– అసెంబ్లీ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాలి
– రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేటముంచింది. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో వాగ్దానాలు చేశారు. ఇవాళ ఏ ఒక్క వాగ్ధానం నెరవేర్చలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, అరచేతిలో వైకుంఠం చూపించి, రైతులను మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే మోసకారిగా మారింది.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ: 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అయితే 25 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగతా రైతులకు రుణమాఫీ చేయాలి. లేదంటే అసెంబ్లీ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రైతులు క్షమించరు.
ఎన్నికలకు ముందు రూ. 15 వేల రైతు భరోసా పేరు ఇస్తామన్నరు. అధికారంలోకి వచ్చాక మాటమార్చి ఎకరానికి రూ. 12 వేలు రెండు విడతలుగా ఇస్తామని చెప్పారు. కానీ, ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. రైతు భరోసాపై ఉపసంఘం కేవలం సాగుచేసే భూములకే రైతు భరోసా సాయం అందిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపనతో రైతులను ఇబ్బంది పెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు భరోసా లేకుండా పోయింది. రైతులందరికీ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
కౌలు రైతులకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నరు. ఎంతమందికి రైతు కూలీలకు సాయం అందించారు..? 14 పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ ఇస్తమని చెప్తున్నారు. కాని ఇంతవరకు రైతులకు బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 2320 కనీస మద్దతు ధర నిర్ణయించి, రైతులకు అండగా నిలుస్తోంది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉంది.
క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర (రూ.2,320), మండీ హమాలీ చార్జెస్, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు ఛార్జీలు, ప్రభుత్వ అధికారులకు ఛార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం తీరుతో రైతులు రైస్ మిల్లుల దగ్గర కేవలం రూ. 2 వేల కంటే తక్కువ ధరకే క్వింటాలు ధాన్యాన్ని అమ్ముకుని నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న కారణంగా అనేక చోట్ల కాల్వల్లో నీరు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా నీటి విడుదల చేయకపోవడం వల్ల రైతులు పంట నష్టపోతున్న పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ నాయకులకు ఎండిపోయిన రైతుల పంటలు కనపడటం లేదా? అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు?
కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద ఇచ్చే నిధులు రైతులకు అందాలంటే సర్వే పూర్తిచేసి రిపోర్టును కేంద్రానికి పంపాలి. పంట నష్ట అంచనా సర్వేను చేయకుండా, కేంద్రం ఇచ్చే సాయం రైతులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఫసల్ బీమా లేదు.. పంటల బీమా లేదు.. రైతు బీమా అందడం లేదు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే. రెండు పార్టీలు పంటలకు బోనస్ ఇవ్వలే.. ఫసల్ బీమా యోజనను అమలు చేయలేదు. ఇప్పటికైనా రైతులను సాయాన్ని అందించి ఆదుకోవాలి. లేదంటే రైతుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు రైతుల పక్షాన బిజెపి పోరాటం కొనసాగిస్తుంది.
మక్కల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2225 అందిస్తోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడంతో ధాన్యాన్ని రూ. 2 వేల కంటే తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని రైతులకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, రైతుల ప్రయోజనాల కోసం మార్చ్ 28 వ తేదీన ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తుంది. రైతులు పెద్దఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.