Suryaa.co.in

Andhra Pradesh

తల్లికి వందనం.. విద్యార్థులకు వరం

ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా “తల్లికి వందనం” అమలు చేస్తున్న – నారా లోకేష్

▪️ 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ, ఇందుకోసం 8,700 కోట్లు విడుదల.

– తల్లికి వందనం పై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.నూకసాని బాలాజీ ధ్వజం

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా చదివే పిల్లలు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబునాయుడు , లోకేష్ నేడు నెరవేర్చారు . ఏ పిల్లవాడూ విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.నూకసాని బాలాజీ అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, నిన్న తల్లికి వందనం అమలు చేసి సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్‌ లక్షలాది మంది కళ్లలో వెలుగులు నింపారన్నారు.

ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద రూ.15 వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.2 వేలు మంత్రి నారా లోకేష్ బాబు జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, మరి వైసీపీ పాలనలో రూ.13 వేలు ఇచ్చారని, అంటే రూ.2 వేలు వైసీపీ నాయకుల జేబుల్లోకి పోయాయా అని ప్రశ్నించారు. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ రెడ్డి నేడు తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు.

గత ప్రభుత్వ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే పథకాన్ని అమలు చేస్తే… కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు తల్లికి వందనం ఇస్తుందన్నారు. పిల్లల స్కూలు ఫీజు కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా నారా లోకేష్ తల్లికి వందనం కార్యక్రమాన్ని తల్లులకు అందిస్తున్నారు. ఒకటో తరగతి లోనూ, ఇంటర్ ఫస్టియర్ లోనూ చేరే విద్యార్థులకు కూడా ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రతి విద్యార్థి చదువుకునేందుకు దోహదపడే విధంగా నేరుగా వారి తల్లి/సంరక్షకుని ఖాతాలో డబ్బులు వేస్తుంటే స్వాగతించకుండా తప్పుడు ప్రచారాలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో ఈ పథకం కోసం కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మేర ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు. విద్యార్థులకు పెట్టే చిక్కీలు, కోడిగుడ్లు కందిపప్పులో కూడా కమిషన్ లు తీసుకున్న నీచ చరిత్ర వైసీపీ నాయకులదని ఆయన అన్నారు.

 

LEAVE A RESPONSE