Suryaa.co.in

Andhra Pradesh

పేదోడికి మళ్ళీ పట్టెడన్నం

– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ : ఎంతో మంది పేదలు తినడానికి తిండి లేక పస్తులు పడుకుంటున్న సందర్భాలు ఉన్నాయని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపుతున్నామనే సంతోషం తనకు ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్పారు. సోమవారం నందిగామ పురపాలక రైతు బజార్ వద్ద ఉన్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ సందర్శించి పేదలకు స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2014-2019 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసి నిరుపేదలను రోడ్డున పడేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు.

పేదోడికి మళ్లీ పట్టెడన్నం అందిస్తోందన్నారు. పేదలకు అన్నం పెట్టే ఈ మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సౌమ్య పిలుపునిచ్చారు. తమ వంతుగా ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE