Suryaa.co.in

Andhra Pradesh

సూఫీ సద్గురువు అతావుల్లా బాబా అస్తమయం

శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు
చీమలపాడు, నవంబర్19 : ఆధ్యాత్మిక శిఖరం, అలుపెరుగని అన్నదాత, సూఫీ సద్గురువు బాబా ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా ఖాదరీ (85) శుక్రవారం ఉదయం అస్తమించారు. బాబా వారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వారి సహధర్మచారిణి ఇటీవలనే జులై మాసంలో పరమపదించారు. బాబా వారి పవిత్ర పార్థివ శరీరాన్ని భక్తుల దర్శనార్థం దర్బారు ప్రాంగణంలో ఉంచారు. దేశ వ్యాప్తంగా ఉన్న వారి భక్తుల కోరిక మేరకు బాబె బొగ్దాద్ సూఫీ స్థలిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు అంతిమ సంస్కారం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
1936 నవంబర్ 25 న చీమలపాడు గ్రామంలో జన్మించిన బాబా వారికి ఆరు దినాల పసి శిశువుగా వున్నపుడే కన్నతల్లి కన్ను మూశారు. వీరిని మేనత్త పెంచి పెద్ద చేశారు. బాల్యం నుంచే బాబా గారు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. చీమలపాడు గ్రామంలో ఉర్దూ అధ్యాపకులుగా పని చేసిన అబ్దుల్ మజీద్ గారి ద్వారా విజయనగరం పట్టణానికి చెందిన సూఫీ గురువు బాబా ఖాదర్ వలీ ఔలియా శిష్యరికంలోకి వెళ్ళారు. దేశదేశాలకు చెందిన సూఫీ మహాత్ముల దర్గాలను సందర్శించడంతో పాటు వారి ఆదేశాల మేరకు చీమలపాడు కొండమీద, తన నివాసం పక్కనే ప్రత్యేకంగా నిర్మించుకున్న ప్రార్థనాగృహంలో దైవ చింతనలో గడిపారు. దాదాపు అయిదు దశాబ్దాలుగా పెద్ద స్థాయిలో అన్నదానం చేస్తూ అలుపెరగని అన్నదాతగా కీర్తిని గడించారు.
ధనదాహంతో మితి మీరిన పరుగులను ఆయన నిరసించారు. మనిషినీ, మానవ ప్రపంచాన్నీ కాపాడగలిగేది పేదల పట్ల ప్రేమ, మనశ్శాంతి మాత్రమేనని ఆయన ఉపదేశించేవారు. ప్రకృతి సమతుల్యతను పరిరక్షించుకుంటేనే మానవ జాతికి మనుగడ వుంటుందని బాబా నిరంతరం ప్రాధేయపడి చెప్పేవారు.
ప్రస్తుతం మానవ సమాజంలో నైతికతకు నిలువ నీడ లేకుండా పోయిందనీ, ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే నైతికతకు ప్రాణప్రతిష్ఠ చేయగలమని బాబా చెప్పేవారు.సకల ధర్మాల సారం సూఫీ మార్గం అని ఆయన మనసా వాచా విశ్వసించారు. దైవభీతి స్థానంలో దైవప్రేమ అనే భావనను ప్రపంచ వ్యాప్తంగా మానవ సమాజంలో పరివ్యాప్తం చేయటానికి ప్రతి మనిషీ కృషి చేయాలని ఆయన వాంఛించారు.
అనేకానేక సన్మానాలు, భారత సేవకరత్న, సమైక్య భారత స్వర్ణ పురస్కారం, గ్రామోదయ, బంధుమిత్ర వంటి అనేక అవార్డులు కూడా వారికి లభించాయి.
గత ఒకటి రెండు మాసాలుగా అస్వస్థులుగా వున్న బాబా దాదాపుగా నెల రోజుల నుంచి ఔషధాలు, అన్నపానీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
బాబా వారి అస్తమయం వార్త విని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, పరిసర ప్రాంతాలకు చెందిన సాధారణ ప్రజానీకం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

LEAVE A RESPONSE