Suryaa.co.in

Features

ఏ.ఐ హోరులో వక్రీకరణ

– గ్రంథాలయాల ప్రాధాన్యతను గుర్తించి వాటి అభివృద్ధికి సహకరించండి

రోజురోజుకూ పెరిగిపోతున్న కృత్రిమ మేధ ( ఏ.ఐ ) హోరులో అనేక విషయాలు నేడు వక్రీకరణకు గురి అవుతున్నాయి. నిర్ధిష్టమైన ఆధారాలున్న చరిత్రను, సరియైన వివరాలను, సమాచారాన్ని కానీ మనం సకాలంలో పొందు పరచకపోతే.. చారిత్రక సత్యాలు, వాస్తవ పరిస్థితులు గతులు తప్పి..అవి కాస్తా తారుమారై, తప్పుడు సంకేతాలతో నేడు మనకూ.., రేపటి తరాన్ని తీవ్రంగా అయోమయం లోకి నెట్టేసి, అతలాకుతలం చేసే ప్రమాదం పొంచి ఉందని మేధో వర్గం, సమాజ హితాన్ని కాంక్షించే వారు ఆలోచించాలి.

ప్రస్తుతం ఈ చైతన్యాన్ని ప్రజలలో నింపే ప్రయత్నాన్ని ఈ. ” గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమం ” చేపట్టి సరియైన రీతిలో పౌర సమాజానికి దిశా నిర్దేశం చేయాలి.. ఈ లక్ష్య సాధనకు జ్ఞాన భాండాగారాలైన మన గ్రంధాలయాలు మాత్రమే దోహదపడగలవు. సమగ్రమైన సమాచారం, విషయాల లోని వాస్తవికతను ఇక్కడ ఉన్న పుస్తకాల ద్వారానే పొంద వచ్చును.

డిజిటల్ ఎరా గా మారబోతున్న నేటి ఆధునిక సమాజంలో నమోదు కాబడుతున్న అంశాలలో నిజానిజాలను తెలుసుకోవాలన్నా.. రేపటి తరానికి కూడా.. ఈ గ్రంథాలయాల వల్లనే సాధ్యం అవుతుంధని, అలాంటి నేటి సంధి కాలంలో పౌర సమాజం చైతన్యవంతమై విస్తృతంగా గ్రంథాలయాల వ్యాప్తికి, అభివృద్ధికి, పాతబడిన వాటి స్థానంలో పునరుద్ధరణకు వేదికలుగా.. ఈ గ్రంథాలయాలను మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని పౌర సమాజం గుర్తించాలి.

లేకుంటే చరిత్రలో వక్రీకరణలు, వదంతుల వ్యాప్తి చోటుచేసుకునే అవకాశం ఈ కృత్రిమ మేధ స్వైర విహారంలో జరుగక మానదని గుర్తించాలి. ఇవి జరుగకుండా ఉండాలంటే గ్రంధాలయాలు బలపడాలి. కృత్రిమ మేధ ద్వారా పొందిన సమాచారం కానీ, వాస్తవాలను తెలుసుకుని తమకు వచ్చే సందేహాల నివృత్తి కోసం ప్రతీ ఒక్కరూ.. మన చుట్టూ ఉండే పుస్తక నిక్షిప్త కేంద్రాలు అంటే.. మన గ్రంథాలయాలనే తప్పకుండా ఆశ్రయించాల్సి వస్తుందని..అందుకే మన గ్రంథాలయాల సంఖ్య ఇంకా గణనీయంగా పెరగాలి. అలాగే మరింతగా బలపడాలి. అభివృద్ధి పథంలో కొనసాగుతూ.. అన్ని మౌళిక వసతులతో పరిపుష్టం కావాలని ఆకాంక్షిద్దాం.

ఈ వికాసానికి ప్రజల భాగస్వామ్యం, వారి చైతన్యవంతమైన పాత్ర, స్పందన మరింత తోడైతే.. ఏ పాలకులూ ఎటువంటి ఆటంకాలు కలిగించ లేరని, యే ప్రభుత్వాలూ.. తమ మోకాలు అడ్డే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయలేవని భావించాలి. ఇందుకు కావల్సిందల్లా.. ప్రజా చైతన్యమే.. సమిష్టి భాగస్వామ్యమేనని అర్థం చేసుకుందాం..

గ్రంధాలయాలు మన చుట్టు ప్రక్కలా ఉన్న ప్రముఖుల జీవిత చరిత్రలు, బయోడేటాలు, రచయితల పుస్తకాలు, కళాకారుల సేవా కార్యక్రమాల మొదలగు వివరాలతో కూడిన సాంస్కృతిక , కళా రూపాలకు సంబంధించిన చరిత్ర, నేపథ్యాలను నమోదు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. వాటి డీటైల్స్ ను ఆయా సమీప గ్రంథాలయాల్లో పొందు పరచాలి. గ్రంధాలయాలు మన సంస్కృతినీ, చరిత్రను నమోదు చేసే కేంద్రాలుగా కూడా వినుతికి ఎక్కాలని ఆశిద్దాం.

– నరసింహం కోడుగంటి
వ్యవస్థాపక కన్వీనర్,
గ్రంధాలయ ప్రయోజనాల
పరిరక్షణ సమితి.

LEAVE A RESPONSE