(హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి వర్ధంతి నేడు)
రెండు రెళ్లు నాలుగు..
చిన్నపిల్లలైనా ఠక్కున
చెప్పే ఆన్సర్..
14 ఇంటూ 18 ఎంతో..
నువ్వూ నేనూ కొంత ఆలోచించి బదులు
చెప్పే లెక్క..
14367 ని 7 తో భాగిస్తే
వచ్చేది..
ఎవరికైనా కాలిక్యులేటరే
శరణం..
ఇక వర్గాలు..
వర్గ మూలాలు..
పెద్ద పెద్ద భాగాహారాలు..
కొన్ని సంఖ్యల కూడికలు..
తీసివేతలు..
క్లిష్టమైన లెక్కలు..
సమాధానం
సామాన్యుడికి కష్టం..
మేధావులకైనా కాగితం..
కాలిక్యులేటర్ తప్పనిసరి..
మరి శకుంతలా దేవికి
ఇవన్నీ నోటితో చెప్పేసే
లెక్కలు..అది కూడా చిటికెలో..కాగితం..కలం
అవసరం లేకుండా..
ఆలోచించకుండా… కాలిక్యులేటర్..
కంప్యూటర్ వంటి ఉపకరణాల
జోలికే పోకుండా..
ఒక సమస్యకు సమాధానం చెప్పడానికి
పక్కన నువ్వు కంప్యూటరుతో
తిప్పలు పడుతుంటే
ఆమె ఆమె కనీసం కాలిక్యులేటర్ జోలికైనా పోకుండా దాని కంటే జోరుగా..మళ్లీ మాట్లాడితే
గాలి కన్నా వేగంగా సమాధానం చెప్పే
మేధస్సు..అదే ఆమె చిరయశస్సు..!
గ్రహాల స్థితిగతులను..
వాటిని అనుసరించి
రాశి ఫలాలను చెప్పేసిన..
లెక్కలను..వాటిలోని చిక్కులను తేల్చేసిన..
ఆ లెక్కలపై
బుక్కులను రాసేసిన
శకుం’తల’ వర్ధంతి ఈరోజు..
ఆ హ్యూమన్ కంప్యూటర్ పై ఓ కవిత..
అది బుర్రా..పాదరసమా..
బ్రెయినా..కంప్యూటరా..
వాటిని మించి ఇంకో పోలిక
ఇంకేదైనా పదం..
శకుంతలా దేవి..
లెక్కల వాగ్దేవి..!
పూవు పుట్టగానే
పరిమళించినట్టు..
శకుంతల చిన్నప్పుడే
చిచ్చర పిడుగు..
ఎంతటి లెక్కయినా అడుగు…
సమాధానం రెడీ..
అందుకు ఎవరితోనైనా ఢీ!
అక్షరాలు నేర్వక ముందే
ఎక్కాలు బట్టీపట్టేసిన..
లెక్కల భరతం పట్టిన
చిన్నారి శకుం’తల’
ఎదిగాక ఆమె ముందు
కాలిక్యు’లేటర్’..
ఆమెతో పోటీ అంటే
కంప్యూటరుకే కన్ఫ్యూజన్..
అంత అపూర్వం
ఆమె విజన్!
కర్ణాటకలో జననం..
జీవితమంతా గణనంతోనే
గమనం..
లెక్క..అది ఎంతటిదైనా శకుంతలకు చిక్కేలేదు..
ఏ కంప్యూటరైనా దిక్కులేదు..
201 అంకెల సంఖ్య
23వ మూలం..
సమాధానం కోసం కంప్యూటర్ కు అవసరం
ఓ ప్రత్యేక ప్రోగ్రాం..
శకుంతలమ్మ చెప్పేసిందట
యాభై సెకన్లలో ఆ మూలం..
అదే ఆమె జాలం..!
నూరేళ్ళ కాలంలో ఏ తేదీ
చెప్పినా క్షణమాత్రంలో
అదే రోజో చెప్పేసే
ఖచ్చితత్వం..
లెక్కలే ఆమె తత్వం..
అవే మనస్తత్వం..!
శకుంతల మేధ అరుదు..
హ్యుమన్ కంప్యూటర్
తన బిరుదు..
ఆ పిలుపు ఆమెకు
నచ్చదు..
నిజానికి అది ఆమెకు తగదు!
కంప్యూటర్ ను
మించిన వేగం..
ఈ లెక్కల మేరునగం..
కొన్ని కంప్యూటర్లయితే
ఆ బుర్రలో సగం..
వాటిని ఓడించడమే
ఆమె సరాగం!
గణిత మేధావికి నివాళులు అర్పిస్తూ..
ఇ.సురేష్ కుమార్
9948546286