– ‘కొసరు బావ’గారిదే హవా
– పేషీలో ‘చక్ర’ం తిప్పుతున్న ఓ ఉద్యోగి
– థర్డ్‌పార్టీ ఏజెన్సీల నుంచి పనుల కేటాయింపుల వరకూ వారిదే హవా
– పోస్టింగులలో వారిదే పెత్తనం
– మంత్రిని తప్పుదోవపట్టిస్తున్నారన్న విమర్శలు
– పేషీ ప్రక్షాళన చేయకపోతే మంత్రి భవిష్యత్తుకే నష్టమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కార్మికశాఖపై మంత్రి పట్టు తప్పుతోందా? ఆయన మంచితనాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుని, మంత్రిని బలిపశువు చేస్తున్నారా? ఓ ఇద్దరు పేషీలోనే దుకాణం పెడుతున్నారన్న ప్రచారంపై నిఘా విభాగం ఇప్పటికే నివేదిక పంపించిందా? తమకు గిట్టని అధికారులపై.. పేషీ నుంచే బినామీ పేర్లతో ఫిర్యాదులు వెళుతున్నాయన్న ఆరోపణలు నిజమేనా? ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌లోని ‘తిమింగలాల తమ్ముడి’తో థర్డ్‌పార్టీ ఏజెన్సీ పనుల కేటాయింపు కోసం.. పేషీ మనుషులు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారన్న విమర్శల్లో నిజమెంత? ఓవైపు ఎన్నికల్లో మంత్రిగారు చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీలు కట్టలేని పరిస్థితి. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వైనం. మరి ఇవన్నీ ఎవరికి చేరుతున్నాయి? ఎటు పోతున్నాయి? పేషీని ప్రక్షాళన చేయకపోతే మంత్రికి రాజకీయ మనుగడ ఉండదా? ఇదీ సచివాలయవర్గాల్లో హాట్ టాపిక్.
జగన్ జమానా మారి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని శాఖల్లో వైసీపీ వాసనలు కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స, ద్వారంపూడి అండ్ అదర్స్‌కు వీరవిధేయులుగా చెలామణి అయిన కొందరు ఉన్నతాధికారులు.. ఆ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ, ఇంకా దర్జాగా అదే స్థానాల్లో కొనసాగుతున్న వైనంపై..‘మంచి ప్రభుత్వం’ పెద్దమనసుతో కరుణించడం మీడియాలో రచ్చవుతోంది. అందులో పరిశ్రమలతో సంబంధం ఉన్న కార్మికశాఖ ఒకటి.
పార్టీ-ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకువచ్చే చర్యలకు పాల్పడవద్దని.. సీఎం చంద్రబాబునాయుడు పదే పదే చేస్తున్న హెచ్చరికలు కొన్ని శాఖల చెవికెక్కడం లేదు. మంత్రులు-అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్న సీఎం ఆదేశాలు బేఖాతరవుతున్న వైచ్రితి.
మంత్రులు తమ బంధుమిత్రులను దూరంగా ఉంచాలన్న బాబు ఆదేశాలు, బుట్టదాఖలవుతున్న పరిస్థితి కొన్ని శాఖల్లో కొనసాగుతోందన్న చర్చ జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడునెలలవుతున్నప్పటికీ.. జగన్ జమానాలో చక్రం తిప్పిన అధికారులే ఇంకా కార్మికశాఖలో తిష్టవేసిన వైనమిది.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా పాతవాసనలు పోని శాఖల్లో.. కార్మిక శాఖ ఒకటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ జమానాలో కడప ఎంపి అవినాష్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దన్నుతో కీలకమైన పోస్టింగులు తెచ్చుకున్న రెడ్డి సామాజికవర్గ అధికారులు.. ఇంకా అదే చోట దిగ్విజయంగా కొనసాగుతున్న వైనంపై, ఆ శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కార్మిక శాఖలో చక్రం తిప్పుతున్న‘కొసరు బావగారు’ వీరికి దన్నుగా ఉన్నట్లు కార్మిక శాఖలో ప్రచారం జరుగుతోంది. ‘కొసరు’ బావగారిని సంతృప్తి పరిస్తే చాలు.. కార్మిక, ఫ్యాక్టరీస్, బాయిలర్ విభాగాల్లో ఏ పనులైనా వాయువేగంతో జరిగిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
‘అసలు బావ’గారు పాపం ఎక్కడో హైదరాబాద్‌లో, తన మానాన తాను పద్ధతిగా వ్యాపారాలు చేసుకుంటుంటే.. ‘కొసరు బావ’గారు మాత్రం, శాఖను దున్నేస్తున్నారన్న విమర్శలు, అమలాపురం టు రామచంద్రాపురం వయా అమరావతి వరకూ వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఫ్యాక్టరీస్, లేబర్ డిపార్టుమెంట్‌లో జరుగుతున్న తెరచాటు యవ్వారాలు ఇప్పటికే సీఎంఓకు పుంఖానుపుంఖాలుగా చేరాయట.
