Suryaa.co.in

Editorial

కులగణనలోనూ ‘రెడ్డి’కార్పెట్!

  • కులగణనపై కాంగ్రెస్ ప్రచారహోరు

  • రాహుల్ వల్లే అది సాధ్యమైందంటూ పబ్లిసిటీ

  • తెలంగాణలో బీసీల తాజా లెక్క 46.25 శాతం

  • అంటే బీసీల జనాభా 1,64,09,179 మంది

  • కేసీఆర్ సకలజనుల సర్వేలో బీసీల సంఖ్య 51 శాతం

  • మరి 21 లక్షలమంది బీసీలు ఎటుపోయారు?

  • ఎన్యూమరేటర్లు తమ ఇళ్లకు రాలేదంటున్న బీసీ నేతలు

  • కులగణనలో మాయచేశారంటూ మండిపాటు

  • చెత్తబుట్టలో పారేస్తామని బీసీ సంఘాల ఫైర్

  • తాజా లెక్కల ప్రకారం మరి బీసీలకు 58 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇస్తారా?

  • అదే దామాషా ప్రకారం ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులూ ఇస్తారా?

  • క్యాబినెట్‌లోనూ 46 శాతం ప్రకారం మంత్రి పదవులను భర్తీ చేస్తారా?

  • దానికంటే ముందు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్‌రెడ్డిని మార్చేస్తారా?

  • కులగణన ప్రకారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీసీ అభ్యర్ధిని ప్రకటిస్తారా?

  • మరో డిప్యూటీ సీఎం పదవిని బీసీకి ఇస్తారా?

  • పదవుల్లో 46 శాతం కోటా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు కష్టాలే

  • కాంగ్రెస్‌కు ‘కుల’సంకటం

( మార్తి సుబ్రహ్మణ్యం)

కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ ఆదేశాలతో కులగణన చేసి.. దేశానికి ఆదర్శంగా నిలిచామని ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్‌పార్టీకి, ఇప్పుడు ఇదే అదే అంశం కుల సంకటంగా పరిణమించింది. ప్లానింగ్ డిపార్టుమెంట్ అధికారికంగా ప్రభుత్వానికి నివేదించిన నివేదిక ప్రకారం.. తెలంగాణలో బీసీల జనాభా 1,64,09,179. అంటే మొత్తం జనాభాలో 46.25 అన్నమాట. మళ్లీ ముస్లిం బీసీల సంఖ్య 35,76, 588. అంటే 10.08 శాతమన్నమాట. దీన్నిబట్టి తెలంగాణలో బీసీల జనాభానే సింహభాగమన్నది స్పష్టమవుతుంది. ఇంతవరకూ బాగానేఉంది. కులాల లెక్క తేల్చడంతో అందరికీ దానిపై ఒక స్పష్టత వచ్చినట్టయింది.

అయితే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. 2015లో నిర్వహించిన సకలజనులసర్వేలో మాత్రం, బీసీల శాతం 51.08గా తేలింది. మరి ఈ కొద్దికాలంలో ఆ 5 శాతం బీసీలు ఏమయ్యారు? చనిపోయారా? లేక ఇతర రాష్ట్రాలకు గానీ, గల్ఫ్‌కుగానీ వలస వెళ్లారా? వారి జనాభా పెరగకుండా ఎలా తగ్గింది? అంటే బహుశా బీసీలు అత్యంత కఠినంగా జనాభా నియంత్రణ పాటిస్తున్నారా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ.

ఈ చర్చను పక్కకుపెడితే..రాహుల్ ఆదేశాలతో కులగణనను విజయవంతం చేశామని, సీఎం రేవంత్ నుంచి మంత్రుల వరకూ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. దీనిని రేపటి మంత్రివర్గ సమావేశంలోనూ, తర్వాత అసెంబ్లీ సమావేశంలోనూ ప్రవేశపెట్టి ఆమోదించడం వరకూ బాగానే ఉంటుంది. ఆమేరకు కులగణన చేసిన ఘనత కాంగ్రెస్‌లో ఖాతాలో కలుస్తుంది. ఈ లెక్కలతో ప్రభుత్వం-పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు అక్కరకొస్తుంది.

అయితే కులగణన వ్యవహారం.. కాంగ్రెస్‌కు రాజకీయంగా పితలాటకంగా పరిణమించనుంది. ఇప్పటికే జనాభాలో పిడికెడు శాతం ఉన్న రెడ్లకే సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారంటూ తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సారథ్యంలో, హన్మకొండలో జరిగిన సభ నిప్పులు కురిపించింది. ఈ రాష్ట్రానికి రేవంత్‌రెడ్డే చివరి సీఎం అని గర్జించింది. పిడికెడుమంది లేని రెడ్లకు 60 మంది ఎమ్మెల్యేలు, జనాభాలో 60 శాతం మంది ఉన్న బీసీలకు 19మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సీట్లు మీ అయ్యజాగీరా? మీ అబ్బసొత్తా? ఓట్లు మావి..సీట్లు మీవా? అంటూ రెడ్డి సామాజికవర్గంపై, కాంగ్రెస్ దళిత-బీసీ నేతలే నిప్పులు కురిపించడం కాంగ్రెస్‌ను ఉలిక్కిపడే లా చేసింది.

