Suryaa.co.in

Features

లెక్కల్లో లైఫ్..కొందరికి లెక్కేలేని లైఫ్

తాను ఒంటరైన వేళ
తన విలువ శూన్యమైనా..
కలవరపడి కలత చెందక..
అక్కున చేర్చుకున్న వారి విలువను
అమితంగా పెంచుతూ..
వద్దు పొమ్మని
తీసేసిన వారిని
తానసలు పట్టించుకొనక తటస్థమై..
అహంకారంతో విర్రవీగుతూ
గుణకారం చేసినవారి విలువను
అంతా శూన్యంగా మార్చి..
ప్రేమతో కోపావేశాలను భాగించుకొని
అనుబంధాల విలువను
గ్రహించుకొన్న వారికి
ఆనందమనే నిశ్శేషంగా
తాను మిగిలి నిశ్చింతనే గూర్చి..
నిర్భయంగా నిర్వికారంగా
నిలిచి ఉండేదే సున్నా

ఆ సున్నాతో
శ్రీకారం చుట్టి…
జగతికి వెలుగునిచ్చే
సూర్య భగవానుడొక్కడు..
లోకాన్ని అవలోకించే
నయనాలు రెండు..
సృష్టి స్థితి లయకారులైన
వేల్పులు ముగ్గురు..
ధర్మాన్ని బోధించే
వేదాలు నాలుగు..
చేతనత్వము గూర్చే
ఇంద్రియాలు ఐదు..
రసనకు అవగతమయ్యే
రుచులేమో ఆరు..
శ్రవణానందం గూర్చే
సుస్వరాలు ఏడు..
లోకానికి హద్దులైన
దిక్కులు ఎనిమిది..
అనుభూతిని వెల్లడించే
భావాలు తొమ్మిది..
ఇదీ లెక్క…
అలా అంకెలన్నీ కలగలిసి
సంఖ్యలుగా అవతరించి..
సంకలన వ్యవకలనాలుగా
గుణకార భాగహారాలుగా
పలు ప్రక్రియలుగా
వ్యాప్తి చెంది..
కూడికలు.. తీసివేతలుగా..
వెతలు..వేతనాలుగా..
నిత్యజీవతంలో భాగమై..
తామే జీవితమై…
అందరికి అవసరమై..
గణితం లేక గమనం లేదని
లెక్కలు లేని జీవితం
లెక్కలోకి రాదని..
జగతిని శాసిస్తున్న గణితాన్ని..
ఆశగా శ్వాసగా ధ్యాసగా
అభ్యసించి ఆస్వాదించి
అద్భుతాలు సృష్టించిన
అనుపమాన గణితమేధావి శ్రీనివాస రామానుజన్..
మేధావులకైనా అర్థం కాని..
బ్రహ్మ పదార్థాలని వదిలేసిన
లెక్కల చిక్కులు రామానుజన్ కు కిక్కులు..
వాటిపైనే ఆయన దృక్కులు..
తేల్చేసాకే మేధావికి నిద్ర..
అలాంటి లెక్కలపైన
ఆయన శాశ్వత ముద్ర..!జీవితమంతా లెక్కల్లో బ్రతికాడు..
చనిపోయి కొన్ని కష్టమైన లెక్కలను బ్రతికించాడు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE