వితండ వాదనతో పరిధి దాటిన పాలకులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లను విచారించిన ఎపి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ సి.ఆర్. డి.ఎ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టం చెల్లవని 3 మార్చి 2022 వ తేదీన 307 పేజీల చారిత్రాత్మక తీర్పు ఇవ్వడమే కాకుండా అమరావతి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలిస్తే ఎక్కడా కూడా కోర్టు న్యాయ నిబద్ధతను దాటిన దాఖలా లేదు.

కానీ జగన్మోహన రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి మాత్రం కోర్టు తన పరిధి దాటి శాసన వ్యవస్థ పరిధిలోకి జొరబడినట్లు అనిపించింది. ఇక గతంలో వ్యవస్థలను బహిరంగంగా దూషించినట్లు న్యాయవ్యవస్థ విషయంలో చేయలేరు కాబట్టి .. శాసనసభలో జరిగే చర్చలకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది కాబట్టి .. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సభలో ఎవరి నోటివాటం వారు ప్రదర్శించారు.

హైకోర్టు తన పరిధిదాటి శాసనసభ అధికారాల్లోకి చొరబడటం అవాంఛనీయమని ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్న అధికార విభజన సిద్ధాంతాన్ని హైకోర్టు ఉల్లఘించినట్లు ఆవేదన వెలిబుచ్చారు. నిజానికి ఎవరి అధికార పరిధిలోకి ఎవరు చొరబడ్డారు? రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల చట్టం ద్వారా కార్యనిర్వహక రాజధాని విశాఖలో, న్యాయ రాజధాని కర్నూలులో నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. అసలు రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అనే అంశాలపై వివరణాత్మకంగా విశ్లేషిస్తాను.

న్యాయవ్యవస్థకు సమీక్షించే అధికారం!
భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో స్పష్టం చేసింది. శాసన వ్యవస్థ లో పార్లమెంటు, కార్యనిర్వహక వ్యవస్థలో రాష్ట్రపతి, న్యాయ వ్యవస్థ లో సుప్రీంకోర్టు అత్యున్నతం. శాసన వ్యవస్థ చట్టాలు చేస్తే, ఆ చట్టాల అమలు బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ చేపడితే, ఆ చట్టాలు రాజ్యాంగచట్రంలో, న్యాయ పరిధిలో ఉన్నవా లేవా అని సమీక్ష చేసే అధికారం రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థకు సంక్రమించింది.

పార్లమెంటు ఆర్టికల్ 3 ను ఉపయోగించి చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించింది. అదే విభజన చట్టంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ గా పార్లమెంటు నిర్ణయించింది, విభజన చట్టం లోని సెక్షన్ 5, 6 మరియు 94 లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక మరియు నిర్మాణంపై విధి విధానాలు పొందుపరచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు భౌగోళిక స్వరూపం గుర్తింపు అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది.

ఆర్టికల్ 258 ఏం చెబుతోంది?
ఆర్టికల్ 258 (3) ద్వారా రాజధానిని ఎంపిక చేసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పార్లమెంటు డెలిగేట్ చేసింది. ఒకసారి రాజధాని ఎంపిక జరిగి దానిని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తరువాత, రాజధానిని తిరిగి మార్చుకునే అధికారం రాష్ట్రం కోల్పోయింది. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం చెబుతుంటే .. ఆ అధికారం లేదని కోర్టు ఎలా చెబుతుందని ముఖ్యమంత్రి ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగంలో “రాజధాని” అనే పదం ఢిల్లీ రాజధానిగా కేంద్ర, రాష్ట్ర అధికార బాధ్యతల నిర్వచనం కోసం ఆర్టికల్ 239 (ఏ ఏ ఏ) లో తప్పించి ఎక్కడా వాడబడలేదు.

రాజ్యాంగం ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలపై నిర్ణయం తీసుకునే చట్టబద్ధమైన అధికారం పార్లమెంటుకు దఖలు పరచబడింది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం రాజధాని నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ రాజ్యాంగపరమైన అంశాలపై సరైన అవగాహన కొరవడో లేక తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే మూర్ఖత్వమో, రాజధానులపై నిర్ణయం మాహక్కు .. పరిపాలనా వికేంద్రీకరణ మా విధానం .. ఈ విషయంలో వెనుకడుగు వేయం .. హైకోర్టు పరిధి దాటినట్లు అనిపిస్తోంది అని అసెంబ్లీ లో జగన్మోహన రెడ్డి ప్రకటించారు.

నిజానికి వై కా పా ప్రభుత్వం చేయబూనింది పరిపాలనా వికేంద్రీకరణ కాదు, రాజధాని వికేంద్రీకరణ. హైకోర్టు తీర్పులోని పేజీ నెం.291,292 లోని పేరాగ్రాఫ్ నెం 492,493 లో గతంలో మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజధానిలో భాగమైన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి మూడు రాజధానుల చట్టం చేసి రాష్ట్ర శాసన వ్యవస్థ తనకన్నా ఉన్నతమైన పార్లమెంట్ అధికార పరిధిలోకి జొరబడిందని స్పష్టం అవుతోంది.

లేని అధికారంతో అడ్డగోలు నిర్ణయాలు
భారత రాజ్యాంగంలోని ఆరవ అధ్యాయం, ఐదవ భాగం పరిధిలో ఏర్పాటు చేయబడిన సుప్రీం కోర్టు భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించ బడుతోంది. రాజ్యాంగంలోని 124 నుండి 147 వరకు అధికరణలు సుప్రీంకోర్టు యొక్క కూర్పు అధికార పరిధిని నిర్దేశించాయి. సుప్రీంకోర్టు అసలైన, పునర్విచారణ సంబంధ, సలహా, అధికార పరిధిని కలిగి ఉండటమే కాకుండా .. ప్రాధమిక హక్కులు అమలు చేయుటకు సంబంధించి రాజ్యాంగం లోని 32 వ అధికరణం సుప్రీంకోర్టుకు విస్తృతమైన అధికారాన్ని సంక్రమింపచేసింది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం.2014 ప్రకారం 2019 జనవరి 1 న రాష్ట్రపతి ఉత్తరువులతో అమరావతి లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నెలకొల్పబడింది. రాష్ట్ర హైకోర్టు పాలనా బాధ్యతలు ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయి. హైకోర్టు ను వేరే ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియపరచాలి, ఒకవేళ హైకోర్టు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వస్తే వారు తమ సమ్మతిని కేంద్ర న్యాయశాఖకు, సుప్రీంకోర్టు కు నివేదించాలి.

అన్ని సవ్యంగా జరిగి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే మాత్రమే హైకోర్టు ను మార్చే అవకాశం ఉంటుంది. హైకోర్టు మార్చాలంటే ఇంత సుదీర్ఘమైన, సంక్లిష్టమైన విధానం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమకు లేని అధికారాలను ఉపయోగించి హైకోర్టును న్యాయ రాజధాని సాకుతో కర్నూలుకు మార్చుతూ చట్టం చేయడాన్ని మూర్ఖత్వమని కాక మరేమనాలి. భారత రాష్ట్రపతి ఉత్తరువులతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ను తరలించడం కోసం చట్టం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ రాష్ట్రపతి అధికార పరిధిలోకి, న్యాయ వ్యవస్థ పరిధిలోకి జొరబడింది.

పరిధి దాటింది ఎవరు?
హైకోర్టు తీర్పు శాసన సభపై ప్రభావం చూపుతుంది. శాసన సభ చట్టాలు, తీర్మానాలు చేయ కూడదంటే ఎలా? ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థలోకి చొరబడ కూడదు, ఫలానా చట్టం చేయొద్దని కోర్టులు చట్ట సభల్ని నియత్రించ లేవు అని శాసనకర్తలు సభలో మాట్లాడారు. న్యాయమూర్తులు పరిధి దాట వద్దని కూడా హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థలు రూపొందించే శాసనాలు, ప్రభుత్వం జారీ చేసే సూత్రాలు, అమలు చేసే విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని న్యాయసమీక్ష అంటారు.

