– ఎవరు గోబెల్స్ ? ఎవరు నియంతలు ?
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: ఏవైనా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపవచ్చు. కానీ నిత్యం నిందాపూర్వక ఆరోపణలు చేస్తున్నారు. ఏం చేస్తారో చెప్పకుండా ఇప్పుడు కూడా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో పార్టీలకు, వ్యక్తులకు మధ్య భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయి. అంతమాత్రానా ఇష్టమున్నట్లు ఎదుటివారిని తూలనాడడం అనేది కుసంస్కారాన్ని తెలియజేస్తుంది
ప్రజాస్వామ్య పీఠం మీద కూర్చున్న సీఎం నేను ఇలాగే మాట్లాడతాను అంటే అంతకుమించిన అపరిపక్వత ఇంకోటి ఉండదు. వనరులు సమీకరించుకుంటూ కేంద్ర జలవనరుల నిపుణులు ప్రశంసించినట్లు ఇంజనీరింగ్ మార్వెల్ కాళేశ్వరం నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పంప్ హౌస్ లు, సొరంగాలు, రిజర్వాయర్ల నిర్మాణాలతో 90 శాతం పనులు పూర్తి చేశాం.
కాలువల నిర్మాణానికి టెండర్లు పిలిచాం ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పిడికెడు మట్టి తీయలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి, కాంగ్రెస్ పాలనలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. 46 వేలకు పైగా చెరువులు, కుంటలు పునరుద్దరించి, వేలాది చెక్ డ్యాంలు నిర్మించుకున్నాం.
తన పనిలో తానుండి తెలంగాణను ఆదర్శప్రాయంగా నిలపాలనే ప్రయత్నాలలో ఉండగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఒకరు, పనికాలేదని ఒకరు కేసీఆర్ మీద విషం చల్లారు. కావాలనే బద్నాం చేశాం అని ఒక మంత్రి, కావాలనే కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేశామని మరికొందరు స్వయం ప్రకటిత మేధావులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రెండేళ్లలో వాళ్ల కలలు కల్లలయ్యాయి. ఇప్పుడు బుద్దితక్కువై అలా చేశాం అని చెబుతున్నారు
వ్యూహాలను ఎవరైనా నిర్మాణం కోసం ఉపయోగిస్తారు. విధ్వంసానికి వ్యూహం పన్నేవారు వీరేం మేధావులు ? టన్నుల కొద్దీ వీళ్లు కక్కిన విషం మూలంగా ప్రస్తుతం మరో తరం నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీనిని తెలంగాణ జాతి ఎన్నడూ వారిని క్షమించదు. క్షమార్హం కాని ద్రోహం తెలంగాణ సమాజానికి చేశారు. ఒక మనిషి మీద కోపం ఉంటే ఒక వ్యవస్థ పాడు కావడానికి వీరు చేసిన చర్యలు అత్యంత దుర్మార్గం
శ్రీశైలం ప్రాజెక్టు ఉద్దేశమే వెయ్యి మెగా వాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. కాలక్రమంలో అనేక ప్రయోగాలతో తెలంగాణను ఎండబెట్టి అవతలి ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి కుట్రలు పన్నారు. తెలంగాణ నేతలు కొందరు ఆంధ్రా వాళ్ల కబంధ హస్తాల్లో ఉన్నారు. ఈ కుట్రలు ఎవరైనా చెప్పినా ప్రజలకు వివరాలు తెలియకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి విషయాలు తెలియవు. నీళ్ల మంత్రికి నల్లగొండ తప్ప మరో విషయం తెలియదు. సీనియర్ మంత్రిగా తెలంగాణకు మేలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు
1982 జులై 29న కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నంబర్ 306 విడుదల చేశారు. శ్రీశైలం నీళ్లను ఎడమ, కుడి వైపులకు ఎన్ని నీళ్లను వాడుకునే అవకాశం ఉందో అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దాని మీద చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం శ్రీశైల రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు 2.75 లక్షల ఎకరాలకు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నల్లగొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు.
శ్రీశైలం రెండు వైపులా ఉన్న భౌగోళిక పరిస్థితుల ప్రకారం సొరంగాలు తీయాల్సిందే. అటు వైపు గ్రావిటీ ప్రకారం నీళ్లు వెళ్తాయి. 1.9.1983 ఎన్టీఆర్ ప్రభుత్వంలో జీఓ నంబర్ 368 విడుదల చేస్తూ లెఫ్ట్ బ్యాంక్ వైపు అటవీ ప్రాంతం ఉంది. టన్నెల్ కు పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని జీఓలోనే పేర్కొన్నారు. టన్నెల్ ద్వారా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుండి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలను ప్రతిపాదించారు
1994లో ఎస్సెల్బీసీకి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. మరి 2014 వరకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సెల్బీసీ టన్నెల్ ను ఎందుకు పూర్తి చేయలేదు ? 2004లో జలయజ్ఞంలో భాగంగా ఎస్సెల్బీసీ పనులు ప్రారంభించారు. చరిత్ర తెలియకుండా రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధ్యతారాహిత్యం. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కు సమాంతరంగా కుడి వైపు ప్రకాశం జిల్లా కొల్లం వద్ద రివర్స్ టన్నెల్ పెట్టి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అని పేరు పెట్టారు
నల్లగొండకు నీళ్లిచ్చే ఎస్సెల్బీసీ టన్నెల్ పొడవు 42 కిలోమీటర్లు. కుడివైపు టన్నెల్ పొడవు 38 కిలోమీటర్లు. ఒకటే శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉన్న రెండు టన్నెల్లలో అదే నల్లమల అడవిలో ఉన్న పనులలో కుడిపక్కకు లేని పర్యావరణ ఇబ్బందులు ఎడమవైపుకు ఎలా వచ్చాయి ? అటు వైపు టన్నెల్ ఎలా పూర్తయింది ? ఇటు వైపు ఎందుకు ఆగిపోయింది ? మీ వైఫల్యమే ఈ దుస్థితికి కారణం. అది మరిచిపోయి కేసీఆర్ మీద నిందలేస్తారా?
కాంగ్రెస్ హయాంలో ఈపీసీ ద్వారా కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారు. తెలంగాణ వచ్చాక పనులు త్వరగా చేసుకుందాం అంటే పనులు రద్దు చేయకుండా పీఠముడి వేశారు. ఎస్సెల్బీసీలో ఆడిట్ సిస్టం లేకుండా పనులు చేపట్టడం దుర్మార్గం. ఎలుకలు కూడా కొంచెం దూరి తవ్వి లోపలికి గాలి వచ్చేందుకు మరో బొక్క పెడతాయి. కానీ ఇందులో అది లేదు.
కాంగ్రెస్ మిడి మిడి తెలివితో ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పకుండా మళ్లీ విమర్శలు చేయడం సిగ్గు చేటు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అప్పట్లో ప్రభుత్వం నుండి బయటకు వచ్చింది. కేసీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 40 రోజులు శాసనసభను స్థంభింపచేశాం.
పాలమూరు రంగారెడ్డిలో మిగిలిపోయిన పది శాతం పనులను పూర్తి చేయడం లేదు. మళ్లీ కొడంగల్, నారాయణ పేట ఎత్తిపోతల చేపట్టారు. దానికి అసలు నీటి కేటాయింపులే లేవు. భీమాకు ఉన్న నీళ్ల కేటాయింపు నుండే 5 టీఎంసీలు దానికి కేటాయించారు. దానిని నికర జలాలు అని పేర్కొనడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
రూ.27 వేల కోట్లు పాలమూరు రంగారెడ్డికి ఖర్చు పెట్టి నీళ్లివ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటు. కేసులు వేసి అడ్డుకున్న మేధావులు ఎంత మంది ? అన్ని పనులు పూర్తి చేసి పెడితే కాలువలు తవ్వకుండా నీళ్లు ఇవ్వలేదని చెప్పడం అవివేకం. కేఎల్ఐ మోటారు ఏడాదిలో దాదాపు 200 రోజుల వరకు నడుస్తుంటే, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కేవలం 50 నుండి 60 రోజులు మాత్రమే నడుస్తున్నాయి.
ఆర్డీఎస్ ను కాంగ్రెస్ నాశనం చేస్తే కేవలం 11 నెలలలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి నీళ్లందించాం. కాంగ్రెస్ నేతలు వాగడం తప్ప రెండేళ్లలో ఒక్క వాగు మీద చెక్ డ్యామ్ నిర్మించలేదు. చేతనయితే చెప్పిన పనులు, ఇచ్చిన హామీలు చేసి చూపించాలి.
కాంగ్రెస్ పాలనలో పత్తిని అమ్ముకోలేక రైతులు తగులబెట్టుకుంటున్నారు. వరంగల్ వరదల్లో నష్టపోయిన వారిని గాలికి వదిలేశారు. వచ్చిన ఒక ఉప ఎన్నిక చుట్టూ ముఖ్యమంత్రి, మంత్రులు తిరుగుతున్నారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమీషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.