బందరు డీఎస్పీ మాసుం భాషాకి షోకాజ్ నోటీసు

– తాలూకా ఎస్ ఐ, బందరు రూరల్ సిఐ పై పూర్తి విచారణ
– పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
– వివో ఏ నాగ లక్ష్మి చేసిన ఫిర్యాదు వ్యవహారం

మచిలీపట్నం : విధి నిర్వహణలో తను ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించమని బందరు మండల పరిధిలోని భోగి రెడ్డి పల్లికి చెందిన గరికపాటి నాగలక్ష్మి ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదును బందరు రూరల్ సిఐ కి బదిలీ చేసి దాని పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులకు ఫిర్యాదు బదిలీ చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే నాగలక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించింది మరణించిందనే అంశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కి సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసింది.

ఆమె సమస్యపై త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితురాలికి న్యాయం చేయడంలో జాప్యం వహించడంతో, తనకు న్యాయం జరగలేదనే మనస్థాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడి మరణించింది. ఈ సంఘటనపై బందరు తాలూకా ఎస్ ఐ, బందరు రూరల్ సిఐ పై పూర్తి విచారణ జరిపి, జిల్లా ఎస్పీ క్రమశిక్షణా రాహిత్య చర్యలకు ఉపక్రమించారు. అలాగే కిందిస్థాయి సిబ్బంది యొక్క పనితీరు పై సరైన పర్యవేక్షణ లేని కారణంగా బందరు డీఎస్పీ మాసుం భాషా కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సమస్యలతో వచ్చిన బాధితులు యొక్క ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన, ఏ స్థాయి సిబ్బంది పైన అయిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని జిల్లా ఎస్పీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.