జగన్ జమానాలో కార్మిక శాఖలో కీలక హోదాలో పనిచేసిన పలువురు రెడ్డి సామాజికవర్గ ఉన్నతాధికారులు.. వైసీపీ ఓడిపోయి, కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఇంకా నిక్షేపంలా అదే చోట కొనసాగుతున్న వైనం, కార్మిక శాఖలో చర్చనీయాంశమయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, పోలీసుశాఖలో కానిస్టేబుల్ నుంచి అన్ని శాఖల్లోనూ బదిలీలు జరిగాయి.
జగన్ హయాంలో పనిచేసిన అధికారులు, సిబ్బందిని మరో చోటకు బదిలీ చేయడమో, అసలు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టడమో జరిగింది. కానీ కార్మికశాఖలో మాత్రం అందుకు భిన్నంగా.. వైసీపీ జమానాలో పనిచేసిన రెడ్డి సామాజికవర్గ అధికారులే ఇంకా కొనసాగించడం విశేషం. ఇదంతా కార్మికశాఖలో చక్రం తిప్పుతున్న‘కొసరు బావగారి’ మహత్యమేనన్న ప్రచారం జరుగుతోంది.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి జాయింట్ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా.. కర్నూలు జిల్లాకు చెందిన శివశంకర్‌రెడ్డి గత సర్కారు హయాంలో, కడప ఎంపి అవినాష్‌రెడ్డి సిఫార్సుతో ఆ పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆ మేరకు అవినాష్‌రెడ్డి ఆయనకు సిఫార్సు లేఖ కూడా ఇచ్చారు.
అనారోగ్య కారణాలు చూపించి ఆయన, తాను కోరుకున్న చోటకు బదిలీ చేయించుకున్నారు. ఎంపి అవినాష్‌రెడ్డి దన్ను ఉన్నందున, సహజంగా ఆయన హవా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని, ఆ శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇంకా ఆయనను అక్కడే కొనసాగించడం విశేషం.
ఇక గుంటూరు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా.. కర్నూలు జిల్లాకే చెందిన శివకుమార్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం ఆ జిల్లాలో చేరారు. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించేవారంటూ, దానికి సంబంధించి ఆయన పాల్గొన్న ఫొటో ఒకటి అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
విచిత్రంగా ఆయన కోసం శ్రీకాకుళంకు చెందిన ఒక బీసీ అధికారిని సస్పెండ్ చేశారట. ఆయన స్థానంలో రెడ్డిగారిని నియమించిన వైసీపీ సర్కారుపై, సస్పెండయిన బీసీ అధికారి హైకోర్టుకు వెళ్లి.. తన సస్పెన్షన్‌ను సవాల్ చేసి, పోస్టింగు తెచ్చుకోవలసి వచ్చిందని కార్మిక శాఖ వర్గాలు గుర్తు చేశాయి.
చిత్తూరు జిల్లా ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా.. వైసీపీ హయాంలో చేరిన శివశంకర్‌రెడ్డి అప్పటిమంత్రి పెద్దిరెడ్డి బంధువు రాజశేఖర్‌రెడ్డి దన్నుతో, అక్కడ పోస్టింగ్ తెచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. అప్పటినుంచి అన్ని ఫ్యాక్టరీలు.. ‘కొసరు ‘బావగారు’ సేఫ్టీ థర్డ్ పార్టీ ఏజెన్సీకే వర్కు ఇవ్వాల్సిందేనట. ఈ ఏజెన్సీ హవా కడప నుంచి కృష్ణా జిల్లా వరకూ విస్తరించిందంటే.. జగన్ జమానాలో ఎంత హవా నడిచిందో ఊహించుకోవచ్చంటున్నారు.
ఇక కర్నూలు డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా జగన్ జమానాలో నియమితులైన నారాయణరెడ్డి, ఇప్పటికీ అదే శాఖలో కొనసాగుతుండటం విశేషం. బదిలీల సమయంలో మిగిలిన అధికారులంతా బదిలీ అవుతున్నప్పటికీ, వీరిని మాత్రం తరచూ మినహాయిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వం మారినా వీరంతా ఇంకా అక్కడే కొనసాగుతున్నారంటే.. వీరికి పైస్థాయిలో ఎంత పలుకుబడి ఉందో స్పష్టమవుతోందని కార్మిక శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధానంగా ‘కొసరు బావగారి’ అండదండలు ఏ స్థాయిలో ఉన్నారో అర్ధమవుతోందంటున్నారు. ఫ్యాక్టరీస్ విభాగంలో మహా‘రాజు’లా చక్రం తిప్పుతున్న ఓ అధికారి దన్ను, పుష్కలంగా ఉండటమే దానికి కారణమంటున్నారు. త్వరలో రిటైరవుతున్న సదరు అధికారి, ముందస్తుగా ఒక పెద్ద ఫార్మా కంపెనీలో సేఫ్టీ అధికారిగా ఉద్యోగం సంపాదించేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అటు లేబర్ డిపార్టుమెంటులో కూడా జరుగుతున్న అడ్డగోలు బదిలీలకు అంతులేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగా ఏ అధికారిని వారి సొంత జిల్లాల్లో నియమించరు. కానీ ఘనత వహించిన కార్మికశాఖలో మాత్రం ఆ నిబంధనను కొండెక్కించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నియామకాలలో సొంత జిల్లా నిబంధనను, అతిక్రమించారని కార్మికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
విజయనగరం జిల్లాకు చెందిన ఓ అధికారికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు; ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అధికారిని అదే జిల్లాలో; కర్నూలు జిల్లాకు చెందిన ఓ అధికారికి అక్కడి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారట.
