– సుప్రీంకోర్టు
వైద్య విద్య సీట్లలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలో నివసించేవారి విషయంలో రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని.. అయితే అది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకేనని.. ఆ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కీలక తీర్పును జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సుధాంషు ధులియా జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఇచ్చింది.
రాష్ట్ర కోటా కింద పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నివాస ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, ఈ కేటగిరి కింద ఇప్పటికే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం ఉండదని వెల్లడించింది.