నిండు సభలో పచ్చి బూతులా?

– రాష్ట్రాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారు
-కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు తగవు
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు వ్యక్తిగతంగా అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్‌ స్వాతంత్ర్య హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని అన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా అని శైలజానాథ్ పేర్కొన్నారు.
ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదని, రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్ర్య హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడం తగదన్నారు.
వ్యక్తిగతంగా శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయని, ఇక మీ అరాచకాన్ని ఉపేక్షించరని, దుశ్శాసనుల భరతం పడతారని హెచ్చరించారు. వీటన్నిటికీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు.