– భార్యలకు ఉచిత బస్సు ప్రయాణం.. భర్తలకు మాత్రం టికెట్ ధర రెట్టింపు
– లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయడానికి కాంగ్రెస్ కుట్ర:
– ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది
– అదే కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ‘మరో అవకాశం’ కోసం యాచిస్తోంది
– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించి, మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున బుద్ధి చెప్పండి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ₹10,000 కోట్లకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, తద్వారా లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను పొందే హక్కును దూరం చేస్తున్నారని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంకే జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఆశయాలను నాశనం చేసి, తెలంగాణ విద్యావంతులైన యువతను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, మనుగడ కోసం పోరాడుతున్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని కేటీఆర్ అన్నారు. “బకాయిలు చెల్లించకపోవడం ద్వారా దళిత, ఆదివాసీ, బహుజన, పేద అగ్రకుల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆశలను అణిచివేసేందుకు పన్నిన పన్నాగం” అని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డొల్ల మాటలను ఎద్దేవా చేస్తూ, “విద్యార్థుల ఫీజులు కూడా చెల్లించలేని ముఖ్యమంత్రి, జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం ఏం చేయగలరు?” అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. “వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, సంస్థలను బెదిరించి భయాందోళనలు సృష్టిస్తున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వృద్ధులకు ₹4,000 పెన్షన్, కోడళ్ళకు ₹2,500 భత్యం, యువతులకు స్కూటర్లు, రైతులకు ₹15,000 సాయం, ₹2 లక్షల రుణమాఫీ, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ నెరవేరలేదు” అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు వంటి అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరా పథకాన్ని కూడా ఆపివేసిందని ఆయన అన్నారు. “భార్యలకు ఉచిత బస్సు ప్రయాణం అంటారు, కానీ భర్తలకు మాత్రం టికెట్ ధరను రెట్టింపు చేశారు. ఇదేనా వాళ్ళు చెప్పే సంక్షేమం?” అని చురక అంటించారు.
కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేస్తూ, 2014కి ముందు నగరంలో కరెంటు కోతలు, నీటి కొరత తీవ్రంగా ఉండేవని అన్నారు. “ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉండేది, ప్రతి వేసవిలో నీటి కొరత తప్పేది కాదు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ నిరంతర విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు, వేగవంతమైన పట్టణాభివృద్ధికి నమూనా రాష్ట్రంగా మారింది. 3 లక్షల నుంచి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించాం, పరిశ్రమలను విస్తరించాం, శాంతిభద్రతలను కాపాడాం” అని ఆయన వివరించారు.
“ఇది సాధారణ ఎన్నిక కాదు, కారు కు, బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న పోరాటం. బుల్డోజర్ ప్రభుత్వాన్ని ఆపడానికి ప్రజలు కారు గుర్తుకే ఓటు వేయాలి” అని స్పష్టం చేశారు. మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని కేటీఆర్ జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.
భారీ కరతాళ ధ్వనుల మధ్య తన ప్రసంగాన్ని ముగిస్తూ, కేటీఆర్, “ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల గందరగోళానికి మధ్య జరుగుతున్న పోరాటం. తేడా ఏంటో ప్రజలు చూశారు. ఇప్పుడు తెలంగాణ భారాసతో ముందుకు సాగాలా లేక కాంగ్రెస్‌తో వెనక్కి వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నవంబర్ 11న కారు గుర్తుకు ఓటు వేసి, తెలంగాణ భవిష్యత్తును రక్షించండి” అని పిలుపునిచ్చారు.