ఆర్టికల్ 13 (2) ద్వారా న్యాయ సమీక్షాధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం కలిపించింది. శాసనం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాదికారం అనివార్యమని కె. ఎం. మున్షీ పేర్కొన్నారు. 1997 లో చంద్రకుమార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌళిక స్వరూపంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. రాజ్యాంగ సభలో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతూ భారత దేశ పౌరులందరికీ రెండు రకాల హక్కులు 1. ప్రాథమిక హక్కులు 2. చట్టబద్ధమైన హక్కులు రాజ్యాంగం కలిపిస్తుందని, వాటిలో ప్రాథమిక హక్కులు తిరుగులేని సంపూర్ణ హక్కులని ఉద్ఘాటించారు. ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి సంబంధించి రాజ్యాంగంలోని 32 వ అధికరణ సుప్రీంకోర్టుకు, 226 వ అధికరణ హైకోర్టు కు విస్తృతమైన అధికారాన్ని సంక్రమింపచేసింది.

సిఆర్ డిఎ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే
ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు, ఆదేశాలు, ఇతర నోటిఫికేషన్లు చెల్లవని, తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల చట్టం ద్వారా .. భూసమీకరణ విధానం ద్వారా రైతులు భూములు ఇస్తే బృహత్తర ప్రణాళిక ప్రకారం రాజధానిని నిర్మించి అగ్రిమెంట్ ప్రకారం అభివృద్ధి చేసిన భూమిని తిరిగి ఇస్తామని రైతులతో సి ఆర్ డి ఏ అభివృద్ధి ఒప్పందాన్ని ఉల్లఘించారని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

ప్రభుత్వ హామీని నమ్మి తమ జీవనాధారమైన భూములను అప్పగించిన రైతుల ప్రాధమిక హక్కులను ప్రభుత్వం కాలరాచి, మానవ హక్కుల ఉల్లఘనకు పాల్పడిందని కోర్టు నిర్ధారించింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను రిట్లు అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ద్వారా సంక్రమించిన విశేష అధికారాన్ని ఉపయోగించి రిట్ ఆఫ్ కంటిన్యూస్ మాండమస్ అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేయడం ద్వారా కోర్టు తానిచ్చిన తీర్పును పర్యవేక్షిస్తోంది. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటి కప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియ చేయాలని ఆదేశించింది.

శాసన సభలో గౌరవ సభాపతి మాట్లాడుతూ ఎవరి విధులు వారు నిర్వహించాలి, నా చెప్పులో ఇంకొకరు కాలు పెట్టి నడుస్తానంటే ఎలా? ఆ నడకకు ఠీవి రాదు. ఎక్కడో ఒక చోట బోల్తా పడుతారు .. ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనందుకు చాలా బాధపడుతున్నా అన్నారు. వారు అన్నది అక్షర సత్యం. ఒకరి చెప్పులో ఇంకొకరు కాలు పెడితే ఉపయోగం లేదు. కానీ ఇక్కడ మూడు రాజధానుల చట్టం , సి ఆర్ డి ఎ రద్దు చట్టాల ద్వారా రాష్ట్రపతి, పార్లమెంటు, న్యాయవ్యవస్థ పరిధిలోకి అక్రమంగా చొరబడింది .. రైతుల ప్రాథమిక హక్కులను భంగపరచి బోల్తా పడింది.. రాష్ట్ర శాసన వ్యవస్థ. కాబట్టి ఇప్పటికైనా మంది బలం న్యాయాన్ని నిర్దేశించలేదు అనే ప్రాథమిక సూత్రాన్ని పాలకులు గ్రహిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాదు ప్రజలు నాకు 151 సీట్లు ఇచ్చారు, నాకు అపరిమిత అధికారాలు ఉన్నాయి అనే భ్రమతో ఇష్టం వచ్చినట్లు శాసనాలు చేస్తే గౌరవ సభాపతి చెప్పినట్లు బోల్తా పడటం నిశ్చయం.

– లింగమనేని శివరామ ప్రసాద్
(టిడిపి విజయవాడ పార్లమెంటు ఉపాధ్యక్షులు)