ఏపీలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలు

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కేసింగ్‌తో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే.సింగ్ తో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. మన్నవరం, కొప్పర్తి పారిశ్రామికవాడల్లో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఏపీలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మంత్రి మేకపాటి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల మంజూరు గురించి ప్రధానంగా చర్చించారు.
7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన ప్యానళ్ళ వంటి పరికరాలను ఏపీలో తయారు చేయాలని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి పేర్కొన్నారు. అయితే, కోలిండియా, పవర్ మినిస్ట్రీ సహకారంతో 3 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర మంత్రి బదులిచ్చినట్లు మంత్రి తెలిపారు.
కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించిన 3 ప్రాజెక్టులను ఏపీలో మన్నవరంలో, కోలిండియా తరపున 4 గిగా హెర్ట్జ్ మాన్యుఫాక్చరింగ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర వినతులను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి వినతుల పట్ల ఆర్.కే.సింగ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.