Suryaa.co.in

Andhra Pradesh

బస్సుల్లో నిద్ర..ఆకలితో కేకలు..ఇదేనా యోగాంధ్రా?!

– పిడిఎస్ఓ

విశాఖపట్నంలో జూన్ 21, 2025న జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (యోగాంధ్ర 2025) సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, లంబసింగి వంటి గిరిజన ప్రాంతాల నుంచి 25,000 మంది విద్యార్థులను కనీస సౌకర్యాలు లేకుండా తరలించిన ప్రభుత్వం యొక్క దారుణ నిర్లక్ష్యాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ( పిడిఎస్ఓ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ తీవ్రంగా ఖండించారు.

గిన్నిస్ రికార్డు కోసం 108 సూర్యనమస్కారాలు చేయించేందుకు ఈ విద్యార్థులను జూన్ 20 తెల్లవారుజామున ప్రత్యేక బస్సుల్లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు తీసుకొచ్చారు. అయితే సరైన ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక, ఆకలితో అలమటించిన చిన్నారులు హాహాకారాలు చేశారు. వసతి ఏర్పాట్లు లేక, వందల మంది మైదానాల్లో, బస్సుల్లో నిద్రించారు. రోడ్డుపై భోజనాలు తీసుకోవాల్సిన దుస్థితి, క్యూలైన్లలో గంటల తరబడి నీరు, భోజనం కోసం వేచి ఉండాల్సిన అవస్థ ఏర్పడింది. ఈ అమానవీయ చర్య ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం మరియు గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిని స్పష్టం చేస్తోంది.

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర-రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు మూడు రోజుల ముందుగానే విశాఖపట్నంలో ఉండి కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ, విద్యార్థుల పరిస్థితిని పట్టించుకోలేదు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రౌండ్‌కు చేరిన విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక, మధ్యాహ్నం 3:30కు ప్రారంభం కావాల్సిన యోగాసనాల కార్యక్రమం ఆలస్యమై, సాయంత్రం 4:45కు 108 నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేయించారు.

రాత్రి 8 గంటల వరకు గ్రౌండ్‌లోనే ఉంచిన విద్యార్థులకు సరిపడా భోజనం అందక, ఆకలితో ఇబ్బంది పడ్డారు. అర్ధరాత్రి కొంతమందికి భోజనం అందినా, విశాఖ వ్యాలీ, పెందుర్తిలోని కళ్యాణ మండపాలకు తరలించిన కొంతమందికి తప్ప, మిగిలిన వారికి వసతి లేక బస్సుల్లో, గ్రౌండ్‌లో నిద్రించాల్సి వచ్చింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకే సిద్ధంగా ఉండాలని ఆదేశించడం ప్రభుత్వం యొక్క విద్యార్థుల పట్ల ఉదాసీనతను తెలియజేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రచార ఉత్సవంగా మార్చి, విద్యార్థులను కేవలం సంఖ్యలుగా భావించిన ప్రభుత్వం, గిరిజన చిన్నారుల ఆరోగ్యం, భద్రతను పూర్తిగా విస్మరించింది.

గిన్నిస్ రికార్డుల కోసం గిరిజన విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, విద్యార్థుల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై స్వతంత్ర విచారణ జరపాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను ప్రభుత్వ ప్రచార ఉత్సవాల కోసం ఉపయోగించరాదనే కఠిన నిబంధనలు రూపొందించాలని పిడిఎస్‌ఓ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE