Suryaa.co.in

Telangana

బీజేపీలోకి రేవంత్‌రెడ్డి

– అందుకే కాంగ్రెస్‌ను ఫినిష్ చేస్తున్నారు
– రేవంత్‌కు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వరు
– పావుగంటలోనే రేవంత్‌కు మోదీ అపాయింట్‌మెంట్
– తనది బీజేపీ స్కూలని రేవంతే చెప్పారు
– బీజేపీ ఎంపీల విజయానికి సారధి రేవంతే
– బీజేపీపై బలహీన అభ్యర్ధులను నిలబెట్టారు
– బీజేపీ ఎంపీలున్న చోట్ల మంత్రులు లేరు
– అక్కడ బీజేపీ ఎదుగుదల కోసమే రేవంత్ నిర్ణయం
– ఓటుకు నోటు కేసు ఏమైంది?
– రేవంత్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయదు?
– గల్లీలో గలీజ్ దందా లు.. ఢిల్లీ లో గులాం గురి
– రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటి
– రాహుల్ గాంధీ.. దమ్ముంటే అశోక్ నగర్ రా
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ ఆయన చదివిన స్కూలయిన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తున్నారు. కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలి. బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టి స్వయంగా 8 మంది బీజేపీ ఎంపీలను రేవంత్ గెలిపించారు. బండి సంజయ్ కూడా రేవంత్‌కు జాగ్రత్తలు చెబుతున్నారు. ఎంపి అరవింద్ కూడా రేవంత్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామంటున్నారు.రేవంత్ బీజేపీలోకి వెళతారన్నదానికి ఇంతకంటే ఇంకే సంకేతాలు కావాలి’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ను పూర్తిగా నాశనం చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే…

నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లో చిట్ చాట్ చేశారు. గల్లీలో గలీజ్ దందా లు చేస్తూ ఢిల్లీ లో గులాం గురి చేస్తున్నట్లు ఆయన తీరు ఉంది.మంత్రుల శాఖల కేటాయింపు కోసం,కాంగ్రెస్ పార్టీ అధినేతల అపాయింట్ కోసం రెండు రోజులు ఢిల్లీ లో పడిగాపులు కాసి అపాయింట్మెంట్ దొరకని ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడు.

కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటే అని రేవంత్ రెడ్డి అన్న మాట అబద్ధం, అవాస్తవం. రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటి అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి ,బీజేపీ దోస్తాన్ చాలా సార్లు బయట పడింది. లోక్ సభ ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ ఎంపీ లు గెలవడానికి రేవంత్ రెడ్డి సహాయపడ్డారు. స్వయంగా ఈ మాట బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

మల్కాజ్ గిరి లో ఈటల రాజేందర్ ను గెలిపించడానికి వేరే ప్రాంతం నుంచి సునీతా మహేందర్ రెడ్డి ని నిలబెట్టారు. కిషన్ రెడ్డి ని గెలిపించడానికి బిఅరేస్ లో ఉన్న దానం ని సికింద్రాబాద్ లో నిలబెట్టారు. కాంగ్రెస్ నుండి గతంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డి కి కాదని, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వెలిచాల రాజేందర్ కు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ పై పోటీకి నిలిపారు.

ఇలా నిజామాబాద్ లో అరవింద్ పై, మెదక్ లో రఘునందన్ పై ,ఆదిలాబాద్ లో నగేష్ లపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బలహీన అభ్యర్థులను నిలబెట్టాడు. 8 బీజేపీ ఎంపీ లలో 7 మందిని రేవంత్ రెడ్డి గెలిపించారు. బీజేపీ ని పెంచటానికి బీజేపీ ఎంపీ లు గెలిచిన చోట నిజామాబాద్, హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇవ్వడం లేదు.

బీజేపీ పార్టీ కూడా రేవంత్ రెడ్డి పై ఈగ వాలనివ్వడం లేదు. స్వయంగా ప్రధాని మంత్రి మోడీ ఎలక్షన్ ప్రచారం లో తెలంగాణ లో ఆర్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని మాట్లాడిన ఈడీ, సీబీఐ ఎందుకు రావడం లేదు? ఓటుకు నోటు కేసు ఎటుపోయింది, ఎందుకు జాప్యం జరుగుతోంది?
రేవంత్ రెడ్డి ఢిల్లీ కి పోయినప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు. కానీ ప్రధాని ని కలవడానికి 15 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది? బండి సంజయ్ ఒపెన్గానే రేవంత్ రెడ్డి ని పదవి కాపాడు కోవాలని సూచనలు ఇస్తున్నాడు.

బీఆర్‌ఎస్ ను రాజకీయంగా బొంద పెట్టడానికి కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేయాలి అని బండి సంజయ్ అన్నారు.

బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే సంకేతం బండి సంజయ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీ లో జాయిన్ అయితే స్వాగతిస్తామని ఎంపీ అరవింద్ అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి, బీజేపీ దోస్తానా సంకేతము కాదా? నేను బీజేపీ స్కూలో చదువుకున్న అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు.

