1925లో నాగపూర్ లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ఆంధ్ర ప్రాంతంలో వ్యాపింపజేయడానికి దత్తాత్రేయ యాద్వడ్కర్ 1940 జూన్ 21 న విజయవాడలో అడుగు పెట్టారు. సంఘ స్థాపకులు ఐన డా. హెడ్గేవార్ మరణించినారన్న వార్త విని ఆయన నాగపూర్ కి వెళ్లి పోయారు. ఇంటర్మీడియట్ చదవడానికి ఆయనతోపాటు వచ్చిన దత్తాత్రేయ దండోపంత్ బంధిష్టే ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో చేరి ఇక్కడ ఉండి పోయాడు.
ఇక్కడి భాష తెలియదు. పరిచయస్థులు లేరు. అయినా ధైర్యం కోల్పోలేదు. తాను వచ్చినపని ఏమీ లేదు. సెప్టెంబర్ 11 న విజయవాడలో సంఘశాఖ ఆరంభమైంది. ఆ తర్వాత కొద్దిరోజులకు యాద్వడ్కర్ జీ మరో ఇద్దర్ని వెంటబెట్టుకొని వచ్చారు. వారి పేర్లు గోపాల్ రావ్ ఠాకూర్, వినాయకరావు దేశముఖ్.
బందరు, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్య పేట, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి ఇలా ఎన్నో చోట్ల శాఖలు మొదలయ్యాయి. 42లో బంధిష్టే తెనాలికి వెళ్లారు. అక్కడినుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, రేపల్లె వరకు శాఖలు వ్యాపింపజేశారు.
1943లో ఇంటర్మీడియట్ చదవడానికి మహారాష్ట్రలోని అమరావతి నుండి నెల్లూరు వచ్చిన మరో తరుణ వయస్కుడు నీలకంఠ రావ్ దేశపాండే. వారికి తోడైన స్థానిక యువకులు దినవహి వీర్రాజు , బాలకవి కుమార స్వామి, పిళ్లారామారావు, చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, సోమేపల్లి సోమయ్య, బోను వెంకటేశ్వరరావు, ఉపద్రష్ట వెంకట్రామయ్య… వీరు తెలుగు నేలపై ఎటువంటి పంట పండించారో విపులంగా చెప్పే ప్రయత్నం
‘ తెలుగు ప్రాంతాల్లో ఆర్ ఎస్ ఎస్.’
నిజాం రాజ్యం నడుస్తుండగానే కరీం నగర్ జిల్లా కోరుట్లలో శాఖ నడిపించిన వారు కస్తూరి ఎల్లప్ప. సికింద్రాబాద్ సమీపంలోని బొల్లారంలో వామన్ పాతూర్కర్, సుల్తాన్ బజార్లో బాబూరావు ముడ్ఖోల్కర్ శాఖలు ఆరంభించారు. పోలీసు చర్యకు ముందే శ్రీ గురూజీ నాంపల్లిలో వందమంది స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆతర్వాత యాదవ్ రావ్ జోషి , శ్రీధర్ కామత్, గణపతిరావు బ్రహ్మపూర్కర్, రామ్ సాఠే, రామచంద్ర సదాశివ హల్దేకర్ ప్రయత్నాలతో తెలంగాణలోనూ శాఖలు నిలద్రొక్కుకున్నాయి.
పోపూరి నరసింహం అనే తెలుగు పండితుడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో శాఖ నడిపి ఎం.డి.వై. రామమూర్తి గండ్లూరి వెంకట శేషఫణి, ఎం పద్మనాభాచార్యులను సంఘానికి అందించారు. ఆ నరసింహం గారే, ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ ఎస్.ఎల్. ఎన్. ఆచార్యులును ప్రచారక్ గా సంసిద్ధ పరిచారు. అలా తొలినాళ్లలో పరుసవేది స్పర్శతాకిన యువకులు ఎన్ని దశాబ్దాలు ఎంత శ్రమకోర్చి ఎన్నెన్ని అద్భుతాలు సాధించారో! నాలుగు దశాబ్దాల చరిత్ర ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది.
1948లో సంఘంపై మొదటి నిషేధం, 1975 లో అత్యవసర పరిస్థితిలో రెండవసారి నిషేధం సంఘం ఎలా ఎదుర్కొన్నదో తెలుసుకోవలసిన చరిత్ర. 1977తుఫాను, ఉప్పెన బాధితులకు సంఘం అందించిన సేవలు ఎవరూ ఊహించలేనివి.
270 పుటల్లో 170 మంది కార్యకర్తల చిత్రాలతో విపులమైన విశేషాలను కూర్చిన గ్రంథం ప్రతి ఒక్కరూ చదివితీరాలి. 300 రూపాయల వెల గల్గిన ఈ గ్రంథం నవంబరు మొదటివారం లోపల బుక్ చేసుకొనేవారికి 200రూ.లకే లభిస్తుంది. విజయవాడలోని సాహిత్య నికేతన్ ని సంప్రదించండి.