Suryaa.co.in

Andhra Pradesh

నా కోరిక తీరిస్తే నీ అప్పు మాఫీ చేస్తా..

-కోరిక తీర్చే వరకు నీకు వేధింపులు తప్పవు
– వైసిపి కౌన్సిలర్ బరి తెగింపు
– కౌన్సిలర్ వెనక మరో ముఖ్య నాయకుడు హస్తం
– ఇప్పటికే ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం
– న్యాయం జరగకుంటే తప్పనిసరిగా ఆత్మహత్య చేసుకుంటానని మహిళ ఆవేదన
– కొనసాగుతున్న లైంగిక వేధింపులు
-విలేకరుల ఎదుట కన్నీరు పెట్టుకున్న ఓ అభాగ్యురాలు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీ 14వ వార్డు వైసిపి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే ప్రాంతానికి చెందిన తులసి రామకుమారి ఆరోపిస్తున్నారు. అతని నుండి తనకు రక్షణ కల్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో గురువారం రామ కుమారి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన కుటుంబానికి ఉన్న ఆర్ధిక అవసరాల దృష్ఠ్యా కొంత మంది వద్ద అప్పులు తీసుకుని ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం 14వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న చీర్ల ప్రసాద్ చాలా కాలం నుండి తనను లైంగికంగా వేధిస్తున్నారని తాను అంగీకరించలేదన్న కారణంతో అప్పుల వారితో తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

తన కోరిక తీరిస్తే వారి అప్పులన్నీ తానే చెల్లిస్తానని వాట్స్ యాప్ కాల్ చేసి వేధిస్తున్నాడని చెప్పారు. అతని వేధింపులు తట్టుకోలేక గత నెల 6వ తేదీనా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పగా బుచ్చి పోలీసులను పంపారని వారు వచ్చి విచారణ జరిపారన్నారు. సమస్య అక్కడితో సమసిపోతుందని భావించానని కన్నీరు మున్నీరైంది.

ఎస్పీ కి ఫోన్ చేశానని తెలుసుకున్న కౌన్సిలర్ ప్రసాద్ తనపై మరింత కక్ష పెంచుకుని వేధించడం ఇంకా ముమ్మరం చేశాడని రామ కుమారి చెప్పింది. తన కోరిక తీర్చమని అర్ధరాత్రిళ్లు వాట్స్ యాప్ కాల్ చేసి వేధించడమే కాకుండా నా కుమారులకు తనపై చెడుగా చెబుతానని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. అంతే కాకుండా పొదుపు గ్రూపులో వచ్చే నగదును కూడా ఆపించారని, దానికి కొంతమంది సహకరిస్తున్నారన్నారు. పొదుపు సంఘంలో రావల్సిన డబ్బులు అడిగితే కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ తో మాట్లాడాలని చెబుతున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, ప్రశ్నిస్తే కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారన్నారు.

వీరి వేధింపులు భరించలేక గత నెల 11వ తేదీనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశానని, కొందరు గుర్తించి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఇప్పటి వరకూ తనకు పరిష్కారం లభించలేదని, ఇప్పటికైనా పోలీసులు స్పందించి తన కుటుంబాన్ని కాపాడాలని లేదంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని తులసి రామ కుమారి చెప్పారు.

LEAVE A RESPONSE