ఈ నేపథ్యంలో.. ఇప్పుడు కులగణన లెక్కల ప్రకారమే రాజకీయంగా పదవులు పంచాలంటూ, తెరపైకి వచ్చిన కొత్త డిమాండ్ కాంగ్రెస్‌కు రాజకీయ సంకటంలా మారింది. ఇకపై అన్ని కులాలు కులగణనలో ప్రభుత్వం పేర్కొన్న లెక్కలు గుర్తు చేసి.. ఆ దామాషా ప్రకారం తమకు, సీట్లు-పదవుల వాటా కావాలని పిడికిలి బిగించే ప్రమాదం కనిపిస్తోంది. అందుకు తీన్మార్ మల్లన్న నిర్వహించిన హన్మకొండ బీసీ సభ స్ఫూర్తిగా నిలిచింది.

నరేందర్‌రెడ్డి అభ్యర్ధిత్వంపై సంకటం

దానికంటే ముందు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు.. కులగణన అమలుపై చిత్తశుద్ధి అంశం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి వ్యవహారంతో తేలిపోనుంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజాబాబాద్-ఉమ్మడి మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ నరేందర్‌రెడ్డిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అక్కడ బీసీ , వెలమ నేతలు రేసులో ఉన్నప్పటికీ రెడ్డి అభ్యర్ధినే ప్రకటించారు.

నిజానికి కరీంనగర్,మెదక్, నిజామాబాద్‌లో ముదిరాజ్, మున్నూరు కాపు, పద్మశాలికులాల సంఖ్య ఎక్కువ. ఆదిలాబాద్‌లో ఎస్టీ, ఎస్సీలు, బీసీల సంఖ్య ఎక్కువ. విచిత్రంగా ఈ జిల్లాల్లో రెడ్ల జనాభా పెద్దగా లేదు. అయినా కాంగ్రెస్ పార్టీ రెడ్డి అభ్యర్ధిని ప్రకటించడంపై కాంగ్రెస్‌లోని బీసీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్ని జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధికి అర్హుడైన ఒక్క బీసీ కూడా రేవంత్‌రెడ్డికి కనిపించలేదా? పీసీసీ అధ్యక్షడు స్వయంగా బీసీ అయి ఉండి కూడా రెడ్డి అభ్యర్ధిని ఖరారు చేస్తుంటే మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

అయితే ఇప్పుడు కులగణన నివేదికను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ముందు తన సిద్ధాంతాన్ని తొలుత వచ్చిన గాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని ల ద్వారా నిరూపించుకోవడం కాంగ్రెస్‌కు అనివార్యంగా మారింది. అంటే కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించిన నరేందర్‌రెడ్డిని మార్చి, ఆయన స్థానంలో ఒక బీసీని ప్రకటించాల్సి ఉంది. ఇంకా బీ ఫారాలు ఇవ్వనందున, అది పెద్ద కష్టమేమీకాదు. గతంలో కూడా ఎన్నికల సమయాల్లో ఇలాగే అభ్యర్ధుల జాబితాను మార్చిన సందర్భాలు కోకొల్లలు. ఆ దారిలోనే నరేందర్‌రెడ్డి స్థానంలో ఒక బీసీ నేత పేరును ప్రకటించక తప్పని పరిస్థితి. ఇక్కడ రెడ్డి అభ్యర్ధిని మార్చి, బీసీ అభ్యర్ధి పేరు ప్రకటిస్తేనే కాంగ్రెస్‌కు బీసీకులగణనపై చిత్తశుద్ధి ఉన్న సంకేతాలు వెళతాయి. లేకపోతే అదే రెడ్డి అభ్యర్ధిని ప్రకటిస్తే మాత్రం.. కులగణన కేవలం కంటితుడుపు మాత్రమేనన్న విమర్శ ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఆ ప్రకారంగా.. 119 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 58, పార్లమెంటుకు 9మంది సీట్లకు బీసీ అభ్యర్ధులను ప్రకటించడం అనివార్యమవుతుంది. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో కూడా 46 శాతం బీసీలకు ఇవ్వకతప్పదు. దానికంటేముందు.. క్యాబినెట్‌లో కూడా 46 శాతం మంది బీసీలను తీసుకోక తప్పనిసరి పరిస్థితి. ప్రస్తుతం ఎస్సీ నుంచి డిప్యూటీ సీఎంగా ఒక్కరే ఉన్నారు.

