ఇళ్ల ప్లాన్లను సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది

Spread the love

– ఏపీలో కొత్త కలకలం
ఏం చేస్తున్నారో తెలీదు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. పట్టణాలు.. నగరాలు అన్న తేడా లేకుండా సచివాలయ సిబ్బంది సేకరిస్తున్న హౌసింగ్ ప్లాన్లు దేనికన్నది అర్థంకాక.. ఆందోళన చెందుతున్నారు ఏపీ వాసులు. కొన్ని దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇంటికి సంబంధించిన వివరాల్ని సేకరించటంతో పాటు.. అద్దె ఆధారిత పన్ను విధానాన్ని మార్చాలన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీంతో.. పన్నులు భారీగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇంటి ప్లాన్లను సేకరిస్తున్నది ఎందుకన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇంటి ప్లాన్లు అడుగుతున్న ప్రభుత్వ సిబ్బందిని అడిగితే.. తమకు పూర్తి సమాచారం తెలీదని చెప్పటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా ఏపీ వ్యాప్తంగా పలువురి ఫోన్లకు వస్తున్న సంక్షిప్త సందేశాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ‘మీ ఇంటికి ప్లాన్ ఉందా? ఉంటే దాని కాపీ వార్డు సచివాలయంలో ఇవ్వండి. కాపీ ఇవ్వకపోతే మీ భవనాన్ని అనధికార నిర్మాణంగా పరిగణిస్తాం’ అంటూ వస్తున్న మెసేజ్ ల పరామార్థం ఏమిటన్నది చాలామందికి అర్థం కావట్లేదు. ఇదిలా ఉంటే.. ఇంటి ప్లాన్లు ఎందుకు అడుగుతున్నారు? ఈ సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల్ని అడిగితే వారు చెబుతున్న సమాధానం ఒక పట్టాన అర్థం కావట్లేదు.
మీ ఇంటి ప్లాన్ మాకు చూపించండి. మాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే.. వార్డు సచివాలయంలో చూపించొచ్చు. ఇంటికిప్లాన్ ఉందో లేదో నిర్ధారించుకోవటానికి.. భవనాన్ని ఎప్పుడు నిర్మించారో తెలుసుకోవటానికే అడుగుతున్నాం’ అంటూ సచివాలయ సిబ్బంది మాటలు ఇప్పుడు కొత్త కలకలంగా మారింది.
ఇదిలా ఉంటే.. మరి చట్టాలు ఏం చెబుతున్నాయన్నది చూస్తే.. 1994 మార్చి ఒకటికి ముందు నిర్మించిన భవనాలకు ప్లాన్ లేకున్నా.. ప్లాన్ అతిక్రమించినా ఫైన్లు లేవు. అదే సమయంలో 1994 మార్చి 1 నుంచి 2007 డిసెంబరు 14 మధ్య నిర్మించిన భవనాలకు 10 శాతం.. 2007 డిసెంబరు 15 నుంచి 2013 ఆగస్టు 4 మధ్య నిర్మించిన భవనాలు.. నిబంధనలకు విరుద్దంగా ఉంటే 25 వాతం ఫైన్ విధిస్తారు.
2013 ఆగస్టు తర్వాత నిర్మించిన భవనాలకు.. ప్లాన్ లో అతిక్రమణలు 10 శాతం వరకు ఉంటే 25 శాతం.. 10 శాతం దాటితే 50 శాతం.. ప్లాన్ లేకుంటే వంద శాతం ఫైన్ విధిస్తారు. చట్టాలు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత.. ఇంటి ప్లాన్లను ఎందుకు సేకరిస్తున్నారన్నది ఒక పట్టాన అర్థంకావట్లేదు.

– సుధాకర్

Leave a Reply