Suryaa.co.in

Andhra Pradesh

గాల్లో దీపంలా ఏపీలో మహిళల భద్రత

– రోజురోజుకు దిగజారుతున్న శాంతి భద్రతలు
– ఆడబిడ్డలపై నిత్యం 49 అఘాయిత్యాలు
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

తాడేపల్లి: ఏపీలో ఆడపిల్లల భద్రత గాల్లో దీపంలా మారిందని, పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఆడబిడ్డలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొందని చెబుతూనే ఉన్నాం. కానీ భద్రత కల్పించడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.

తాజాగా హోం మంత్రి నివాసం ఉంటున్న విశాఖలో ఓ మహిళా లా స్టూడెంట్‌పై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైయస్సార్సీపీ హయాంలో తీసుకొచ్చన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు. దిశ యాప్‌ను కొనసాగిస్తే.. జగన్‌కి మంచి పేరొస్తుందనే భయంతో, సీఎం చంద్రబాబు ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేశారు. శాంతి భద్రతల కోసం పని చేయాల్సిన పోలీస్‌ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు.

ఆడబిడ్డలపై నేరాలు ఈ రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయని అసెంబ్లీలో స్వయంగా హోం మంత్రి అంగీకరించారు. రోజూ 49 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారంటే, ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్తితులు నెలకొన్నాయో తెలుస్తోంది.

ఐదు రోజుల క్రితం పెదగంట్యాడలో ఓ ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఆ నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ముచ్చుమర్రి కేసులో చిన్నారిని చంపి ముక్కలుగా నరికేసిన నిందితులు బెయిల్‌ తీసుకుని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇప్పటికీ చిన్నారి మృతదేహాన్ని మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు.

హిందూపూర్‌లో అత్తాకోడళ్లపై వారింటికే వెళ్లి అత్యాచారం చేశారంటే భద్రత ఎంత కడు దయనీయంగా ఉన్నాయో తెలుస్తోంది. రాంబిల్లి ఘటనలో సురేష్‌ అనే వ్యక్తి మహిళను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనకు ముందే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఇటీవల విశాఖ పెదగంట్యాడ ఘటనలోనూ ఇదే పరిస్ధితి. నిందితుడి గురించి బాధితురాలి కుటుంబం ప్రేమోన్మాది నీరజ్‌ శర్మ గురించి పోలీసులకు రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే నిందితుడు బరితెగించాడు. తెనాలిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన బాలిక విషయంలోనూ నవీన్‌ అనే వ్యక్తి రెచ్చిపోయాడు. బద్వేలులో బాలికపై పెట్రోల్‌ పోసి కాల్చి చంపేశాడు. బాపట్లలో వృద్ధుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ధర్నా చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా అనిపించలేదు.

రుషికొండ భవనాల విషయంలో దారుణమైన అబద్ధాలు చెప్పిన కూటమి నాయకుల మాటలన్నీ అబద్ధాలని, మండలి సాక్షిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాటలు స్పష్టం చేస్తున్నాయి. జీవీఎంసీ, సీఆర్‌జెడ్‌ నుంచి అన్ని అనుమతులు పొందాకే అక్కడ భవనాలు నిర్మించారని స్వయంగా మంత్రి ప్రకటించారు. దీంతో ఏ అనుమతులు లేవని గతంలో ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారం మొత్తం అబద్ధమని తేలిపోయింది.

LEAVE A RESPONSE