విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విప్రో వృద్ధి వ్యూహం, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఐటి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించండి.
ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, పునరుత్పాదక శక్తిలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటి వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయడానికి నైపుణ్య కార్యక్రమాలపై విప్రోతో సహకరించండి. వైజాగ్, విజయవాడలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, ఆర్ అండ్ డి హబ్‌ల ఏర్పాటును అన్వేషించండి. ఇప్పటికే ఎపిలో హెచ్ సిఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, జోహో, డబ్ల్యుఎన్ ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సియంట్ వంటి సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. త్వరలో విశాఖపట్నానికి టిసిఎస్ రాబోతోంది.
ప్రస్తుతం ఎపిలో ఐటి సంస్థలకు పూర్తి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. రిషద్ ప్రేమ్ జీ మాట్లాడుతూ… రాబోయే అయిదేళ్లలో విప్రో జిఇ హెల్త్ కేర్ భారత్ లో తయారీ, ఆర్ అండ్ డి రంగాల్లో 8వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. విప్రో సంస్థ రెండున్నర లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాల్లో గ్లోబల్ ఐటి సేవలను అందిస్తోంది.
రూ.3.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటైజేషన్ తో ఏటా రూ.90వేలకోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్, బ్లాక్ చైన్, ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నా, ఎపి ప్రభుత్వ విజ్ఞప్తిపై బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రిషబ్ ప్రేమ్ జీ చెప్పారు.