నిండాల? ఆ లోటు ఎట్లా పూడ్చాల? మళ్లీ ఆ పుణ్యపురుషుల జేబుల్లోనే చేయి పెట్టాలి కదా? జగనన్నయినా, కేసీఆరన్నయినా చేసేది ఇదేకదా?
మందురేట్లు పెంచితేనే తెలంగాణ ఖజానాకు కిక్కు. ఆ కిక్కు ఆంధ్రాలో లేనందున, అక్కడ ధరలపై దరువు. ఆంధ్రాలో జగనన్న పాలనలో ఇంటికి లక్షరూపాయలు ఉత్తి పుణ్యానికి మహదానంద పడి తీసుకుంటున్న పుణ్యపురుషులు.. రోడ్లు అద్దంలా ఉండాలని, ఇరవై నాలుగుగంటలూ కరెంటు ఉండాలని, రేట్లు తగ్గాలని కోరుకోవడం అత్యాశ కదా?! ఎన్నికల్లో ఓటుకు రెండువేలు తీసుకుని ఎగబడి గుద్దేసినప్పుడు లేని విచారం ఇప్పుడెందుకంట? ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ పేరిట ఓ పదివేలు అడిగితే, గింజుకోవడం ఎందుకంట? ఆ తెలివేదో ఓటుకు నోటు తీసుకోకముందే ఉండాలి కదా అంట?!
‘అమ్మఒడి’కి డబ్బులిస్తు, ‘నాన్నతడి’కి డబ్బులు తీసుకోకపోతే బడ్జెటు బండెలా నడుస్తుంది? కొత్త బండ్లతోపాటు-పాతబండ్లపై పన్నులేయకపోతే బొక్కసం ఎట్లా నిండుద్ది? యూనివర్శిటీలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల బ్యాంకు సొమ్ము లాగేసుకోకపోతే పాలన జరుగుబాటెలా అన్న జ్ఞానం ఉండొద్దూ?! ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకూ ఎసరు పెట్టకపోతే, వారికి నెలజీతాలు ఎక్కడ నుంచి తెస్తారు? సపోజ్… పర్ సపోజ్.. జగనన్న ఎన్నికల ముందు చెప్పిన మద్యనిషేధం మాటమీద నిలబడ్డారే అనుకోండి. అహ. ఉత్తిగానే అనుకోండి. మరి జనాలను ఇంట్లో కూర్చోబెట్టి ఎట్లా మేపుతారు? జనం జేబులోకి డబ్బెలా వస్తుంది? అందుకే కదా మందు కార్పోరేషన్‌కే జనాల్ని మేపే బాధ్యత పెట్టింది? మరి డబ్బులు ఊరకనే రావు కదా మాస్టారూ?! జగనన్న తన సిమెంటు కంపెనీ నుంచి సొంత సొమ్ములేమీ ఇవ్వరు కదా? ఆయనేమీ బ్యాంకు పెట్టలేదు కదా?
‘మా ఆయనే ఉంటే మంగలెందుక’న్నట్లు… అసలు ఆంధ్రాలో జగనన్నకు, తెలంగాణలో శేఖరన్నకూ అట్లాంటి బ్యాంకులే ఉంటే, ఈ అప్పుల తిప్పలెందుకు? ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎందుకు? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు, మొన్నామధ్య ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు 5 వేలు ఎగబడి తీసుకున్న ఓటరు మహాశయులు.. ఇప్పటి తాండూరు మాదిరిగా, రేపు దర్శిలో కూడా రోడ్లు బాగోలేదు, వీధిలైట్లు లేవని గొణిగితే, ఏమన్నా బాగుంటుందా? అసలది మర్యాదస్తుల పనేనా అంట? అదేదో సినిమాలో రావుగోపాల్రావ్ చెప్పినట్లు.. ఆ ముక్కేదో, ఆ గొణుగుడేదో ‘ఓటుకు నోటు’ తీసుకోకముందు చెప్పాల మరి!
అంచేత.. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు, ఈ జన్మలో చేసిన పాపం ఇప్పుడే అనుభవించాలని మొన్నామధ్య గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. శైలి వేరయినప్పటికీ, చాగంటి కోటేశ్వరరావు గారూ అదే చెప్పారనుకోండి. అది వేరే విషయం. కొద్దిరోజుల ముందు చెన్నై జడ్జి గారు కూడా, రాజకీయ పార్టీలు జనాలను సోమరిపోతులుగా మారుస్తున్నాయంటూ ఎలక్షను కమిషనుకు నోటీసులు పంపించారు. నిజమే. పాపం రాజకీయ పార్టీలు.. ఓటర్లను సంసారం ఒక్కటే వారంతట వారిని చేసుకోనిస్తున్నాయి. అంతవరకూ సంతోషించాలి. పాపం రైతులకు కూలీలు దొరక్క, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారట. ఆ బాధల గురించి ఇంకో ఎపిసోడులో ముచ్చటించుకుందాం. కడుపులో చల్ల కదలకుండా, ఇంటికి ఏడాదికి లక్ష రూపాయలొస్తుంటే కూలీ చేయాల్సిన ఖర్మ వారికేం పట్టింది? కష్టపడి పనిచేసి పన్నులు కట్టేవాళ్లున్నంతవరకూ, జగనన్న-చంద్రశేఖరన్న ఉన్నంతవరకూ వాళ్లెందుకు కష్టపడతారు? నో. నెవర్. అలా కష్టపడితే అది ఏలికలను అవమానించినట్లే!
తమను కష్టపడకుండా, సోమరిపోతులను చేసే పార్టీల ఉచిత హామీల ఎరకు చిక్కకుండా, అవిచ్చే నోట్లకు దొరకకుండా నిలువుగా- నిటారుగా-నిగ్రహంగా నిలబడినప్పుడే ఓటరుకు గౌరవం. మీరిచ్చే ఉచిత హామీల ముష్టి మాకొద్దు. ఆ పేరుతో మీరు మళ్లీ మా నడ్డివిరగకొట్టనూ వద్దని చెప్పే తెగింపు రానంతవరకూ, ఈ బానిసత్వం ఇంతే. పోనీలెండి..తాండూరులో రిజ్వాన్ లాంటి మాణిక్యం ఒకడు దొరికాడు. ఇప్పటికిది చాలు! మరి ఆంధ్రాలో కూడా రిజ్వాన్లు ఇంకా పుట్టారో లేదో?!