Suryaa.co.in

Telangana

రేవంత్.. ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పు!

– దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 10 శాతం పైనే
– ఐటీ ఉద్యోగుల పట్ల అవమానకర వ్యాఖ్యలు తగవు
– కేటీఆర్ అమెరికాలో మార్కెటింగ్ విభాగంలో అధిపతిగా పనిచేసిన ప్రతిభ గల వ్యక్తి
– బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఐటీ ఉద్యోగుల నుంచి బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.ఆ మేరకు శ్రవణ్ సీఎం రేవంత్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు.

సీఎం హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఒక ముఖ్యమంత్రిగా విదేశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే సమయంలో బాధ్యతాయుతంగా మాట్లాడటం అత్యంత కీలకమని డాక్టర్ శ్రవణ్ పేర్కొన్నారు. దావోస్‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశాయని అన్నారు.

ఐటీ ఉద్యోగుల పట్ల అవమానకర వ్యాఖ్యలు తగవు. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు వారి శ్రమ, ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని డాక్టర్ శ్రవణ్ పేర్కొన్నారు. భారతదేశ జీడీపీలో ఐటీ రంగం 10 శాతం పైనే వాటా కలిగి ఉందని, ఈ రంగం దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్న కీలక రంగమని గుర్తు చేశారు.

కేటీఆర్‌పై అవాస్తవ ఆరోపణలు. కేటీఆర్ డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేశారనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ఆయన అమెరికాలో మార్కెటింగ్ విభాగంలో అధిపతిగా పనిచేసిన ప్రతిభ గల వ్యక్తి అని స్పష్టం చేశారు. కేటీఆర్ దూరదృష్టితోనే లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు.

ఐటీ ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ సూత్రాలను, రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నాయని డాక్టర్ శ్రవణ్ విమర్శించారు.

LEAVE A RESPONSE