అయితే దీనిని కొందరు ప్రశ్నించిన సందర్భంలో.. వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఎక్కడా ఖాళీలు లేవన్న సమాధానం, ఉన్నతాధికారుల నుంచి వచ్చిందట. నిజానికి వారి స్థాయి అధికారులను బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు (బీఓసీడబ్ల్యు)కు సీఈఓలుగా నియమించే అవకాశం ఉందని కార్మిక శాఖ అధికారి ఒకరు వివరించారు. అయితే అది లాభసాటి పోస్టు కాదనే ప్రచారం ఉందట.
ఇక బాయిలర్ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారిపై, గత ఏడాదిలో ఏసీబీ దాడి జరిగింది. అయినప్పటికీ మళ్లీ అదే స్థానంలో నియమించారంటే .. ‘కొసరు బావగారి’ హవా, కార్మిక శాఖలో ఏ స్థాయిలో నడుస్తుందో అర్ధమవుతోందని కార్మికశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
‘లేబర్’ లో లూటీరాజ్?
లేబర్ డిపార్టుమెంట్‌లో లూటీరాజ్ నడుస్తోంది. పేషీలో చక్రం తిప్పేదంతా ఆ ఇద్దరే. వాళ్లు చెప్పిందే వేదం. ఎవరిని బదిలీ చేయాలన్నా, ఎవరికి పనులు కేటాయించాలన్నా ఆ ఇద్దరిదే పెత్తనం. తమ మాట వినని ఫ్యాక్టరీ అధికారులపై వాళ్లే మంత్రికి ఫిర్యాదులు ఇప్పిస్తారు. దానికో ప్రత్యేకమైన విభాగాన్నే ఏర్పాటుచేసుకున్నారు. వీరిలో ఒకటే కులానికి చెందిన ఆర్‌టిఐ యాక్టివిస్టులు, కుల సంఘాల నాయకులు, ఆర్గనైజేషన్లు ఉండటమే విశేషం. ఆ స్థానంలో తమ కులానికి చెందిన అధికారులను నియమించుకునేందుకు ఇదో తెలివైన ఎత్తుగడ.
ఇవన్నీ ఎవరైనా సీఎంఓకు ఫిర్యాదు చేస్తే.. అది కూడా సదరు వ్యక్తికి తెలిసిపోతుందట. కారణం సీఎంఓలో పనిచేసే ఓ యువ ఐఏఎస్ వద్ద పనిచేసే ఓ ఉద్యోగి… లేబర్ పేషీలో చక్రం తిప్పుతున్న ఈ అధికారికి బంధువు కావడమే దానికి కారణమట.
పోనీ ఆ ఫిర్యాదుదారులేమైనా ఫ్యాక్టరీ విభాగంలో బాధితులా అంటే అదీ లేదు. అసలు వారికి ఆ విభాగంతో సంబంధమే ఉండదు. కాకపోతే వారి ఫిర్యాదును అడ్డుపెట్టుకుని లూటీ చేసే నయాదందా ఇది! పేషీలో పనిచేసే ఆయన తన శాఖలో తన కులం వారినే నింపేస్తున్నారు. ప్రభుత్వోద్యోగం చేస్తూ మత ప్రచారకుడిగా పనిచేస్తున్న ధిక్కారంపై చర్యలు తీసుకునేవారే లేరు.
లేటెస్టుగా తనకు సరిపడని కాకినాడకు చెందిన ఓ ఫ్యాక్టరీ అధికారులపై ఫిర్యాదు చేయించారు. ఎప్పుడో 2017 లో అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదానికి సంజాయిషీ ఇవ్వాలని వారిద్దరినీ విచారణకు పిలిపించడం బట్టి.. లేబర్ డిపార్టుమెంట్ పేషీలో దందారాజ్ ఎంత విశృంఖలంగా జరుగుతుందో సుస్పష్టం.
వైసీపీ హయాంలో బాధితులయిన కమ్మ, బీసీ అధికారులు, వ్యాపారులనూ విడిచిపెట్టని లేబర్ దందా ఇప్పటికే సీఎంఓకు చేరింది.
ఇక పొగాకు వ్యాపారానికి కేంద్రమైన గుంటూరులో పొగాకు బార్నీల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐ చెల్లించకుండా ఒక వెసులుబాటు ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కంపెనీల నుంచి లక్షలు చేస్తున్న వసూల్ రాజా లీలలు.. త్వరలో మీ ‘సూర్య’ లో!