Suryaa.co.in

Andhra Pradesh

మార్కెట్‌ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర

– 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు
– గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం
– మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం
– నూటికి నూరుశాతం రైతుల పక్షాల నిలబడతాం
– నెల్లూరుజిల్లాలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలను రెండురోజుల్లో చెల్లిస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌
– మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డితో కలిసి సంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

నెల్లూరు / సంగం : రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం ఉదయం సంగం మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలో 20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ .. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రైతులకి మార్కెట్‌ని బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ లో 33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగులు చేసి 5.87 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 7480 కోట్ల రూపాయలు జమచేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో 32కోట్ల రూపాయల రైతుల సొమ్ముని స్కామ్‌ చేసి దోచేశారన్నారు.

గత ప్రభుత్వ పాలకులు వ్యవస్థలను దుర్వినియోగం చేసి రైతులను మోసం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.361 కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిల్లర్లకు రూ. 10 కోట్లు చెల్లించామన్నారు. అలాగే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించకుండా, 1674 కోట్లు బకాయి పెట్టిందని, తమ ప్రభుత్వం ఆ బకాయిలను రైతులకు చెల్లించిందని చెప్పారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రవాణా, హమాలి చార్జీలు రూ. 1.40 కోట్లు రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసి 24 గంటల్లోపే డబ్బులు చెల్లించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలుస్తామన్నారు. రైసుమిల్లుల యజమానులు బాధ్యతగా పనిచేయాలని, రైతుల్ని ఇబ్బంది పెడితే సహించమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజనపథకానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి సన్నబియ్యాన్ని సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. రైతులు భయాందోళనకు గురయ్యేలా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మవద్దన్నారు.

నూటికి నూరుశాతం రైతుల పక్షాల పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని మంత్రి చెప్పారు. నెల్లూరు జిల్లాలో 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మార్చి నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో సుమారు 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, 25 లక్షల ధాన్యాన్ని పిడిఎస్ బియ్యానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వంలో మూడు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారందరికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 1871 మందికి ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. తేమశాతం 17 కంటే ఎక్కువగా ఉంటే ఒక కేజీ నుంచి ఐదు కేజీల వరకు మాత్రమే ధాన్యం తీసుకోవాలని, అంతకు మించితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను హెచ్చరించారు.

 

LEAVE A RESPONSE