Suryaa.co.in

Entertainment

సినిమా గోత్రం..సింగీతం!

విశాఖలో కొప్పరపు కవుల కళాపీఠం జాతీయ ప్రతిభా పురస్కారం అందుకుంటున్న దర్శక దిగ్గజం.. లివింగ్ లెజెండ్ సింగీతం శ్రీనివాసరావుకు అభినందనలతో

ఆయన..
మాయాబజార్ సినిమాలో
ఎస్వీఆర్ నటవిరాట్ స్వరూపం చూసాడు..
మాయా శశిరేఖ
ఆడ ఘటోత్కచ రూపంతో
విజృంభించిన విన్యాసాలకూ
ప్రత్యక్ష సాక్షే..
శ్రీకృష్ణుడిగా నందమూరి
తారక రామారావు
సమ్మోహన రూపమూ
గాంచినాడు..
నీవేనా నను తలచినది..
నీవేనా నను పిలిచినది..
ప్రియదర్శినిలో అభిమన్యుడు అక్కినేని
ఆభినయాన్నీ తిలకించాడు.
మొదట శశిరేఖాభిమన్యులు
పిదప రుక్మిణీకృష్ణులు..
అంతిమంగా
రేవతిబలరాములు
నౌకావిహారం చేయగా..
అక్కినేని..సావిత్రి
నందమూరి చాకచక్యంతో
తప్పించుకున్న వైనమూ.
ముందుగా మేలమాడినా
సిగ్గుపడుతూ ఛాయాదేవి
గుమ్మడి వెంట
పడవ ఎక్కిన విథానమూ
సావధానంగా
పరికించిన ధన్యుడు..
అంతేనా..
మీరే నా గురువంటూ
పట్టుబట్టి కెవిరెడ్డి కాడ
దర్శకత్వ శిష్యరికం చేసినందుకు
మార్కస్ బ్యారట్లే కెమెరా మ్యాజిక్కులు..
ఘంటసాల మ్యూజిక్కులు..
వివాహ భోజనంబు
వింతైన వంటకంబు టెక్నిక్కులు.
ఆ మాయాబజార్ మూలమూలా
చూసిన మనిషి.
యూనిట్ మొత్తం
స్వర్గపురి చేరినా
ఇప్పటికీ ఆ కళాఖండం
కీర్తిని ఆస్వాదిస్తూ
భువిలో చిరంజీవిగా
మిగిలిన సినిమా జీవి..

సింగీతం..
ఆయన ఆరున్నొక్క దశాబ్దాల వెండితెర మనోగతం!
సినిమా గతం..
వర్తమానం..
భవిత ఆయన కత
ఒక రామారావు
ఏకో అనేకో హమస్మి ఆంటూ ఐదుగురిగా
విడివడి కలివిడిగా
ఏక సమయంలో
నాలుగు వాద్యాలు వాయిస్తూ
శివశంకరీ
శివానంద లహరి
అంటూ గంధర్వగానంతో
దేవతామూర్తికి శాపవిమోచనం గావించిన
అపురూప ఘట్టమూ
ఈ శ్రీనివాసరావు
కళ్ళ ముందే జరిగింది..!
దృశ్యాన్ని దృశ్యకావ్యంగా
మలిచే కెవిరెడ్డి మహిమ..
పెంచింది ఇతగాడి పటిమ!

ఇన్ని నేర్చినోడు.. చూసినోడు ఊరికే ఉంటాడా
గురువు పరువు నిలబెడుతూ పాతాళభైరవిని
అటూ ఇటూ పామి..
ఏం తీసేడురా ఈ సామి
అయ్యని పోలిన కొడుకుతో
భైరవద్వీపం
ఎంత ఎంత
వింత మోహమో
అలా అందించాడు
తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ
తాళాన్వితం..
చాన్నాళ్ళకు జిక్కీ నోట
జాణవులే వరవీణవులే..
పలికించిన
సంగీత ప్రియుడు
సింగీతం తాను స్వయంగా
ఇచ్చాడు రెండు కన్నడ సినిమాలకు సంగీతం!
మొన్న లాక్డౌన్లో
తానూ స్వయంగా పాడి
అలరించిన స్రష్ట
అన్ని రంగాల్లోనూ శ్రేష్ట..

ఇంగితం తెలిసిన
ఈ సింగీతం
ప్రపంచాన్ని వెనక్కీ ముందుకీ తీసుకువెళ్ళే
టైం మిషన్ తో
ఆడుకున్నాడు..
శబ్దాలు నేర్చిన బయస్కోపును
మూకాభినయంతో
పుష్పకవిమానం
ఎక్కించాడు..
మహానటులకు నటన నేర్పి
తాను నటించడం మానేసిన
ఎల్వి ప్రసాదును మరోసారి
కెమెరా ముందుకు తెచ్చి
అమావాస్యచంద్రుడులో
చూపించాడు!

అంతకు ముందే..
తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేని పాట..
పాడనా తెలుగు పాట
పరవశనై..నే పరవశనై
నీ ఎదుట నీ పాటని
అమెరికాఅమ్మాయి తో
పాడించి ప్రేక్షకలోకాన్ని
పాలించాడు..

సిరిమల్లె నీవే,విరిజల్లు కావె
వరదల్లె రావె..
వలపంటి నీవే
అభిరుచి ఉన్న దర్శకుడు
ఎప్పటికీ దార్శనికుడు
ఎన్ని సినిమాలు తీసాడో
ఎంత సినిమా చూసాడో
ఈ శ్రీనివాసరావు..

సింగీతం
ఆయన జీవితమే
సినిమా కథ..
తనే రాసుకున్న స్క్రీన్ ప్లే
మ్యూజిక్కు ఆయన మ్యాజిక్కు
మాటలు లాజిక్కు
సినిమానే
ఆయన కిక్కు..లక్కు
మొత్తంగా ఆయనే
ఓ సినిమా బుక్కు

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE