-మోదీ పై ఆరోపణలు చేయడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే
-పేపర్ లీకేజీపై బీజేపీ పోరు ఆగదు
-మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు ఉద్యమిస్తాం
-బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటపడి ప్రజలంతా చీదిరించుకుంటుండటంతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొత్త డ్రామాకు తెరదీశారు. కేంద్రంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే తలాతోక లేకుండా బైలడిల్ల గనుల గురించి కేటీఆర్ మాట్లాడటం సిగ్గు చేటు. సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
తెలంగాణలో మూతపడ్డ సంస్థలను పునరుద్దరించడం చేతగాని కేటీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై అభాండాలు మోపడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. అవినీతి మచ్చలేని ప్రధాని నరేంద్రమోదీ పై ఆరోపణలు చేయడమంటే ఆకాశంపై ఉమ్మేయడమేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దాలే. ఫూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను మినహా ఏ ప్రభుత్వ రంగ సంస్థను మోదీ పాలనలో ప్రైవేటుపరం చేశారో సమాధానం చెప్పాలి. సంక్షోభంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెచ్ఈఎల్ సంస్థలకు పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించి ఆదుకున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. రామగుండం సహా మూతపడ్డ 5 ఎరువుల ఫ్యాక్టరీలను వేల కోట్లు ఖర్చు చేసి పునరుద్దరించి రైతులకు కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్న ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదే.
తండ్రీకొడుకులు ఎన్ని డ్రామాలు చేసినా పేపర్ లీకేజీపై బీజేపీ పోరు ఆగదు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు ఉద్యమిస్తాం. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాటాలను ఉధ్రుతం చేస్తాం. అందులో భాగంగా ఈనెల 15న వరంగల్ లో జరపతలపెట్టిన ‘‘నిరుద్యోగ మార్చ్ ’’కు నిరుద్యోగులంతా తరలిరావాలని కోరుతున్నా.