తాజా కులగణన నేపథ్యంలో.. బీసీలకు మరో డిప్యూటీ సీఎం ఇవ్వాల్సి వస్తుంది. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో.. బీసీలకు డిప్యూటీ సీఎంతోపాటు, 46 శాతం మంత్రి పదవులతో మంత్రివర్గం ఏర్పాటుచేయడం అనివార్యమవుతుంది. ఈ దామాషాను అమలుచేస్తే, తెలంగాణలోని బీసీ వర్గాలు కాంగ్రెస్ వైపు గంపగుత్తగా నడిచే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ కులగణన నివేదిక ప్రకారం.. పదవుల్లో 46 శాతం పాటించకపోతే మాత్రం, ఇదే అంశం కాంగ్రె స్ పతనాన్ని శాసించేందుకు కారణమవుతుందని కాంగ్రెస్ బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

కాగా 21 లక్షలమంది బీసీలను తగ్గించి ఇచ్చిన కులగణన నివేదికను, తాము చెత్తబుట్టలో పారేస్తామని బీసీ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఈడబ్ల్యుఎస్ కోటాలోని వారి కోసమే బీసీల సంఖ్య తగ్గించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వ్యతిరేకి అని బీసీ సంఘం జాతీయ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు.

ఆ 5 శాతం బీసీలు ఏమయ్యారు?:బీసీ

‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2015లో నిర్వహించిన సకలజనుల సర్వేలో బీసీల జనాభా 51.08 శాతమని తేల్చారు. మరి ఇప్పుడేమో 46.25 శాతం అంటున్నారు. ఆ లెక్కన అప్పటి 5 శాతం బీసీలు ఎటుపోయారు? మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారా? పక్కరాష్ట్రాలకు, పరాయిదేశాలకు పారిపోయారా? ఇన్నేళ్ల కాలంలో బీసీల జనాభా ఎందుకు పెరగలేదు? బీసీలేమైనా జనాభా నియంత్రణ కఠినంగా అమలుచేస్తున్నారా? కేసీఆర్ హయాంలో 51 శాతం ఉన్న బీసీల జనాభా ఇప్పుడు సహజంగా పెరగాలి కదా? అసలు ఎన్యూమరేటర్లు చాలామంది ఇళ్లకు వెళ్లలేదు. సంపూర్ణ సర్వే చేసి ఉంటే బీసీల జనాభా మరో 10 శాతం పెరిగి ఉండేద’’ని బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య వ్యాఖ్యానించారు.

కులగణనను తాము తప్పు పట్టడం లేదని, అయితే అది సమగ్రంగా జరిగిఉంటే.. మరో 10 శాతం బీసీలు పెరిగేవారన్నదే తమ వాదన అన్నారు. ఈ కులగణనలోని 10.08 శాతం ముస్లిం బీసీలను.. 46 శాతం బీసీలలో కలపకుండా కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. గతంలో వైఎస్ చేసిన తప్పుల వల్ల 10 శాతం హిందూ బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతున్నారని, అందుకు గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలే నిదర్శనమన్నారు. ముస్లిం బీసీలను, హిందూ బీసీల్లో కలపవద్దని, దానివల్ల హిందూ బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

‘నిజానికి ముస్లిం బీసీల వ్యవహారం సుప్రీంకోర్టు రాజ్యాంగబెంచ్ వద్ద 2009 నుంచి పెండింగ్‌లో ఉంది. గతంలో కేంద్రం తాము వాదనలు వినిపించదలచుకోలేదనడంతో కోర్టు ఆ కేసు వాయిదా వేసింది. కాబట్టి రాష్ట్రంలో ఆ 10 శాతం బీసీ ముస్లిం వ్యవహారాన్ని, హిందూ బీసీలతో కలపడం న్యాయసమ్మతం కాద ’ని రామకృష్ణయ్య తేల్చారు.

అసలు రెడ్డికులానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఈ కమిటీ చైర్మన్‌గా నియమించడంలోనే, ప్రభుత్వానికి కులగణనపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టం చేసిందన్నారు. ‘ఈ కమిటీకి చైర్మన్‌గా బీసీ మంత్రులెవరూ కనిపించలేదా? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పక్షాన ఉన్నారో అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

కులగణన నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 46 శాతం బీసీలకు న్యాయం చేయాలని ఉంటే.. ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి బదులు బీసీకి ఆ టికెట్ ఇవ్వాలని, అప్పుడే రేవంత్‌కి బీసీలపై ఉన్న చిత్తుశుద్ధి తేలుతుందని వ్యాఖ్యానించారు. బీసీల గురించి ఆయన చెప్పే మాటలు, నిమజమేనని నమ్మే అవకాశం ఉంటుందని రామకృష్ణయ్య స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE