*విజయవాడలో కలుస్తున్న ‘ఎస్సీ’బి గ్రూపు
*‘సుప్రీం’ కోర్టు తీర్పు విజయోత్సవ సదస్సు
*తొలుత ఐదు జిల్లాల నుంచి వస్తున్న ప్రతినిధులు
విజయవాడ : ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తీర్పు అమలుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి చర్యలు మొదలు పెట్టడంతో ఈ తీర్పు అమలు వల్ల ప్రయోజనం పొందే- ‘ఎస్సీ’బి గ్రూపు రాష్ట్రంలో అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇందుకోసం ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమీషన్ నియమించింది.
ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండగా నాలుగున్నర ఏళ్ళపాటు ఎస్సీ ‘వర్గీకరణ’ అమలులో ఉన్నప్పుడు ‘మాదిగ’ కులాన్ని- ‘ఎస్సీ’బి గ్రూపుగా పరిగణించింది. మళ్ళీ ఇప్పుడు తీర్పు అమలైతే, తిరిగి అదే ‘శ్రేణి’ తమకు లభిస్తుందని భావిస్తున్నారు. మా కంటే వెనుకబడిన ‘రెల్లి’ ఉపకులాలను మునుపటి మాదిరిగానే మా కంటే ముందు ‘ఎస్సీ’ ఏ గ్రూపుగా ఉంచాలని, రాబోయే విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి మార్గదర్శకాలు గ్రామ పంచాయతీ స్థాయి వరకూ చేరాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా తెలిపారు. ఈ సదస్సులో సభ్యులతో చర్చించి తర్వాత అవసరమైతే కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం ఇస్తామని సదస్సు కో-కన్వీనర్ తగరం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.