ఉక్రెయిన్ లో భారతీయుల తరలింపునకు ప్రత్యేక రైళ్లు

309

– బండి సంజయ్ చొరవతో కదిలిన యంత్రాంగం
– సరిహద్దుల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండగా, మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బాధిత తెలుగు విద్యార్థులను తరలించేందుకు నిరంతరం సహకారం అందిస్తున్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుకు దూరంగా ఉన్న బాధితులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులు సరిపోకపోవడంతో, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను బండి సంజయ్ కుమార్ భారత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించిన భారత రాయబార కార్యాలయ అధికారులు ఉక్రెయిన్ దౌత్య అధికారులతో మాట్లాడి, రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. దీంతో 1500 మంది భారతీయ విద్యార్థులు స్లొవేకియా, హంగేరి సరిహద్దులకు పయనమయ్యారు.షీ ఫౌండేషన్ చైర్ పర్సన్, డబ్ల్యూహెచ్ సీ ఇండియా మిషన్ హెడ్ డా. సుధా రెడ్డి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

రెండ్రోజుల క్రితం ( ఫిబ్రవరి 28న) ఉక్రెయిన్ బాధిత విద్యార్థులు, వారి తల్లితండ్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నాయకులతో వర్చువల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ కుమార్ తో పాటు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో జపొరోజియా రాష్ట్రంలోని జపొరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులతో పాటు, సమీపంలో సుమారు 1500 మంది భారతీయులు బంకర్లలో తలదాచుకున్నారని, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులూ పెద్ద సంఖ్యలో ఉన్నారని ఈ సమావేశం దృష్టికి వచ్చింది.

యుద్ధం నేపథ్యంలో వారంతా స్లవోకియా, హంగేరి సరిహద్దుకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ భారతీయులను తరలించేందుకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న భారతీయులను సరిహద్దు పట్టణం ఉజ్గారోడ్ తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయించేందుకు సహకరించాల్సిందిగా డా. సుధా రెడ్డి బండి సంజయ్ కుమార్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్, వెంటనే ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

బండి సంజయ్ అభ్యర్థనతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా, వారు స్థానిక అధికారులను సంప్రదించి భారతీయులను తరలించేందుకు రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 1500 మంది భారతీయులు స్లవేకియా, హంగేరి సరిహద్దు పట్టణమైన ఉజ్గారోడ్ కు బయలుదేరారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ సరిహద్దు దాటితే ‘ఆపరేషన్ గంగా’ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా వారు స్వదేశం రావడం సులువవుతుంది.

తన విజ్ఞప్తిని మన్నించి భారతీయ విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన బండి సంజయ్ కుమార్ సహా సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయ అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి డా. సుధా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఉక్రెయిన్ బాధితుల తరలింపు విషయంలో బండి సంజయ్ కుమార్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉక్రెయిన్ బాధితుల సహాయార్థం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులతో వీడియా కాల్ ద్వారా, బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారిలో భరోసా నింపుతున్నారు. ఆయా విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరవేస్తూ స్వదేశానికి తరలించేలా పర్యవేక్షిస్తూనే ఉన్నారు.