హైదరాబాద్ లో అన్నది మోడీ విన్నాడో లేదో అని, మళ్ళీ అవే మాటలు ఢిల్లీలో మాట్లాడినడు. బీజేపీ లోకి వెళ్తాను అని సూచన ఇస్తున్నట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ ని నమ్మకండి. కాంగ్రెస్ ని ఖతం చేసి బీజేపీ లోకి పోతారు.

కేసీఆర్ తెలంగాణ కు ఆత్మ. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడుతున్న సంధర్భంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కు పెట్టిన నువ్వు తెలంగాణ కు శత్రువు.

ఆంధ్ర ప్రదేశ్ కి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే నోరు మూసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ శత్రువు. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంను 4 వ ప్లేస్ కు, జిడిపిలో 4 వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 13 వ స్దానానికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు.

తెలంగాణ అప్పుల పాలు అయ్యిందని, తెలంగాణ ముఖ్యమంత్రి గా వెళ్తే దొంగ లా చూస్తున్నారని తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ కు శత్రువు. బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి, తెలంగాణ కి ఒక్క రూపాయి తీసుకురాలే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ ఎంపీలు వేల కోట్లు నిధులు తెచ్చుకున్నారు. నిధుల వరద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుపోతున్నారు.

పోలవరం,అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు వేల కోట్లు,బనకచర్ల కు జాతీయ హోదా తెస్తుంటే మన కాంగ్రెస్ , బీజేపీ ఎంపీలు ఒక్క రూపాయి కూడా తెలంగాణ కు తేవట్లేదు. కాబట్టి తెలంగాణ కి అసలైన శత్రువులు బీజేపీ కాంగ్రెస్ పార్టీలే? 8 +8 = 16 కావాలి కానీ మన ఎంపీల చేతగాని తనం వల్ల జీరో అయ్యింది. బీఆర్‌ఎస్ పార్టీ కేసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. బీఆర్‌ఎస్ ఎంపీ లు గెలిచి ఉంటే తెలంగాణకి ఈ గతి పట్టేదా. 45 సార్లు ఢిల్లీ కి పోతే 4 సార్లు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బతుకు అలా ఉంది.

మంత్రుల శాఖల కేటాయింపులు కూడా ఢిల్లీ వాళ్లే చేయాలి. శాఖల కేటాయింపులు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. తెలంగాణ ఆత్మ గౌరవం.

ఢిల్లీ లో మొకారిల్లేలా చేస్తున్నాడు. మూడు రోజుల్లో కాళేశ్వరం పై మాట్లాడుతా అంటున్న రేవంత్ రెడ్డి. అబద్దాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రెసెంటెషన్ వంటకం సిద్ధం కాలేదా ఇంకా ?

18 నెలల నుంచి ముఖ్యమంత్రి గా చేసింది ఏంటి ? కేసీఆర్ కేటీఆర్ హరీష్ బీఆర్‌ఎస్ నేతలను జైల్ లో వేయ్యాలనే ఆలోచన తప్ప..రాష్ట్రం కోసం ఆలోచన లేదు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా వారియర్స్ ను, కొంతం దిలీప్ లాంటి వారిని అరెస్ట్ చేయడం తప్ప తెలంగాణ కు ఏమి చేశావ్. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ముఖ్యమంత్రి.

కేసులపై పెట్టే సమయాన్ని పాలన పై పెట్టండి. వంద రోజుల్లో 6 గ్యారెంటీ లు 420 హామీలు అన్నావ్..ఏమైంది 600 రోజులైనా గ్యారంటీలు అమలు కాలేదు? రేవంత్.. ఉద్దేరా మాటలు బంద్ చెయ్యి. అందరికి 2 లక్షల రుణమాఫీ చేశావా? 2 లక్షల పైన ఉన్న డబ్బును కట్టిన వారి సంగతి ఏంటి? సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. రైతు భరోసా రెండు సార్లు ఎగగొట్టావ్. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు బంధు అంటున్నావ్. సన్న వడ్ల బోనస్ నూటికి 20 మందికి ఇచ్చావ్..అన్ని వడ్ల కి బోనస్ అన్నావ్. మాట మార్చవ్.

ఇందిరమ్మ ఇళ్ల ల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకుంటున్నారు. పెద్ద యాడ్స్ తప్ప..ఇందిరమ్మ ఇల్లు కడితే పైసలు ఇస్తావో లేదో అని ఇండ్లు కట్టడం లేదు. మహిళ లకు 2500, విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు హామీ ఏమైంది?2 లక్షల ఉద్యోగాలు ఏమైంది?

రాహుల్ గాంధీ.. దమ్ముంటే అశోక్ నగర్ రా. జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఎన్నికల సమయంలో ఉద్యోగులను రెచ్చ గొట్టావ్.. డీఏ లు, పీఆర్సీ,రిటైర్డ్ బెనిఫిట్స్ ఏమైంది? ఇలాంటి చిల్లర వేషాలు ప్రజల సమస్యలను డైవర్ట్ చేయాలని రేవంత్ చూస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కి కర్రు కాల్చి వాత పెడతారు.

బీఆర్‌ఎస్ కి 60 లక్షల సైన్యం ఉంది వారందని జైల్ లో వేస్తావా? రేవంత్ రెడ్డి పిట్టలదొర మాటలు ఆపాలి. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రేవంత్ వెంట పడుతూనే ఉంటుంది.

LEAVE A RESPONSE