
– టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి
డిసెంబరు 14న గీతా జయంతిని పురస్కరించుకొని తిరుమల నాదనీరాజనం వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం అదనపు ఈవో అధికారులతో గీతా జయంతి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ డిసెంబరు 14న ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు గంటల పాటు భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంతరాయంగా పారాయణం చేయనున్నట్లు చెప్పారు. ఈ శ్లోకాలను కాశీపతి పారాయణం చేయగా, కుప్పా విశ్వనాధ శాస్త్రీ వ్యాఖ్యానం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నందున అవసరమైన ఇంజినీరింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
టిటిడి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తొందన్నారు. ఈ కార్యక్రమాల్లో గీతా పారాయణం సింహభాగంలో ఉన్నట్లు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లది మంది భక్తులు భగవద్గీత పారాయణం వీక్షించి, మళ్ళీ, మళ్ళీ ప్రసారం చేయమని కోరుతున్నారన్నారు.
ఈ సమావేశంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, సిఇవో సురేష్ కుమార్, ఎస్ఇ – 2 జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఆరోగ్య విభాగం అధికారిణి డా.శ్రీదేవి, డిఇ (ఎలక్ట్రికల్)రవిశంకర్ రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా.ఆకెళ్ల విభీషణ శర్మ, కుప్పా విశ్వనాధ శాస్త్రీ, కాశీపతి, ఇతర పండితులు పాల్గొన్నారు.