Suryaa.co.in

Telangana

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు జగన్ పాలు

-నిధులు మెగా కృష్ణారెడ్డిపాలు
-నియామకాలు కేసీఆర్ ఇంటి పాలు
-తుంగతుర్తి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు జగన్, నిధులు మెగా కృష్ణారెడ్డి, నియామకాలు కేసీఆర్ ఇంటి పాలు అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తుంగతుర్తిలో నిర్వహించిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ నెల 30న జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

“మనుమడిని మంత్రిని చేసేటందుకే కేసీఆర్ మూడోసారి అవకాశం ఇవ్వాలంటుండు..పది ఎకరాల్లో నిర్మించుకున్న కేసీఆర్ గడీలోకి పేదలకు ప్రవేశం లేదు. పేదోడి చెమట వాసన ఎట్లుంటదో కేసీఆర్ కు తెలియదు. నన్ను రానివ్వకపోయినా సరే… అమరుల కుటుంబాలకు కూడా ప్రగతి భవన్ లోకి ప్రవేశం లేదు..గద్దరన్నను కూడా లోపలికి రానీయకుండా ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారు. ఆంధ్రా కాంట్రాక్టులర్లకు లోపల అతిథి మర్యాదలు… మనం మాత్రం ఎర్రటి ఎండలో మగ్గిపోవాలా? కేసీఆర్ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక్కడ ఎమ్మెల్యే మూరెడు లేడు కానీ.. మూసీని మింగిండు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు సారా పొసే వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నాడు. నాడు రాజాకార్లను తరిమిన చరిత్ర నల్లగొండది…అలాంటి ఇక్కడ కేసీఆర్ కు సీసాలో సారా పోసేవారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న పరిస్థితి దాపురించింది. ఇలాంటి వాళ్లతో నల్లగొండ ఆత్మగౌరవం నిలబడుతుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

“కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం పెట్టిండు..ఒడిపోతామన్న భయంతో ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని చూస్తుండ్రు..కేసీఆర్ ఇచ్చే పదివేలు తీసుకోండి… కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించండన్నారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
డిసెంబర్ 3 తర్వాత రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైలులో డబల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 30 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE