– గణనాథునికి గొట్టిపాటి లక్ష్మి ప్రార్థన
దర్శి: వైసీపీ రాజకీయ కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆ గణనాథున్ని ప్రార్థించానని, వంద రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీస్తుంటే వైసీపీ నేతలు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు.
గణనాథుని ఉత్సవాలను పురస్కరించుకుని నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పుచ్చల మెట్టలోని గణేశుని విగ్రహం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో లక్ష్మి, యువ నాయకుడు లలిత్ సాగర్ తో కలిసి పాల్గొన్నారు. గణపతికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు ఏర్పాటుచేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
బెజవాడ తుపాను వంటి విపత్తులో ప్రజా నాయకుడిగా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించుకున్నారన్నారు. పది రోజులు కలెక్టరేట్ లో ఉండి సాధారణ స్థితికి తీసుకురాగలిగిన మహా నాయకుడు అని కొనియాడారు. పాలనంటే కార్యాలయాల్లో ఉండడం కాదని, ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చడమే నిజమైన నాయకుని లక్షణం అని చంద్రబాబు రుజువు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి యువతకు స్ఫూర్తి ప్రదాత లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంగా పరుగులు తీస్తుందన్నారు.
దర్శి ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడబోతుందని, నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ చైర్మన్ నారాపుశెట్టి పిచ్చయ్య, 10 వర్డు కౌన్సిలర్ దారం నాగవేణి సుబ్బారావు, పుచ్చలమెట్ట నాయుడు యూత్ తో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని లక్ష్మికి అపూర్వ స్వాగతం పలికారు.